Telugu Global
National

అసలు వ్యక్తులను తప్పించారు " ఏపీ సర్కార్‌పై సీబీఐ సంచలన ఆరోపణ

ఏపీలోకి సీబీఐ అడుగుపెట్టకుండా చంద్రబాబు విధించిన నిషేధం పలు విపరీత పరిణామాలకు దారి తీస్తోంది. సీబీఐపై బ్యాన్‌ విధించిన తర్వాత ఏపీకి, సీబీఐకి మధ్య తొలి వివాదం ఏర్పడింది. ఏపీ ప్రభుత్వంపై సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్‌ దయాళ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వివాదానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిపై ఏసీబీ చేసిన దాడులు కారణమయ్యాయి. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ శాఖకు చెందిన సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్‌ ఎం. కె. రమణేశ్వర్‌ లంచం తీసుకుంటుండగా ఏసీబీ […]

అసలు వ్యక్తులను తప్పించారు  ఏపీ సర్కార్‌పై సీబీఐ సంచలన ఆరోపణ
X

ఏపీలోకి సీబీఐ అడుగుపెట్టకుండా చంద్రబాబు విధించిన నిషేధం పలు విపరీత పరిణామాలకు దారి తీస్తోంది. సీబీఐపై బ్యాన్‌ విధించిన తర్వాత ఏపీకి, సీబీఐకి మధ్య తొలి వివాదం ఏర్పడింది.

ఏపీ ప్రభుత్వంపై సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్‌ దయాళ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వివాదానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిపై ఏసీబీ చేసిన దాడులు కారణమయ్యాయి.

కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ శాఖకు చెందిన సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్‌ ఎం. కె. రమణేశ్వర్‌ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇనుము వ్యాపారి లోకేష్‌ బాబు ఫిర్యాదు మేరకు వల పన్ని రమణేశ్వర్‌ను పట్టుకున్నామని ఏపీ ప్రభుత్వ పరిధిలోని ఏసీబీ ప్రకటించింది.

ఏసీబీ దాడిపై సీబీఐ తీవ్రంగా స్పందించింది. సీబీఐ అందజేసిన కీలక సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం లీక్‌ చేసిందని సీబీఐ అధికార ప్రతినిధి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల కేసులో కీలక వ్యక్తులు తప్పించుకున్నారని… కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఏసీబీకి దొరికారని సీబీఐ వెల్లడించింది.

కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారంటూ ఇనుము వ్యాపారి లోకేష్‌ బాబు… నవంబర్‌ 28న విశాఖ సీబీఐ కార్యాలయంలోనే ఫిర్యాదు చేశారని అధికార ప్రతినిధి అభిషేక్ చెప్పారు. దీంతో సదరు అధికారులపై దాడులు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ విశాఖ సీబీఐ ఎస్పీ…. ఏపీ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి రహస్య లేఖను పంపించారని వివరించారు. ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతో పాటు… దాడులు చేసేందుకు సీబీఐకి అనుమతి ఇవ్వాల్సిందిపోయి… సీబీఐ ఇచ్చిన సమాచారాన్ని ఏసీబీకి అందజేసి వారి ద్వారా దాడులు చేయించారని సీబీఐ అధికార ప్రతినిధి ఆరోపించారు.
ఏపీ ప్రభుత్వం సమాచారాన్ని లీక్ చేయడం వల్ల కీలక వ్యక్తులు దొరక్కుండాపోయారని సీబీఐ వెల్లడించింది. ఏపీ ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే ఏపీలో అవినీతి అధికారులను పట్టుకోలేమని భావిస్తున్న సీబీఐ… తదుపరి ఎలా వ్యవహరించాలన్న దానిపై తర్జనభర్జన పడుతోంది.
First Published:  1 Dec 2018 3:39 AM IST
Next Story