విశ్వేశ్వర్ రెడ్డి బాటలో ఆ నలుగురూ నడుస్తారా?
ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సమితికి షాక్ తగిలింది. చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. మంత్రి కేటీఆర్ బుజ్జగింపులు ఫలించలేదు. పార్టీ వీడేది లేదని ప్రకటించి రెండు రోజులు కాలేదు. విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. విశ్వేశ్వర్ రెడ్డి బాటలో మరింత మంది నడవబోతున్నారా? మరో నలుగురు టిఆర్ఎస్ ఎంపీలు లేదా కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై […]
ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సమితికి షాక్ తగిలింది. చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. మంత్రి కేటీఆర్ బుజ్జగింపులు ఫలించలేదు. పార్టీ వీడేది లేదని ప్రకటించి రెండు రోజులు కాలేదు. విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
అయితే ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. విశ్వేశ్వర్ రెడ్డి బాటలో మరింత మంది నడవబోతున్నారా? మరో నలుగురు టిఆర్ఎస్ ఎంపీలు లేదా కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా? అంటే అవుననే మాటలు టీఆర్ఎస్ పార్టీలో విన్పిస్తున్నాయి.
టీఆర్ఎస్‌కు ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయబోతున్నారని ఇంతకుముందు రేవంత్‌రెడ్డి పెద్ద బాంబు పేల్చారు. ఇప్పుడు అందులో ఒక వికెట్ పడింది. ఇక రెండో వికెట్ ఎవరు? అనే చర్చ నడుస్తోంది. కొడంగల్ కు అటో ఇటో ఉన్న ఎంపీలు అంటూ రేవంత్ కొద్దిగా క్లూ ఇచ్చారు. ఇందులో ఒకరు చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అయ్యారు. మరీ ఇంకో ఎంపీ ఎవరనేది తీవ్రంగా చర్చ నడుస్తోంది.
కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు మహబూబాబాద్ ఎంపి ప్రొఫెసర్ సీతారాం నాయక్ టీఆర్ఎస్‌కు గుడ్ బై చెబుతారని ఇంతకు ముందు వార్తలు వెలువడ్డాయి. అయితే సీతారాం నాయక్ మాత్రం తాను పార్టీ మారేది లేదని అంటున్నారు. అయితే ఆయన మాత్రం టీఆర్ఎస్‌లో అంత సంతోషంగా లేరని మాత్రం వార్తలు విన్పిస్తున్నాయి.
ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపి జితేందర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్ కూడా పార్టీ మారతారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఎంపీ జితేందర్‌రెడ్డి ఈ మధ్యన టీఆర్ఎస్‌లో యాక్టివ్‌గా లేరు.
దీంతో పాటు తన అనుచరులకు టికెట్లు ఇవ్వలేదని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ఆయన కంపెనీలపై ఐటీ రైడ్స్ జరగడం కూడా కలకలం రేపింది. పార్టీ మారుతారని వార్తలు వచ్చిన నేపథ్యంలోనే ఈ దాడులు జరిగినట్లు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈనెల 23వ తేదీన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక్కరే కాంగ్రెస్ లో చేరతారా? లేక ఇతర నేతలు ఎవరైనా కండువాలు మార్చుకుంటారా? అనేది చూడాలి. మేడ్చల్ సభకు రేవంత్‌రెడ్డిని ఇంచార్జ్‌గా నియమించారు. దీంతో సోనియా, రాహుల్ సభలో ఏం జరగబోతుందనేది ఇప్పుడు చర్చగా మారింది.