గూగుల్ సాయంతో గొర్రెల చోరీ....
సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులే కాదు… దొంగలు కూడా బాగానే వాడుకుంటున్నారు. తమకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ సాయంతోనే సులువుగా దొంగతనాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు దొంగలు గూగుల్ సాయంతో గొర్రెలను చోరీ చేస్తున్నారు. కందుకూరు మండలం పోతుబండ తాండాకు చెందిన భాజేందర్… కూలీ పనిచేయడం ఇష్టం లేక దొంగతనాల వైపు మళ్లాడు. చుట్టు పక్కల గ్రామాల్లో గొర్రెలు, మేకలను చోరీ చేయడం మొదలుపెట్టారు. ఇందుకు ఒక ఆటో డ్రైవర్‌తోపాటు మరికొందరి సాయం తీసుకున్నాడు. […]

సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులే కాదు… దొంగలు కూడా బాగానే వాడుకుంటున్నారు. తమకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ సాయంతోనే సులువుగా దొంగతనాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు దొంగలు గూగుల్ సాయంతో గొర్రెలను చోరీ చేస్తున్నారు.
కందుకూరు మండలం పోతుబండ తాండాకు చెందిన భాజేందర్… కూలీ పనిచేయడం ఇష్టం లేక దొంగతనాల వైపు మళ్లాడు. చుట్టు పక్కల గ్రామాల్లో గొర్రెలు, మేకలను చోరీ చేయడం మొదలుపెట్టారు. ఇందుకు ఒక ఆటో డ్రైవర్‌తోపాటు మరికొందరి సాయం తీసుకున్నాడు.
భాజేందర్ ఊరిబయట, భద్రత లేని చోట గొర్రెలు ఎక్కడున్నాయనేది బైకుపై వెళ్తూ తొలుత రెక్కీ నిర్వహించేవాడు. చోరీకి అనుకూలంగా గొర్రెలు, మేకలు ఎక్కడైనా ఉంటే వెంటనే వాట్సాప్ ద్వారా సదరు లోకేషన్‌ను సహచరులకు షేర్ చేసేవాడు. ఆ లోకేషన్ ఆధారంగా సహచరులు వచ్చి ఆటోలో గొర్రెలను వేసుకుని వెళ్లేవారు.
భాజేందర్ ముందు వెళ్తూ గొర్రెల లోకేషన్ షేర్ చేయడం, ఆ వెంటనే సహచరులు ఆటోలో వెళ్లి వాటిని ఎత్తుకు రావడం చేస్తూ ఉన్నారు. ఇటీవల మండలంలో గొర్రెల చోరీలు మరీ మితిమీరిపోవడంతో నిఘా ఉంచిన పోలీసులు ఎట్టకేలకు గూగుల్ గొర్రెల దొంగలను పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి ఐదు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.