Telugu Global
Others

ఎల్లో మీడియాకు పరాభవం...

తెలంగాణ ఎన్నికల్లో పచ్చ మీడియా సాగించిన హడావుడికి ఓటర్లు తమ తీర్పు ద్వారా చుక్కలు చూపించారు. ప్రధానంగా టిఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని కూటమిని అధికారంలోకి తీసుకురావాలని శ్రమించిన మీడియా వర్గాలకు పరాభవమే మిగిలింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ఘోర పరాజయం తప్పదని కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని మహాకూటమి విజయ దుందుభి మోగిస్తుందని కొన్ని మీడియా సంస్థలు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా అభిప్రాయాన్ని ఓటర్ల మెదళ్ళలోకి ఎక్కించి ఎన్నికల ఫలితాలు తారుమారు చేయాలని ప్రయత్నించాయి. బాబు రచించిన వ్యూహానికి తెరపైన, […]

ఎల్లో మీడియాకు పరాభవం...
X

తెలంగాణ ఎన్నికల్లో పచ్చ మీడియా సాగించిన హడావుడికి ఓటర్లు తమ తీర్పు ద్వారా చుక్కలు చూపించారు. ప్రధానంగా టిఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని కూటమిని అధికారంలోకి తీసుకురావాలని శ్రమించిన మీడియా వర్గాలకు పరాభవమే మిగిలింది.

ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ఘోర పరాజయం తప్పదని కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని మహాకూటమి విజయ దుందుభి మోగిస్తుందని కొన్ని మీడియా సంస్థలు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా అభిప్రాయాన్ని ఓటర్ల మెదళ్ళలోకి ఎక్కించి ఎన్నికల ఫలితాలు తారుమారు చేయాలని ప్రయత్నించాయి. బాబు రచించిన వ్యూహానికి తెరపైన, ముద్రణలోనూ అధిక ప్రాధాన్యతను ఆ మీడియా సంస్థలు ఇచ్చాయి.

బాబు ఆధ్వర్యంలో కూటమి మంచి ముందడుగులో ఉందని ఇక గెలుపే ఆలస్యం అంటూ విస్తృతంగా అభిప్రాయం కలిగించాయి. ఇక జాతీయ స్థాయిలో బాబు వేస్తున్న ఎత్తుగడల్లో భాగంగా తెలంగాణలో బిజెపి, టిఆర్‌ఎస్‌ చిత్తవుతున్నట్లు పుంఖాను పుంఖాలుగా అభిప్రాయాలను కుమ్మరించాయి. ఇక గ్రాఫికల్‌ వర్క్‌లో భాగంగా సోషల్‌ మీడియాలో దొంగ సర్వేలను ఈ మీడియా సంస్థలు విపరీతంగా వ్యాప్తి చేశాయి. ఇదంతా కూడా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శకత్వంలోనే జరిగింది.

టివి మీడియా, ప్రింట్‌ మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో కూటమి అధికారంలోకి వచ్చేస్తుందునే అభిప్రాయం కలిగించడం వెనుక ఓటర్లను ప్రభావితం చేయడం ద్వారా చంద్రబాబు రాజకీయ వ్యూహచతురతను మరోసారి జాతీయ స్థాయిలో నిరూపించాలని ఆ మీడియా సంస్థలు కంకణం కట్టుకోగా ఓటర్లు దిమ్మతిరిగే తీర్పునిచ్చారు.

ఈ ఎన్నికల్లో ఊహంచని విధంగా ముఖ్య మీడియా సంస్థలు కాంగ్రెస్‌కు అండగా నిలిచాయి. రెండు మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ వ్యతిరేక గీతాన్ని ఆలపిస్తూ వచ్చిన ఆ మీడియా సంస్థలు చంద్రబాబు కాంగ్రెస్‌ పంచన చేరేసరికి తాము కూడా తక్కువేమి కాదన్నట్లు ఒక్కసారిగా తమ ఆలాపనను మార్చేశాయి.

ఉభయ తెలుగురాష్ట్రాల్లోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఏ రోజు కూడా మీడియా వ్యవహరించలేదు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనప్పటినుంచి మరీ ముఖ్యంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన పంచన చేరి కాంగ్రెస్‌పై విషం కక్కుతూ వచ్చాయి. అందులోనూ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకు ముందు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్‌ వ్యతిరేక వైఖరితో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి చిలవలు పలవలుగా, పుంఖాను పుంఖాలుగా తమ అభిప్రాయాలను ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తుండేవి.

అటువంటి మీడియా ఒక్కసారిగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌వైపు యూటర్న్‌ తీసుకుని ఆ పార్టీ ఆధ్వర్యంలో మహాకూటమిని పల్లకిలో ఎక్కించుకుని మరీ మోసింది. ప్రధానంగా రెండు మీడియా సంస్థలు తమ పరిధికి మించి పనిచేస్తున్నాయంటూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ బహిరంగంగానే ఆవేదన, ఆక్రోశం వెల్లగక్కారు.

మీడియా ఈ విధంగా తమ వార్తల ప్రసార, ప్రచార విధానాన్ని మార్చుకోవడం వెనుక చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. ఇందుకుగానూ ఆయా మీడియా వర్గాలకు పెయిడ్‌ ఆర్టికల్స్‌, తెలంగాణ ఎన్నికల యాడ్స్‌, ఏపి ప్రభుత్వ విజయాల ప్రచారం పేరుతో వేలకోట్ల రూపాయలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ తరహా ప్రయోజనాల వల్లనే ఆయా మీడియా సంస్థలు బాబుపట్ల తమవాడనే కారణంతోపాటు మరింత అభిమానాన్ని ప్రదర్శిస్తుంటాయి.

2014 ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ తెలంగాణ అధికారంలోకి రాగా ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీడియా సంస్థలు మరీ ముఖ్యంగా 4 ఛానళ్ళు, 2 ప్రింట్‌ మీడియా సంస్థలు అక్కడో విధానం ఇక్కడో విధానం అవలంబించడం ప్రారంభించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పట్ల ప్రేమతో, అభిమానం రంగరించి ప్రజలకు ఆయన పట్ల మరింత సదభిప్రాయం కలిగించే విధంగా ప్రతీ అంశాన్ని పూసగుచ్చినట్లు ప్రచురించేవి. ప్రచారం, ప్రసారం సాగించేవి.

ఇక తెలంగాణకు వచ్చేసరికి ఆయా సంస్థలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, ఆస్తుల రక్షణ కోసం ఇష్టం ఉన్నా లేకపోయినా టిఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చాయి. మీడియా స్వతంత్రంగా వ్యవహరించడం కనుమరుగైపోయింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి…. అందులోనూ చంద్రబాబు రక్షణే ధ్యేయంగా నిర్ణయించుకున్న తరువాత వార్తల్లో నిష్పక్షపాతం కొరవడిపోయింది.

ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు తన రాజకీయ వ్యూహంలో భాగంగా మోడి వ్యతిరేకత పేరుతో కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి సైతం సిద్ధపడ్డారు. అసలు తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదం పేరుతో మహానటుడు ఎన్టీరామారావు ఏర్పాటు చేశారు. మీడియాలో ఓ వర్గం టిడిపికి మద్దతు ఎన్నికల సమయంలోనే ఇచ్చేది. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అనునిత్యం బాబుకు అండగా నిలబడుతూ వచ్చింది. ఆ క్రమంలోనే ఆయన ఎటువెళితే అటువెళ్ళటం ఆ మీడియాకు అలవాటుగా మారిపోయింది.

ఆ విధంగా మీడియా కూడా బాబుతో పాటే కాంగ్రెస్‌ను మోయటం ప్రారంభించింది. మూడు దశాబ్దాల కాలంలో ఎప్పుడూ లేనివిధంగా తొలిసారిగా కాంగ్రెస్‌కు మీడియా అండదండలు లభించడంతోపాటు కూటమి అధికారంలోకి వచ్చేస్తోందని ప్రచారం సాగించడంతో అసలుకే మోసం వచ్చింది. ఉన్నసీట్లు కూడా కాంగ్రెస్‌ కోల్పోవాల్సి వచ్చింది. బాబు మాయాజాలం వల్ల ఓట్లు రాకపోగా ఉన్నసీట్లు, ఓట్లను కాంగ్రెస్‌పార్టీ కోల్పోవడంలో మీడియా పాత్ర కూడా మరువలేనిది.

First Published:  11 Dec 2018 8:00 AM IST
Next Story