బాబు సామర్ధ్యం ఎంత? " బీఎస్పీ గరంగరం
కేంద్రంలో ఎన్‌డీఏకు వ్యతిరేకంగా విపక్షాల కూటమి ఏర్పాటు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కూటమిలో అందరూ పీఎం క్యాండిడేట్లే కావడంతో ఈగోలు లావాలా రగులు తున్నాయి. ఇది వరకే రాహుల్ గాంధీ కింద పనిచేసేందుకు ససేమిరా అన్న మమతా బెనర్జీ, మాయావతి…. ప్రత్యామ్నాయ కూటమికి నాయకత్వం వహించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఒకరి నాయకత్వాన్ని మరొకరు అంగీకరించడం లేదు. ఒక దశలో శరద్ పవార్ కూడా సీన్‌లోకి ఎంటరయినా ఈ కూటమి ఏర్పడే పరిస్థితి లేదని గ్రహించి తన పని […]
కేంద్రంలో ఎన్‌డీఏకు వ్యతిరేకంగా విపక్షాల కూటమి ఏర్పాటు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కూటమిలో అందరూ పీఎం క్యాండిడేట్లే కావడంతో ఈగోలు లావాలా రగులు తున్నాయి.
ఇది వరకే రాహుల్ గాంధీ కింద పనిచేసేందుకు ససేమిరా అన్న మమతా బెనర్జీ, మాయావతి…. ప్రత్యామ్నాయ కూటమికి నాయకత్వం వహించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఒకరి నాయకత్వాన్ని మరొకరు అంగీకరించడం లేదు. ఒక దశలో శరద్ పవార్ కూడా సీన్‌లోకి ఎంటరయినా ఈ కూటమి ఏర్పడే పరిస్థితి లేదని గ్రహించి తన పని తాను చేసుకుపోతున్నారు.
ఇప్పటికే పలు పార్టీల నేతలు కొట్టుకుంటుంటుంటే…. బీజేపీతో నాలుగేళ్ల కాపురం తర్వాత విడాకులు ఇచ్చిన చంద్రబాబు నేనున్నా అంటూ తిరుగుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీలకు పదేపదే ఫోన్లు చేసి మరీ వెళ్లి అక్కడి నేతలను కలుస్తున్నారు.
తానే బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను ఏకం చేస్తున్నానని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చంద్రబాబు కలిసిన పార్టీలన్నీ చంద్రబాబు కంటే దశాబ్దాల ముందునుంచే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పార్టీలు. అయితే చంద్రబాబు పర్యటనలపై మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ తీవ్రంగా స్పందిస్తోంది.
కూటమిలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోతే కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చంద్రబాబు చక్రాల పైనా ఆ పార్టీ రియాక్ట్ అయింది. అసలు చంద్రబాబుకు ఉన్న ప్రజాబలం ఎంత అని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ప్రశ్నించారు.
ఉత్తరాధిలో చంద్రబాబు ఎన్ని స్థానాలపై ప్రభావం చూపగలరు అని ప్రశ్నించారు. ఉత్తరాదిలో చంద్రబాబుకు ఉన్న శక్తి ఎంత అని బీఎస్పీ నాయకులు నిలదీశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసేందుకు తాము ఇదివరకు తిరస్కరించిన నేపథ్యంలో చంద్రబాబుకు ముసుగేసి కాంగ్రెస్ నాటకం ఆడిస్తోందని బీఎస్పీ, తృణముల్ కాంగ్రెస్ గట్టిగా విశ్వసిస్తున్నాయి.
ఈ లుకలుకల నేపథ్యంలోనే ఈనెల 22న కూటమి పార్టీల సమావేశం ఏర్పాటు చేయగా… హాజరయ్యేందుకు బీఎస్పీ అంగీకరించలేదు. కూటమికి నాయకత్వం వహించేది ఎవరో చెప్పాల్సిందేనని పట్టుబడుతోంది.
అందుకే 22న జరగాల్సిన కూటమి సమావేశం రద్దు అయింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కూటమి సమావేశం ఉంటుందని చెబుతున్నారు. కానీ కూటమి ఏర్పాటు ఎంతవరకు సాధ్యమన్నది అంతుపట్టడం లేదు.
కూటమిలో బలమైన పార్టీగా పెద్దన్న పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ బలహీనపడిపోవడం, రాహుల్ బలహీన నాయకత్వం వల్లే కూటమిలో చిన్నచిన్న పార్టీలు కూడా చక్రం తిప్పాలనుకుంటున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒకేస్థాయి పార్టీలు కావడంతో ఆయా పార్టీల అధినేతలు కూడా కూటమికి నాయకత్వం వహించాలనుకోవడంతో కొత్త సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు.