ఇంద్రజిత్తు
ఇంద్రజిత్తు (Indrajit) ఎవరో తెలుసా? రావణుని పెద్ద కుమారుడు. ఇతని అసలు పేరు మేఘనాధుడు. మరి 'ఇంద్రజిత్తు' అని పేరు ఎలా వచ్చిందని దూ మీ అనుమానం? మేఘనాధుడు మహేశ్వర క్రతువు చేశాడు. తండ్రితో తనూ కలిసి వెళ్లి ఇంద్రుడితో యుద్ధానికి దిగాడు.
ఇంద్రజిత్తు ఎవరో తెలుసా? రావణుని పెద్ద కుమారుడు. ఇతని అసలు పేరు మేఘనాధుడు. మరి 'ఇంద్రజిత్తు' అని పేరు ఎలా వచ్చిందని దూ మీ అనుమానం? మేఘనాధుడు మహేశ్వర క్రతువు చేశాడు. తండ్రితో తనూ కలిసి వెళ్లి ఇంద్రుడితో యుద్ధానికి దిగాడు. ఇంద్రుడు రావణాసురున్ని ఓడించడమే కాదు, బంధించాడు కూడా. తండ్రికి జరిగిన పరాభవానికి మేఘనాధుడు ఊరుకుంటాడా? లేదు. విజృంభించాడు. మాయ చేశాడు. మామూలు మాయ కాదు. రాక్షస మాయతో యుద్ధానికి పూనుకున్నాడు. దేవతల రాజును ఈ రాక్షస పుత్రుడు ఓడించాడు. ఓడించడమే కాదు, బంధించి తన వెంట లాక్కుపోతుంటే బ్రహ్మ వచ్చి బతిమాలి ఇంద్రుడ్ని విడిపించాడు. ఇంద్రుడ్ని ఓడించడం వల్ల ఆనాటి నుంచి 'ఇంద్రజిత్తు'గా పేరొచ్చింది. జిత్తు అమరత్వాన్ని అడిగినా బహ్మ్ర ఇవ్వలేదు.
రామరావణ యుద్ధమప్పుడు సీతను రామునికి అప్పగించి స్నేహంగా మెలగమని రావణునికి విభీషణుడు సూచిస్తాడు. అందుకు ఇంద్రజిత్తు ఒప్పుకోడు. యుద్ధం చేయడమే మంచిదంటాడు.
ఇంద్రజిత్తు వెంటనే యుద్ధరంగంలోకి దూకలేదు. చాలా మంది రాక్షస వీరుల తలలు తెగినాక గురూపదేశంతో హోమం చేశాడు. హోమ గుండం నుంచి బంగారు రథం వచ్చింది. ఆ బంగారు రథమెక్కి యుద్ధ రంగానికి వచ్చాడు. మొదట అంగధుని చేతిలో ఓటమిని చవిచూసినా, మాయతో మంత్రతంత్రాలతో వానరసైన్యాన్ని ఆటలాడించాడు. అంతేనా? నాగాస్త్రం వేసి రామలక్ష్మణులు స్పృహ కోల్పోయేలా చేశాడు. ఆంజనేయుడు తెచ్చిన ఔషధ మూలికలతో ఆయువు నిలుపుకున్నాక రామలక్ష్మణులు తిరిగి యుద్ధం చేయడంతో ఇంద్రజిత్తుకు ఎదురు నిలవడం కష్టమైపోయింది. దాంతో 'మాయ సీత'ను సృష్టించాడు.
'రామా! నీ జానకిని ఖండిస్తున్నాను చూడు' అంటూ ఇంద్రజిత్తు మాయ సీతను కత్తితో ముక్కలు చేశాడు. నిజమేనని అనుకుని రాముడు ఇంద్రజిత్తు కోరిన రీతిగా కలతకు గురయ్యాడు. ఇంద్రజిత్తు తన మాయోపాయము పారుతుందనే అనుకున్నాడు. కానీ రామలక్ష్మణులకు నిజం తెలిసిపోయింది. వేరే దారి లేక ఆ సమయంలో సైతం యాగం చేద్దామని ఇంద్రజిత్తు సంకల్పించాడు. ఆ విషయం విభీషనుడి ద్వారా రామలక్ష్మణులకు తెలిసిపోయింది. యాగము పూర్తయితే ఇంద్రజిత్తుని ఓడించడం కష్టమని తెలిసి వెంటనే సంహరించాలని రామలక్ష్మణులు తలపోశారు. ఇంద్రజిత్తు ఎక్కడ ఉన్నదీ విభీషణుడు చెప్పేవాడు.
యుద్ధం తీవ్రతరమైంది. రాక్షస సేనలు వానరసేనలు ఒకరి మీద ఒకరు తలపడ్డారు. లక్ష్మణుడూ ఇంద్రజిత్తూ దివ్యాస్త్రాలతో ఒకరి మీద ఒకరు విరుచుకుపడ్డారు. చివరకు ఇంద్రజిత్తు లక్ష్మణుని చేతిలో హతమయ్యాడు.
ఏది ఏమైనా తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్న ఇంద్రజిత్తు పాత్రకు రామాయణంలో తనదైన ముద్ర ఉంది.
- బమ్మిడి జగదీశ్వరరావు