Telugu Global
NEWS

భూ కుంభకోణంలో ముందు అరెస్టు కానున్న ఆంధ్రప్రదేశ్‌ బ్యాంక్‌ ఆఫీసర్లు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మాటున జరిగిన అతిపెద్ద భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇటీవల టీడీపీ ప్రభుత్వ పెద్దల సన్నిహితులు, వారి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలపై దాడులు చేసిన ఐటీ శాఖ అత్యంత కీలకమైన, సంచలనాత్మక సమాచారాన్ని గుర్తించింది. ఏపీ రాజధాని ఎక్కడ ఉండాలన్న దానిపై ముందే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ ముఖ్యనేత… ఆ విషయాన్ని తన సన్నిహితులకు వివరించి వేలాది ఎకరాలు ముందస్తుగానే రైతుల, స్థానికుల నుంచి తక్కువ ధరకు కొనేలా చేసి ఆ తర్వాత […]

భూ కుంభకోణంలో ముందు అరెస్టు కానున్న ఆంధ్రప్రదేశ్‌ బ్యాంక్‌ ఆఫీసర్లు
X

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మాటున జరిగిన అతిపెద్ద భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇటీవల టీడీపీ ప్రభుత్వ పెద్దల సన్నిహితులు, వారి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలపై దాడులు చేసిన ఐటీ శాఖ అత్యంత కీలకమైన, సంచలనాత్మక సమాచారాన్ని గుర్తించింది.

ఏపీ రాజధాని ఎక్కడ ఉండాలన్న దానిపై ముందే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ ముఖ్యనేత… ఆ విషయాన్ని తన సన్నిహితులకు వివరించి వేలాది ఎకరాలు ముందస్తుగానే రైతుల, స్థానికుల నుంచి తక్కువ ధరకు కొనేలా చేసి ఆ తర్వాత రాజధానిని ప్రకటించి వేల కోట్లు ఆర్జించిన వైనాన్ని ఐటీ శాఖ గుర్తించింది.

రాజధాని ప్రకటించడానికి కొద్దిరోజులు ముందు అమరావతి ప్రాంతంలో ఏకంగా 6వేల ఎకరాల్లో అక్రమంగా లావాదేవీలు జరిగాయని నిర్ధారించింది. అప్పట్లో ఆ భూముల విలువ ఎనిమిది వేల కోట్లు. రాజధాని ప్రకటించిన తర్వాత ఆ భూముల ప్రస్తుత విలువ 30వేల కోట్ల పై మాటే అని ఐటీ శాఖ తేల్చింది.

ఇక్కడ ముఖ్యనేత చక్రం తిప్పడంతో బ్యాంకులు కూడా దాసోహం అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన టీడీపీ నేతల రియల్ ఎస్టేట్‌ కంపెనీలకు వందల కోట్లను బ్యాంకులు అప్పులు ఇచ్చేశాయి. ఆ డబ్బుతోనే పేదల భూములను టీడీపీ పెద్దలు తన్నుకుపోయారు.

కృత్రిమ, అనుమానాస్పద రియల్ భూం ఉన్న ప్రాంతాలను దేశవ్యాప్తంగా గుర్తించిన ఆర్‌బీఐ…. ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వొద్దని బ్యాంకులను ఆదేశించింది. అలాంటి కృత్రిమ రియల్ భూం ఉన్న ప్రాంతంగా అమరావతిని కూడా ఆర్‌బీఐ గుర్తించింది. అయినా సరే బ్యాంకులు వందల కోట్లు టీడీపీ నేతల రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు కట్టబెట్టాయి.

గుంటూరు జిల్లాకు చెందిన, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్ల పాటు జిల్లా టీడీపీ బాగోగులు చూసిన ఒక కీలక టీడీపీ నేత కూడా ఒక రియల్ ఎస్టేట్‌ కంపెనీని అప్పటికప్పుడు సృష్టించారు. చంద్రబాబు పూర్తి సహకారం ఇవ్వడంతో రెచ్చిపోయి భూములు కొనేశారు. సదరు గుంటూరు జిల్లా కీలక నేత కంపెనీకి బ్యాంకులు 224 కోట్ల రూపాయలను అప్పుగా ఇచ్చాయి.

తనిఖీలో సేకరించిన వివరాలను ఐటీ శాఖ… సీబీఐ, ఈడీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌లకు అప్పగించింది. త్వరలోనే సీబీఐ రంగంలోకి దిగబోతోందని చెబుతున్నారు. సీబీఐ తొలుత విచ్చలవిడిగా టీడీపీ నేతల కంపెనీలకు ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్దంగా రుణాలు ఇచ్చిన బ్యాంకుల ఉన్నతాధికారులను అదుపులోకి తీసుకోనుందని సమాచారం.

ఈ వ్యవహారంపై బ్యాంకుల ఉన్నతాధికారులపై కేసు కూడా ఢిల్లీలో నమోదు చేయనున్నారు. ఏపీలోకి సీబీఐ రాకుండా చంద్రబాబు నిషేధం విధించడానికి ఇది కూడా ఒక కారణమై ఉంటుందని భావిస్తున్నారు.

First Published:  20 Nov 2018 9:03 PM GMT
Next Story