మాతృత్వానికి అవమానం
స్త్రీత్వం, మాతృత్వం తరచూ పురుషాహంకారానికి బలవుతూనే ఉన్నాయి. ఇది తరాల చరిత్ర కాదు. యుగాల చరిత్ర. బిడ్డకు పాలిచ్చే మహిళలో తల్లిని చూడాలని ఎన్నిహితవులు పలికినా అవి హితవచనాల జాబితాకే పరిమితమవుతున్నాయి. ఇప్పుడు కోల్‌కతాలోని ఓ మాల్‌లో ఓ తల్లికి – ఆమె బిడ్డకు తీరని అవమానం జరిగింది. ఆ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పుడు మాల్ యాజమాన్యం స్పందించిన తీరు మరీ అమానుషంగా ఉంది. వ్యాపారం కాసుల పంటే అయినా అంతకంటే ముందు […]
స్త్రీత్వం, మాతృత్వం తరచూ పురుషాహంకారానికి బలవుతూనే ఉన్నాయి. ఇది తరాల చరిత్ర కాదు. యుగాల చరిత్ర. బిడ్డకు పాలిచ్చే మహిళలో తల్లిని చూడాలని ఎన్నిహితవులు పలికినా అవి హితవచనాల జాబితాకే పరిమితమవుతున్నాయి.
ఇప్పుడు కోల్‌కతాలోని ఓ మాల్‌లో ఓ తల్లికి – ఆమె బిడ్డకు తీరని అవమానం జరిగింది. ఆ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పుడు మాల్ యాజమాన్యం స్పందించిన తీరు మరీ అమానుషంగా ఉంది.
వ్యాపారం కాసుల పంటే అయినా అంతకంటే ముందు మనిషి మనిషిగా ప్రవర్తించాలనే కనీస ధర్మాన్ని కూడా పాటించని వైనం ఇది.
అది కోల్‌కతాలోని సౌత్ సిటీ మాల్. ఓ తల్లి తన ఏడు నెలల పాపాయితో మాల్ కెళ్లింది. కొంతసేపటి తర్వాత పాపాయి ఏడవసాగింది. పాలిద్దామంటే ఎక్కడా కొంచెం చాటు కూడా లేదు. ఏ కార్నర్‌లో అయినా కర్టెన్ చాటుగా కూర్చుని పాలిద్దామంటే… ఒక్క కుర్చీ కూడా ఇవ్వలేకపోయిందా మాల్.
బిడ్డకు పాలివ్వడానికి వాళ్లు చూపించిన ప్రదేశం ఏమిటో తెలిస్తే కడుపు తిప్పుతుంది. నిజమే… ఆ ప్రదేశం టాయిలెట్. కనీసం విశాలమైన వాష్‌రూమ్ కూడా కాదు. చిన్న టాయిలెట్. నేచర్ కాల్స్‌ని పూర్తి చేసుకోవడానికి టాయ్‌లెట్ వెళ్లిన వాళ్లకు పని పూర్తయిన తర్వాత క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాదు. అలాంటిది బిడ్డకు పాలివ్వడానికి టాయిలెట్‌లోకి వెళ్లమని సలహా ఇచ్చింది మాల్ మేనేజ్‌మెంట్.
క్షణకాలం బిత్తరపోయిన ఆ తల్లి అప్పటికి ముళ్ల మీద గడిపినట్లు బిడ్డకు పాలిచ్చింది. కానీ మాల్ చేసిన అనైతిక చర్యను ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకుంది. తీవ్రమైన విమర్శలు రావడంతో మాల్ యాజమాన్యం స్పందించింది. అయితే ఆ స్పందన మరింత అమానుషంగా ఉంది. ”మీరు వచ్చేటప్పుడే బిడ్డకు పాలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవాలి. మాల్‌లో పాలివ్వాలంటే ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. పబ్లిక్ అసౌకర్యాన్నిదృష్టిలో పెట్టుకుని అలా వ్యవహరించాల్సి వచ్చింది. మా మాల్‌కు వచ్చే ఇతర కస్టమర్లను ఇబ్బందికి గురి చేయలేం” అన్నది. అందుకు మరింతగా ఆగ్రహించిన ఆ తల్లి మాల్ యాజమాన్యానికి కొన్ని ప్రశ్నలను సంధించింది.
- ఫుడ్ కోర్ట్‌ల కోసం ఒక ఫ్లోర్ మొత్తం వదులుతారు. అలాంటి చోట బేబీ ఫీడింగ్ కోసం పదడుగుల స్థలాన్ని కేటాయించ లేకపోతున్నారా?
- స్మోకింగ్ చేసే వాళ్ల కోసం స్మోకింగ్ జోన్ కి అవకాశం ఇస్తున్నారు. అలాంటిది పిల్లల ఆకలి తీర్చడానికి ప్లేస్ కల్పించాలని అనుకోవడం లేదా?
- పిల్లలు పుట్టడం, పెరగడం అన్నది నిత్యం కొనసాగే ప్రక్రియ. మాల్‌కి వచ్చిన వందమందిలో ఎప్పుడూ ఒకరిద్దరైనా బిడ్డల తల్లులుంటారు. మీరు… పిల్లలతో వచ్చేటప్పుడు ముందే ఆకలి తీర్చి తీసుకురావాలి కదా అన్నారు. నిజానికి పిల్లలు బయట ప్రదేశానికి వచ్చినప్పుడు ఏడ్చేది కేవలం ఆకలితోనే కాదు. దాహంతో గొంతు ఆర్చుకుపోయినా ఏడుస్తారు. అప్పుడూ పాలతో గొంతు తడపాల్సిందే. రణగొణ ధ్వనులతో ఆందోళన కలిగినా ఏడుస్తారు. అప్పుడు తల్లి దగ్గరకు తీసుకుని పాలిస్తే… తను భద్రమైన చోట ఉన్నాననే భరోసాతో ఏడుపు ఆపుతారు. ఒక తల్లికి బిడ్డగా పుట్టిన వాళ్లమే అందరం. ఈ విషయం తెలియకపోవడం బాధాకరం…. అంటూ వాతలు పెట్టినట్లు ప్రశ్నలు సంధించిందా తల్లి.
ఇలాంటివి జరిగినప్పుడు మహిళలు సున్నితంగా మాట్లాడాలి కానీ ఇంత దురుసుగానా అని విచిత్రంగా ఆశ్చర్యపోతుంటుంది పురుష ప్రపంచం. నిజానికి ఇంత ఘాటుగా స్పందించేది మహిళ కాదు ఆమెలోని తల్లి.
అయినా… మాల్ మొత్తంలో ఎక్కడా బిడ్డకు పాలివ్వడం కోసం స్థలాన్ని కేటాయించని పక్షంలో ఆ తల్లీబిడ్డల అవసరాన్ని గుర్తించిన మేనేజర్ తన క్యాబిన్‌లో నుంచి పది నిమిషాలు బయటకు వచ్చి, ఒక సేల్స్‌గర్ల్‌ని తోడిచ్చి ఉంటే ఆ తల్లి… బిడ్డకు పాలిచ్చేది కదా! మనసు పెట్టి ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. మెదడులో డబ్బులు, వ్యాపారమే నిండి పోతే ఇక పరిష్కారం దొరకదు.