Telugu Global
CRIME

ఇంగ్లీషులో ఉన్న కోర్టు ఆర్డర్ అర్థం కాక.... వ్యక్తిని జైల్లో పెట్టిన పోలీసులు

పోలీసులు చేసిన చిన్న తప్పు ఒక వ్యక్తిని రోజంతా తీవ్ర ఆందోళనకు గురి చేసింది. కోర్టు ఇచ్చిన తీర్పు ఇంగ్లీషులో ఉండటంతో.. దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయిన బీహార్ పోలీసులు ఒక వ్యక్తిని జైల్లో పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే…. పాట్నాకు చెందిన నీరజ్ కుమార్ అనే వ్యాపారికి తన భార్యతో విభేదాలు తలెత్తాయి. దీంతో వీరిరువురూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకొని కోర్టులో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కోర్టు పోలీసులకు ఒక […]

ఇంగ్లీషులో ఉన్న కోర్టు ఆర్డర్ అర్థం కాక.... వ్యక్తిని జైల్లో పెట్టిన పోలీసులు
X

పోలీసులు చేసిన చిన్న తప్పు ఒక వ్యక్తిని రోజంతా తీవ్ర ఆందోళనకు గురి చేసింది. కోర్టు ఇచ్చిన తీర్పు ఇంగ్లీషులో ఉండటంతో.. దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయిన బీహార్ పోలీసులు ఒక వ్యక్తిని జైల్లో పెట్టారు.

పూర్తి వివరాల్లోకి వెళితే….

పాట్నాకు చెందిన నీరజ్ కుమార్ అనే వ్యాపారికి తన భార్యతో విభేదాలు తలెత్తాయి. దీంతో వీరిరువురూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకొని కోర్టులో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కోర్టు పోలీసులకు ఒక వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్ అందుకున్న పోలీసులు సదరు వ్యాపారిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

అయితే ఆ వ్యాపారి తరపు న్యాయవాది ఆ ఆదేశాలను పూర్తిగా చదివిన తర్వాత పోలీసులు పొరపాటు చేసినట్లు తెలుసుకున్నారు. కోర్టు ఆదేశాలలో ‘డిస్ట్రెస్ వారెంట్’ అని ఉండగా…. పోలీసులు ‘వారెంట్’ అని ఉంది కదా…. అది అరెస్టు వారెంటే అనుకొని అతడిని అరెస్టు చేశారు.

వాస్తవానికి డిస్ట్రెస్ వారెంట్ అంటే ఎవరైనా వ్యక్తికి సంబంధించిన ఆస్తుపాస్తుల వివరాలు తెలుసుకోవడం, లేదా సీజ్ చేయడం అని అర్థం. కాని పోలీసులు తప్పుగా అర్థం చేసుకొని వ్యాపారిని అరెస్టు చేశారు.

పోలీసులు చేసిన పొరపాటుకు ఒక రోజంతా ఆ వ్యాపారి జైల్లో గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత అతడిని విడిచిపెట్టారు. కాని ఇది తనకు అవమానకరమని…. తాను ఎంతో ఆందోళన చెందానని ఆ నీరజ్ కుమార్ అంటున్నాడు. ఇంగ్లీషు అర్థం కాని పోలీసులకు కోర్టు పనులు ఎందుకు అప్పజెప్తారని ఆయన తరపు బంధువులు విమర్శించారు.

First Published:  3 Dec 2018 9:20 AM IST
Next Story