లోకేష్‌ను ఇంకా పిలవరేం...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. అన్ని పార్టీల అగ్రనేతలు ప్రచార రంగంలోకి దిగారు. తెలంగాణలో ప్రచారానికి రారేమో అనుకున్న చంద్రబాబు కూడా రాహుల్ గాంధీతో కలిసి వేదిక పంచుకున్నారు. టీఆర్‌ఎస్ తరపున కేసీఆర్ కుటుంబం విస్త్రృతంగా ప్రచారం చేస్తోంది. కీలకమైన కూకట్‌పల్లి లాంటి నియోజకవర్గాల నేతలు…. ఊపు కోసం బాలకృష్ణను కూడా ప్రచారానికి ఆహ్వానించారు. కానీ టీడీపీ భవిష్యత్తు నాయకుడని… ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి అని టీడీపీ మంత్రుల చేత కీర్తించబడుతున్న నారా […]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. అన్ని పార్టీల అగ్రనేతలు ప్రచార రంగంలోకి దిగారు. తెలంగాణలో ప్రచారానికి రారేమో అనుకున్న చంద్రబాబు కూడా రాహుల్ గాంధీతో కలిసి వేదిక పంచుకున్నారు.
టీఆర్‌ఎస్ తరపున కేసీఆర్ కుటుంబం విస్త్రృతంగా ప్రచారం చేస్తోంది. కీలకమైన కూకట్‌పల్లి లాంటి నియోజకవర్గాల నేతలు…. ఊపు కోసం బాలకృష్ణను కూడా ప్రచారానికి ఆహ్వానించారు. కానీ టీడీపీ భవిష్యత్తు నాయకుడని… ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి అని టీడీపీ మంత్రుల చేత కీర్తించబడుతున్న నారా లోకేష్‌కు మాత్రం తెలంగాణ ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా ఆహ్వానం అందడం లేదు.
ప్రచారానికి మరికొన్నిరోజులు మాత్రమే మిగిలి ఉన్నా కీలకమైన టీడీపీ యువనేతకు ఆహ్వానం రాకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల విశాఖలో మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ … పార్టీ నాయకత్వం ఆహ్వానిస్తే తెలంగాణలో టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు తాను సిద్ధమని కూడా లోకేష్ ప్రకటించారు. అయినా సరే తెలంగాణలోని ఏ నియోజకవర్గ నాయకుడు గానీ, ఆ పార్టీ తెలంగాణ నాయకత్వం గానీ లోకేష్‌కు ఆహ్వానం పలకడం లేదు.
చివరకు కూకట్‌పల్లిలో పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని కోసం కూడా నారా లోకేష్‌కు ఆహ్వానం రాలేదు. పరిటాల సునీత, బాలకృష్ణలాంటి నేతలను కూకట్‌పల్లిలో ప్రచారానికి ఆహ్వానిస్తున్న నేతలు లోకేష్‌ను మాత్రం పిలవకపోవడం ఏమిటన్న చర్చ టీడీపీ శ్రేణుల్లో జరుగుతోంది.
2014 అసెంబ్లీ ఎన్నికలలో లోకేష్ తెలంగాణలో ప్రచారం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా లోకేష్ ప్రచారం చేశారు. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లను కూడా కాపాడుకోలేకపోయింది. కేవలం ఒకే ఒక కార్పొరేటర్‌ను మాత్రమే గెలిపించుకోగలిగింది. దాంతో లోకేష్ ప్రచారానికి వచ్చినా ఉపయోగం ఉండదన్న భావన టీడీపీనేతల్లో ఏర్పడింది. పైగా ప్రసంగం మొదలుపెడితే నోరు జారీ పార్టీకి ఏదో ఒక ఇబ్బంది తీసుకువస్తారన్న అపవాదు నారా లోకేష్‌పై ఉంది. దాంతో పార్టీ నాయకత్వం కూడా నారా లోకేష్‌ను తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ప్రోత్సహించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.