Telugu Global
NEWS

కూకట్‌పల్లిలో టీడీపీ ఓటమికి నడుం బిగించిన కాపులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనం దృష్టిని ఆకర్షిస్తున్న నియోజక వర్గాల్లో కూకట్‌పల్లి కూడా ఒకటి. ఈ నియోజక వర్గం తమకు కంచుకోట అంటూ టీడీపీ ప్రచారం చేసుకుంటూ వస్తోంది. ఈసారి ఇక్కడి నుంచి చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన నందమూరి సుహాసినిని బరిలోకి దింపారు. అయితే ఆమె గెలుపు అంత సులువు కాదన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. సుహాసిని గెలుపు కోసం కూకట్‌పల్లిలోని కమ్మసామాజికవర్గం వారు ఏకతాటిపైకి వచ్చి కృషి చేస్తున్నారు. కమ్మసామాజిక వర్గానికి చెందిన టీడీపీ […]

కూకట్‌పల్లిలో టీడీపీ ఓటమికి నడుం బిగించిన కాపులు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనం దృష్టిని ఆకర్షిస్తున్న నియోజక వర్గాల్లో కూకట్‌పల్లి కూడా ఒకటి. ఈ నియోజక వర్గం తమకు కంచుకోట అంటూ టీడీపీ ప్రచారం చేసుకుంటూ వస్తోంది. ఈసారి ఇక్కడి నుంచి చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన నందమూరి సుహాసినిని బరిలోకి దింపారు. అయితే ఆమె గెలుపు అంత సులువు కాదన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

సుహాసిని గెలుపు కోసం కూకట్‌పల్లిలోని కమ్మసామాజికవర్గం వారు ఏకతాటిపైకి వచ్చి కృషి చేస్తున్నారు. కమ్మసామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలు కూకట్‌పల్లిలో విస్త్రృతంగా ప్రచారం చేస్తున్నారు. పరిటాల సునీతను కూడా ప్రచారంలోకి తెచ్చారు. అయితే కులాల వారీగా ఓటింగ్‌ ఎలా ఉంటుందన్న చర్చ వచ్చినప్పుడు టీడీపీ ఆందోళనకు గురవుతోంది.

ఆంధ్ర, రాయలసీమ నుంచి వచ్చిన వారి ఓటింగ్ కూకట్‌పల్లిలో భారీగా ఉంది. దీంతో ఏపీ రాజకీయాల ఆధారంగా వారంతా ఓటు వేసే పరిస్థితి వచ్చింది. కూకట్‌పల్లిలో కమ్మ సామాజికవర్గం వారు 13వేల మంది ఉన్నారు. వారంతా మూకుమ్మడిగా టీడీపీకి ఓటేస్తారని భావిస్తున్నారు. ఇక మిగిలిన ప్రధాన సామాజికవర్గాల నుంచి మాత్రం టీడీపీకి మద్దతు దొరకడం లేదు.

కూకట్‌పల్లిలో 22 వేల మంది రెడ్డి ఓటర్లు ఉన్నారు. వారంతా ఎట్టిపరిస్థితుల్లోనూ చంద్రబాబు పార్టీకి ఓటేయబోమని చెబుతున్నారు. కాంగ్రెస్‌ చెప్పినా, మరొకరు చెప్పినా వినే పరిస్థితే లేదంటున్నారు. రెడ్డి ఓటింగ్‌లో మెజారిటీ టీఆర్‌ఎస్‌కు వెళ్లే చాన్స్‌ ఉందని భావిస్తున్నారు.

ఇక కాపు, దాని ఉప కులాలైన బలిజ, తెలగ, తూర్పు కాపు, మున్నురు కాపు ఓటర్ల మొత్తం కలిసి 62వేల మంది కూకట్‌పల్లిలో ఉన్నారు. వీరు 2014 ఎన్నికల్లో జనసేన-టీడీపీ పొత్తు కారణంగా టీడీపీ అభ్యర్థికే ఓటేశారు. కానీ ఇప్పుడు తమను చంద్రబాబు వాడుకుని వదిలేశారన్న కోపం కాపుల్లో ఉంది. దీంతో వారంతా టీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు.

స్థానికురాలు కాని సుహాసినికి ఓటేయడం కంటే… స్థానికుడైన టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటేస్తేనే తమకు కూడా కూకట్‌పల్లిలో మంచి జరుగుతుందని కాపులు అభిప్రాయపడుతున్నారు. కూకట్‌పల్లిలో చంద్రబాబు బంధువైన సుహాసినిని ఓడించడం ద్వారా కాపుల సత్తా ఏంటో ఏపీలో టీడీపీకి అర్థమయ్యేలా చేస్తామని కాపు యువకులు చెబుతున్నారు.

కూకట్‌పల్లిలో కాపులు ఏ పార్టీకి అండగా ఉంటారన్న దానిపై స్పందించిన శ్రీకృష్ణదేవరాయ అసోసియేషన్ నాయకుడు మిర్యాల రాఘవరావు… ఈసారి కాపులు టీఆర్‌ఎస్‌కే ఓటేసే అవకాశం ఉందన్నారు. తాము ఏపీకి చెందిన వారిమే అయినా గడిచిన నాలుగన్నరేళ్లలో ఎక్కడా కూడా శాంతిభద్రతల సమస్య రాకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చూడగలిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

టీఆర్‌ఎస్‌ పాలనలో ఏపీ నుంచి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని… కాబట్టి కాపు, దాని ఉప కులాల వారు టీఆర్‌ఎస్‌తోనే ఉండే అవకాశం ఉందని రాఘవరావు అభిప్రాయపడ్డారు.

ముస్లింలు కూడా ఈ నియోజవకర్గంలో భారీగా ఉన్నారు. వారు కూడా ఎంఐఎం-టీఆర్‌ఎస్ స్నేహం కారణంగా కారు గుర్తుకే ఓటేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక టీడీపీ… 13వేల మంది ఉన్న కమ్మ సామాజక వర్గంతో పాటు, 70వేల వరకు ఉన్న బీసీ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకుంది.

కూకట్‌పల్లిలో బ్రాహ్మణుల ఓట్ల సంఖ్య 11వేల వరకు ఉంది. వారు కూడా 2014 తరహాలో టీడీపీకి ఓటేసే పరిస్థితి లేదంటున్నారు. ఇలా సామాజికవర్గాల వారిగా ఓటింగ్ సరళి గమనించినప్పుడు టీఆర్‌ఎస్‌కే కూకట్ పల్లిలో సానుకూల ఫలితాలు రావొచ్చని అంచనా వేస్తున్నారు.

First Published:  29 Nov 2018 3:38 PM IST
Next Story