కూటమితో లాభమెవరికి....? బాబుకా....? కాంగ్రెస్‌కా....?
( ఎస్. విశ్వేశ్వరరావు ) తెలంగాణ శాసనసభ ముందస్తు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అధికారానికి రాకుండా నిలువరించేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలతో ఏర్పాటైన కూటమివల్ల ప్రయోజనం ఎవరికి? కెసిఆర్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంటే సహజంగానే మహాకూటమి ఓట్లు, సీట్ల పరంగా లాభపడుతుంది. అయితే వ్యతిరేకత ఉందా? ఉంటే ఎంతమేరకు వ్యతిరేకత ఉంది? అది టిఆర్‌ఎస్‌ను ఓడించి మహాకూటమిని అధికారంలోకి తెచ్చే స్థాయిలో ఉందా? అనేది ఒక అంశమైతే… నేటితో […]
( ఎస్. విశ్వేశ్వరరావు )
తెలంగాణ శాసనసభ ముందస్తు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అధికారానికి రాకుండా నిలువరించేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలతో ఏర్పాటైన కూటమివల్ల ప్రయోజనం ఎవరికి?
కెసిఆర్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంటే సహజంగానే మహాకూటమి ఓట్లు, సీట్ల పరంగా లాభపడుతుంది. అయితే వ్యతిరేకత ఉందా? ఉంటే ఎంతమేరకు వ్యతిరేకత ఉంది? అది టిఆర్‌ఎస్‌ను ఓడించి మహాకూటమిని అధికారంలోకి తెచ్చే స్థాయిలో ఉందా? అనేది ఒక అంశమైతే… నేటితో నామినేషన్ల ఘట్టం ముగుస్తున్నందున ఉపసంహరణ తదనంతరం ఎన్నికల ప్రచారం, పోలింగ్ వ్యూహం, సరళి తదితర అంశాలు కూడా గెలుపోటములపై ప్రభావం చూపుతాయి. ఈ విషయాలు ఇలా ఉంచితే మహాకూటమి ఏర్పాటువల్ల (కూటమి అధికారంలోకి వచ్చినా, రాకపోయినా) లాభపడేదెవరూ? కాంగ్రెస్సా లేక తెలుగుదేశం పార్టీనా? లేక రెండు పార్టీలు లబ్ధిపొందుతాయా? అదే సమయంలో సిపిఐ, తెలంగాణ జనసమితి పరిస్థితి ఏమవుతుంది?
కూటమి ఏర్పాట్లలో కాంగ్రెస్ పార్టీ ఎంత చొరవ తీసుకుందో, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అంతకన్నా రెట్టింపు చొరవ తీసుకొని కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. ఎందుకు ఆయన తెలంగాణ ఎన్నికల్లో ఇంత తాపత్రయపడుతున్నారు. పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఆయన ప్రకటించుకున్న తరువాత ఆ ప్రకారం కనీసం రెండు మూడు రాష్ట్రాల్లోనైనా ఆ పార్టీ ప్రభావం ఉండాలి.
ఉదాహరణకు బీఎస్పీ (మాయావతి) ప్రభావం ఉత్తరప్రదేశ్‌లో అధికంగా ఉన్నప్పటికీ మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఛత్తీస్‌ఘడ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపి ఎంతో కొంత ప్రభావం చూపిస్తోంది. కనీసం ఏదో ఒక పార్టీ గెలుపోటములనైనా కొన్ని స్థానాల్లో తన శక్తిని చాటుతోంది. ఇదే విధమైన పరిస్థితి తెలుగుదేశంకు లేదనే చెప్పాలి.
అయితే రాష్ట్ర విభజనకు ముందు తెలుగుదేశం తెలంగాణలో కీలకమైన పాత్రను పోషించింది. ఆ పార్టీ ఏర్పాటయ్యాక 1983 నుంచి జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ మిగిలిన ప్రాంతాల్లోకన్నా తెలంగాణలో ఎక్కువ స్థానాల్లో టిడిపి విజయం సాధిస్తూ వచ్చింది.
2014 శాసనసభ ఎన్నికలు సంయుక్త రాష్ట్రంలో జరిగినప్పటికీ ఫలితాలు వచ్చిన తరువాత రాష్ట్రాల విభజన జరుగుతుంది కాబట్టి విడివిడిగా ఎన్నికలు జరిగినట్లే రాజకీయంగా పరిగణించారు. ఆ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి, తెలుగుదేశం పొత్తుతో పోటీ చేశాయి. ఫలితంగా రెండు పార్టీలు లాభపడ్డాయి. తెలుగుదేశంకు ఆంధ్రా పార్టీగా ముద్రపడినప్పటికీ 15స్థానాల్లో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలలో గెలుపొందింది.
ఉత్తర తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆ తరువాత పార్టీ క్రమంగా బలహీనపడి ఓటర్లలో అత్యధికులు టీఆర్‌ఎస్ వైపు వెళ్లిపోయారని ఉప ఎన్నికలు, హైదరాబాద్ నగర ఎన్నికలు నిరూపించాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి గతంలో ఉన్నంత ఓటు బ్యాంకు లేదనేది వాస్తవం. ఓటర్లను ఎన్నికల సంఘం ఆధార్‌తో లింక్ చేసిన తరువాత టిడిపి ఓటర్లు అత్యధికంగా ఆంధ్రావైపు వెళ్లిపోయారు.
అయినప్పటికీ తెలుగుదేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం లాంటి జిల్లాల్లో ఎంతోకొంత ఓటు బ్యాంకు ఉంది.
అయితే ఈ ఓటు బ్యాంకు వల్ల స్వతంత్రంగా టిడిపి ఒక్కస్థానం కూడా గెలిచే అవకాశాలు లేవనే చెప్పాలి. అందులో భాగంగానే ఆయన కాంగ్రెస్‌తో మహాకూటమి ఏర్పాటు చేయించి సీట్ల కేటాయింపులో భాగంగా 13 స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. కూటమివల్ల కాంగ్రెస్ ఎంత లాభపడుతుందనేది పక్కనబెడితే తెలుగుదేశం మాత్రం ప్రయోజనం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. 13 స్థానాల్లో 6 నుంచి 8వరకు సులభంగానే టిడిపి గెలుస్తుందని ఇప్పటి పరిస్థితులను బట్టి రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇదే నిజమైతే పొత్తువల్ల కాంగ్రెస్‌కన్నా టిడిపి ఎక్కువ లాభపడినట్లే.
ఎన్టీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ ముద్ర…
మరోవైపు నందమూరి వంశానికి చెందిన సుహాసినిని కూకట్‌పల్లి స్థానం నుంచి పోటీకి దింపడం ద్వారా చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని ప్రదర్శించారు. ఈ స్థానం నుంచి పెద్దిరెడ్డి పోటీచేయాలని ఆశించారు. గతంలో బిజెపి పొత్తుతో ఇక్కడ టిడిపి గెలుపొందింది. ఈ సారి కాంగ్రెస్ పొత్తుతో గెలుపొందటం ఒక లక్ష్యమైతే ఎన్టీఆర్ కుటుంబాన్ని మళ్లీ టిడిపివైపు తిప్పుకోవడం చంద్రబాబు సాధించిన విజయంగా చెప్పుకోవాలి.
ఎందుకంటే కాంగ్రెస్‌తో పొత్తుకు చంద్రబాబు సిద్ధమైన తరువాత ఎన్టీఆర్ వారసులు ముఖ్యంగా బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించలేదు. టిడిపిని 1983లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగు ఆత్మగౌరవం నినాదంతో రామారావు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో టిడిపి పొత్తును ఆయన వారసులు ఎలా పరిగణిస్తున్నారనేది చర్చనీయాంశమైంది.
బాలకృష్ణ ఎలాగూ చంద్రబాబుతోనే ఉంటారు. ఇక జూ.ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ లాంటివారిని కూడా ఆ కూటమివైపు లాగాలి అంటే వ్యూహాత్మకంగా సుహాసినిని పోటీకి దింపాలని చంద్రబాబు భావించారు. ఆయన అనుకున్నట్లుగానే వారిద్దరూ తమ సోదరి (సుహాసిని)కి మద్దతు ప్రకటించారు. అంటే కాంగ్రెస్‌తో తెలుగుదేశం పొత్తును వారు సమర్థించినట్లే అయ్యింది.
ఇక పార్టీలో ఎదురులేకుండా ఆయన చేసుకోగలిగారు. ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ ఓట్లు సంపాదించుకుని ఎన్నోకొన్ని స్థానాలు గెలుపొందడంతోపాటు ఆ పార్టీతో జాతీయ స్థాయిలో కలిసి పనిచేసే విధంగా ఎన్టీఆర్ కుటుంబాన్ని ఒప్పించ గలిగారు. కూటమి అధికారంలోకి వస్తే తెలుగుదేశం ఓట్ల వల్ల కాంగ్రెస్ కూడా లాభపడినట్లే అవుతుందిగాని ఇప్పటికైతే కాంగ్రెస్‌కన్నా టిడిపి ఎక్కువ మేలు పొందినట్లే చెప్పాలి.