Telugu Global
NEWS

గెలిస్తే ఆ మీడియా పెద్దలను ఏం చేస్తారో!

రెండు మీడియా సంస్థలు హఠాత్తుగా రంగులు మార్చాయని మాజీ మంత్రి కేటీఆర్ మీడియా ప్రతినిధుల వద్ద వాపోయారు. వారిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. డిసెంబర్‌ 11న ఆ మీడియా అధినేతల పేర్లు కూడా చెబుతానని ప్రకటించారు. అయితే ఆ మీడియా సంస్థలు ఇప్పుడు ఎదురు తిరిగాయి కానీ… మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌ పెద్దలకు అత్యంత చనువుగా ఉంటూ కావాల్సినన్ని పనులు చేయించుకున్నాయి. ఆ మీడియా పెద్దలు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మిన కేసీఆర్‌ వారికి కావాల్సిన సాయం […]

గెలిస్తే ఆ మీడియా పెద్దలను ఏం చేస్తారో!
X

రెండు మీడియా సంస్థలు హఠాత్తుగా రంగులు మార్చాయని మాజీ మంత్రి కేటీఆర్ మీడియా ప్రతినిధుల వద్ద వాపోయారు. వారిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. డిసెంబర్‌ 11న ఆ మీడియా అధినేతల పేర్లు కూడా చెబుతానని ప్రకటించారు.

అయితే ఆ మీడియా సంస్థలు ఇప్పుడు ఎదురు తిరిగాయి కానీ… మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌ పెద్దలకు అత్యంత చనువుగా ఉంటూ కావాల్సినన్ని పనులు చేయించుకున్నాయి. ఆ మీడియా పెద్దలు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మిన కేసీఆర్‌ వారికి కావాల్సిన సాయం చేశారు.

ఏపీలో చంద్రబాబుకు… తెలంగాణలో తమకు సదరు మీడియా సంస్థలు అనుకూలమని భ్రమపడ్డారు. ఓటుకు నోటు వరకు సదరు మీడియా సంస్థలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఏకధాటిగా వ్యతిరేక కథనాలు రాశాయి. కానీ ఓటుకు నోటు తర్వాత టీఆర్ఎస్‌కు సరెండర్‌ అయినట్టుగా మారిపోయాయి. ఒక మీడియా సంస్థ అధినేత కేసీఆర్‌తో అత్యంత చనువు పెంచుకుని భారీగా లాభం పొందారు.

ఒక పెళ్లికి సదరు పత్రికాధినేతను తన హెలికాప్టర్‌లో తీసుకెళ్లారు కేసీఆర్‌. కేసీఆర్‌కు దగ్గరయ్యేందుకు టీడీపీ నేతలు, సదరు మీడియా సంస్థల అధినేతలే ఒక కీలకమైన ఎత్తు కూడా వేశారు. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు…. ఇక్కడ తమ సామాజికవర్గం వారు అధికారం చేపట్టే బలం కూడా లేదు. కాబట్టి తెలంగాణలో టీఆర్‌ఎస్‌కే తాము అండగా ఉంటామని కేసీఆర్‌ను నమ్మించడంలో మీడియా సంస్థలు సక్సెస్ అయ్యాయి.

టీడీపీ, దాని అనుకూల మీడియా సంస్థల అధినేతలు వేసిన ఈ ఎత్తులో కేసీఆర్ చిక్కుకున్నారనే చెప్పాలి. కానీ ఓటుకు నోటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగానే కథనాలు రాస్తూ, కావాల్సిన పనులు చేయించుకుంటూ వచ్చిన వారు… హఠాత్తుగా ఎన్నికల వేళ గత నెల రోజులుగా ఎదురుతిరిగాయి. లగడపాటితో కూర్చుని మరీ మహాకూటమికి ఊపు తేవడం ఎలా అన్న దానిపై ఒక మీడియా అధినేత వ్యూహాలు రచించారట.

ఇప్పటి దాకా తమను నమ్మించి ఇప్పుడు మీడియా సంస్థల అధినేతలు మోసం చేశారని టీఆర్‌ఎస్ పెద్దలు గుర్తించారు. కాకపోతే ఎన్నికలు ముగిసే వరకు ఏమీ చేయలేని పరిస్థితి. ఒకవేళ టీఆర్‌ఎస్ తిరిగి అధికారం చేపడితే…. నమ్మించి ఎన్నికల వేళ వెన్నుపోటు పొడిచిన మీడియా సంస్థల అధినేతలపై కేసీఆర్‌ ఎలాంటి వైఖరి తీసుకుంటారో….!

First Published:  6 Dec 2018 7:08 AM IST
Next Story