Telugu Global
NEWS

ట్ర‌క్కు గుర్తుతో గులాబీ దళానికి టెన్ష‌న్‌

గ‌త ఎన్నిక‌ల్లో ఆటో గుర్తు క‌ల‌వ‌ర పెట్టింది. కారు, ఆటో గుర్తుకు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర పోలిక‌లు ఉండ‌డంతో…. చాలా మంది వృద్దులు, చూపు సరిగ్గా క‌నిపించ‌ని వారు ఆటో గుర్తుకు ఓటేశారు. దీంతో గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నాగ‌ర్ క‌ర్నూలు లోక్‌స‌భ స్థానం టీఆర్ఎస్ కోల్పోయింది. ఇక్క‌డ పోటీ చేసిన కాంగ్రెస్ అభ్య‌ర్థి నంది ఎల్ల‌య్య స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. నంది ఎల్ల‌య్య‌కు 4,20,075 ఓట్లు రాగా… టీఆర్ఎస్ అభ్య‌ర్థి మందా జ‌గ‌న్నాథంకు 4,03,399 ఓట్లు ప‌డ్డాయి. […]

ట్ర‌క్కు గుర్తుతో గులాబీ దళానికి టెన్ష‌న్‌
X

గ‌త ఎన్నిక‌ల్లో ఆటో గుర్తు క‌ల‌వ‌ర పెట్టింది. కారు, ఆటో గుర్తుకు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర పోలిక‌లు ఉండ‌డంతో…. చాలా మంది వృద్దులు, చూపు సరిగ్గా క‌నిపించ‌ని వారు ఆటో గుర్తుకు ఓటేశారు. దీంతో గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నాగ‌ర్ క‌ర్నూలు లోక్‌స‌భ స్థానం టీఆర్ఎస్ కోల్పోయింది.

ఇక్క‌డ పోటీ చేసిన కాంగ్రెస్ అభ్య‌ర్థి నంది ఎల్ల‌య్య స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. నంది ఎల్ల‌య్య‌కు 4,20,075 ఓట్లు రాగా… టీఆర్ఎస్ అభ్య‌ర్థి మందా జ‌గ‌న్నాథంకు 4,03,399 ఓట్లు ప‌డ్డాయి. అయితే ఇక్క‌డ స్వ‌త్రంత్రంగా ఆటో గుర్తుపై పోటీ చేసిన శ్రీనివాస్‌కు 54,680 ఓట్లు ప‌డ్దాయి. కారు గుర్తు అనుకుని పొర‌పాటున ఆటోకు వేయడంతో శ్రీనివాస్‌కు 50వేల‌కు పైగా ఓట్లు వ‌చ్చాయ‌ని ఆ త‌ర్వాత ఎన్నిక‌ల పోస్టుమార్ట‌మ్‌లో బ‌య‌ట‌ప‌డింది.

అంతేకాకుండా దాదాపు ఆటో గుర్తు ఉన్న నియోజ‌క‌ వ‌ర్గాల్లో త‌మ ఓట్ల‌కు గండి ప‌డిందని గులాబీ సేన గ్ర‌హించింది. దీంతో ఈ సారి ఎన్నిక‌ల్లో ఆటోగుర్తు లేకుండా జాగ్ర‌త్త‌పడింది. ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసి ఆటో గుర్తు కేటాయించ‌కుండా చూసింది.

ఆటో గుర్తు పోతే…. ట్ర‌క్కు గుర్తుతో ఈ సారి మ‌ళ్లీ మొద‌టికి మోసం వ‌చ్చిన‌ట్లు కొంద‌రు గులాబీ అభ్య‌ర్థులు ల‌బోదిబోమంటున్నారు. దాదాపు 35 నియోజ‌క‌ వ‌ర్గాల్లో స‌మాజ్‌వాదీ పార్వ‌ర్డ్ బ్లాక్ అభ్య‌ర్థులు పోటీ చేశారు. వీరికి ట్ర‌క్కు గుర్తు వచ్చింది. వృద్ధులకు సరిగ్గా కనపడకపోవడంతో కారుకు వేయ‌బోయి… ట్ర‌క్కుకు వేశార‌ని పోలింగ్ పోస్టుమార్టంలో బ‌య‌ట‌ప‌డడంతో కొంద‌రు గులాబీ అభ్య‌ర్తులు ల‌బోదిబోమంటున్నారు. టఫ్ ఫైట్ ఉన్న ద‌గ్గ‌ర కొంద‌రు నేత‌లు టెన్ష‌న్ పడుతున్నారు.

కారుకు, ట్రక్కు పోలిక ఉండటం వల్ల కనుచూపు తక్కువ ఉన్న వృద్ధులంతా కారు అని ట్రక్కు పైన ఓటు వేశారని అందరూ తెల్లవారి నుంచి తలలు బాదుకుంటున్నారు. గతంలోనూ ఆటో గుర్తు కారణంగా…. కారు కు రావాల్సిన ఓట్లు పోయాయి. ఇప్పుడు మరింతగా కారు, ట్రక్కు ఒకే పోలిక ఉండటం వల్ల తీవ్ర నష్టం జరుగుద్దేమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

దాదాపు ప‌ది నియోజ‌క‌ వ‌ర్గాల్లో కాంగ్రెస్‌, టీఆర్ఎస్ మ‌ధ్య హోరాహోరీ ఉంది. ఇక్క‌డ ట్ర‌క్కు గుర్తు వ‌ల్ల కారుకు న‌ష్టం జ‌రిగితే…త‌మ జాతకాలే మారిపోతాయ‌ని కొంద‌రు గులాబీ అభ్య‌ర్ధులు ఆందోళ‌న చెందుతున్నారు. ట్ర‌క్కు గుర్తు వ‌ల్ల కారుకు ఎంత న‌ష్టం జ‌రిగిందో తెలియాలంటే మంగ‌ళ‌వారం ఈవీఎంలు తెరిచే వ‌ర‌కు ఆగాల్సిందే.

First Published:  9 Dec 2018 3:42 AM IST
Next Story