ఓట్లు చీల్చడానికి లెక్కలేస్తున్న అభ్యర్ధులు
ఎన్నికల బరిలో ఎవరి బలమెంత? ఎవరి స్థానం ఏంటీ అని లెక్కలు కట్టడంలో పార్టీల ముఖ్యనేతలు బిజీబిజీగా ఉన్నారు. ప్రత్యర్థిని ఓడించేందుకు అన్నిరకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. పొద్దంతా ప్రచారం…. రాత్రయితే ప్రలోభాలకు గురిచేయడంలో ముఖ్య పార్టీల నేతలు బీజీగా గడుపుతున్నారు. నామినేషన్ల గడువు పూర్తయిన నేపథ్యంలో రాష్టంలో ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ప్రస్తుతం నామినేషన్ల ఉపసంహరణకు ఒక్కరోజే గడువు ఉంది. గుర్తింపు పొందిన పార్టీ నేతలతోపాటు స్వతంత్రంగా బరిలో నిలిచిన వారిలో ఎవరు […]
ఎన్నికల బరిలో ఎవరి బలమెంత? ఎవరి స్థానం ఏంటీ అని లెక్కలు కట్టడంలో పార్టీల ముఖ్యనేతలు బిజీబిజీగా ఉన్నారు. ప్రత్యర్థిని ఓడించేందుకు అన్నిరకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. పొద్దంతా ప్రచారం…. రాత్రయితే ప్రలోభాలకు గురిచేయడంలో ముఖ్య పార్టీల నేతలు బీజీగా గడుపుతున్నారు. నామినేషన్ల గడువు పూర్తయిన నేపథ్యంలో రాష్టంలో ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.
ప్రస్తుతం నామినేషన్ల ఉపసంహరణకు ఒక్కరోజే గడువు ఉంది. గుర్తింపు పొందిన పార్టీ నేతలతోపాటు స్వతంత్రంగా బరిలో నిలిచిన వారిలో ఎవరు బరిలో ఉంటే మనకు నష్టం.. ఎవరుంటే లాభం అంటూ లెక్కలు వెసుకుంటున్నారు. ఆ అభ్యర్థి ప్రభావం తమ ఓటు బ్యాంకును ఎంతవరకు ప్రభావితం చేస్తుంది… ఎవరి చేత నామినేషన్ ఉపసంహరణ చేయించాలంటూ వ్యూహాలు పన్నుతున్నారు. తమకు అనుకూలంగా ఉంటే తగిన విధంగా న్యాయం చేస్తామంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రూ.5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఇందుకు ఎరగా వేస్తున్నారు.
ఓటు బ్యాంకు తక్కువగా ఉన్న పార్టీలు, స్వతంత్య అభ్యర్థులు తమ ఓట్లకు ఎంతవరకు గండికొడతారనే అంశంపై నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తొంది. ఆ అభ్యర్థి ఎన్నికల బరిలో ఉంటే తమకు కలిగే లాభనష్టాలపై బేరీజు వేసుకుంటున్నారు. ప్రత్యర్థి ఓట్లను ఆ అభ్యర్థులు చీల్చితే తనకు లాభమనుకుంటే ప్రధాన పార్టీల నేతల ఆ అభ్యర్థి బరిలో ఉండేలా పన్నాగాలు చేస్తున్నారు. తమ ఓటు బ్యాంకుకు నష్టం కలుగుతుందనుకున్న అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తూ పెద్దమొత్తంలో తాయిలాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మహాకూటమిలో భాగంగా పూర్వపు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ కు పెట్టని కోట.. ఆ చోటు నుంచి పోయిన సారి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సతీష్ కుమార్ గెలిచారు.కానీ ఈసారి ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎక్కడికక్కడ గ్రామస్థులు నిలదీస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రఖ్యాత ములకనూర్ పాల డెయిరీ చైర్మన్ అల్లిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. కానీ ఇక్కడ మహాకూటమి లెక్కల్లో సీపీఐకి కాంగ్రెస్ కేటాయించింది. నిజానికి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అల్లిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి ఇస్తే ఈజీగా గెలుస్తాడు. కానీ సీపీఐకి ఇచ్చి కూటమి టీఆర్ఎస్ ను ఈజీగా గెలిపిస్తోందని.. బరిలో ఉండేలా టీఆర్ఎస్ సీపీఐతో లోపాయికారి ఒప్పందం చేసుకుందనే వార్తలు కూడా నియోజకవర్గంలో వినపడుతున్నాయి.
ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఇప్పటివరకు ఖర్చంతా తామే భరిస్తామంటూ స్వతంత్ర అభ్యర్థులకు ఆఫర్ ఇస్తున్నారు. బరిలో నిలువకుండా నామినేషన్ ఉపసంహరించుకొని తమకు బహిరంగ మద్దతు ఇస్తే భవిష్యత్ లో మీకు అండగా ఉంటామని హామీలు ఇస్తున్నారు. మధ్యవర్తులను పంపి బుజ్జగింపుల పర్వానికి తెరలేపుతున్నారు.
నామినేషన్ల పరిశీలన పర్వం ముగుస్తుండటంతో ఎవరు బరిలో నిలుస్తారు…. ఎవరు ప్రలోభాలకు లోనై బరి నుంచి తప్పుకుంటారో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ముగిశాక రాజకీయం మరింత వేడెక్కనుంది.