Telugu Global
Family

జీరంగి శాస్త్రి

జీరంగి శాస్త్రి పేద బ్రాహ్మణుడు. ఉదయం నించీ సాయంత్రం దాకా బిచ్చమెత్తుకుని జీవించే వాడు. సాయంత్రానికి ఇంటికి చేరే వాడు. బిచ్చమెత్తిన ధాన్యాన్ని భార్యకు ఇచ్చేవాడు. ఆమె ధాన్యాన్ని పిండి చేసి రొట్టెలు చేసేది. వాళ్లిద్దరే. వాళ్లకు పిల్లల్లేరు. అతని భార్య తెలివైంది. పిండితో రొట్టెలు చేసేది. ఐతే నాలుగు రొట్టెలు ఎప్పటికైనా పనికి వస్తాయని దాచి ఉండేది. తాను రెండు తిని రెండు రొట్టెలు భర్తకు పెట్టేది. బ్రాహ్మడు ‘నేను అంత ధాన్యం తెస్తే కేవలం […]

జీరంగి శాస్త్రి పేద బ్రాహ్మణుడు. ఉదయం నించీ సాయంత్రం దాకా బిచ్చమెత్తుకుని జీవించే వాడు. సాయంత్రానికి ఇంటికి చేరే వాడు. బిచ్చమెత్తిన ధాన్యాన్ని భార్యకు ఇచ్చేవాడు. ఆమె ధాన్యాన్ని పిండి చేసి రొట్టెలు చేసేది. వాళ్లిద్దరే. వాళ్లకు పిల్లల్లేరు. అతని భార్య తెలివైంది. పిండితో రొట్టెలు చేసేది. ఐతే నాలుగు రొట్టెలు ఎప్పటికైనా పనికి వస్తాయని దాచి ఉండేది. తాను రెండు తిని రెండు రొట్టెలు భర్తకు పెట్టేది.

బ్రాహ్మడు 'నేను అంత ధాన్యం తెస్తే కేవలం రెండు రొట్టలే పెడుతోంది. తక్కిన పిండిని ఏం చేస్తుందబ్బా' అని అనుకున్నాడు. ఒక రోజు భార్యకు తెలీకుండా ఆమె రొట్టెలు చేస్తున్నప్పుడు చాటున ఉండి గమనించాడు. ఆమె నాలుగు రొట్టెల్ని దాచి పెట్టడం గమనించాడు.

మరుసటి రోజు ఎప్పట్లాగే ఇద్దరూ భోజనానికి కూచున్నారు. ఆమె భర్తకు రెండు రొట్టెలు పెట్టి తాను రెండు రొట్టెలు తీసుకుంది. భర్త కోపంగా 'తక్కిన నాలుగు రొట్టెలు ఏం చేశావు' అన్నాడు.

ఆ మాటతో ఆమె ఆశ్చర్యపోయింది. ఏ రోజూ తను వంటింట్లో ఏం చేస్తున్నానో చూడని భర్త తను ఎనిమిది రొట్టెలు చేస్తున్నానని తెలుసుకున్నాడంటే ఆయనకు తప్పనిసరిగా అతీంద్రియ శక్తులు ఉండాలని తీర్మానించుకుంది.

వెంటనే భర్త కాళ్ల మీద పడి 'మీరు మహానుభావులు. మీ దగ్గర గొప్ప శక్తులున్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ మీకు తెలుసు. మీరు గొప్ప శక్తులున్నవాళ్లు'. అంది.

భర్త చిరాకుగా 'పిచ్చిపిచ్చిగా ఆలోచించకు. నేను నువ్వు రొట్టెలు చెయ్యడం చూశాను. అందుకే అడిగాను' అన్నాడు.

'మీరు మీ శక్తి గురించి పట్టింపు లేని వారు. నన్ను మన్నించండి' అని ఆమె దాచిన రొట్టెలు తీసుకొచ్చింది. తను నిజం చెప్పినా భార్య నమ్మడం లేదని బ్రాహ్మడికి అర్థమైంది. తన భార్య ఎట్లాంటి సమస్యలు తెస్తుందో అని అతనికి భయమేసింది.

'నువ్వు ఈ విషయం గురించి ఇరుగుపొరుగుల్తో గొప్పలు చెప్పకు. దాని వల్ల నాకు ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ విషయం మనిద్దరి మధ్యే ఉండటం మంచిది' అని హెచ్చరించాడు.

భార్య 'సరే' అంది.

ఆడవాళ్ల నోట్లో నువ్వుల గింజ నానదంటారు కదా!. ఆమె నీళ్లు తేవడానికి ఉదయాన్నే బావి దగ్గరకు వెళ్లేది. అక్కడ ఆడవాళ్లందరూ కలిసేవాళ్లు. వెనకటి రోజుల్లో ఆడవాళ్లు పిచ్చాపాటీ మాట్లాడుకోవడానికి అది సరైన స్థలం.

బ్రాహ్మడి భార్య తన స్నేహితురాలైన ఒకావిడతో 'మా ఆయనకు అద్భుత శక్తులున్నాయి. భూత భవిష్యత్‌ వర్తమానాల్ని ఆయన చెప్పగలరు. ఈ విషయం నువ్వు నా స్నేహితురాలివి కాబట్టి నీతో చెబుతున్నా ఎవరికీ చెప్పకు' అంది.

దాంతో బ్రాహ్మడికి అపూర్వ శక్తులున్నాయిని గ్రామమంతా ప్రచారం జరిగిపోయింది. ఏదైనా వింత అనిపిస్తే అది దేశమంతా వార్తగా తెలిసిపోతుంది. ఆ విధంగా బాహ్మ్రడి తెలివితేటలు గురించి రాజధాని నగరానికి కూడా తెలిసిపోయింది. రాజు గారి చెవిన కూడా ఆ వార్త పడింది.

ఇంతలో ఒక రోజు ఉన్నట్టుండి రాణి గారి వజ్రాల హారం మాయమైంది. అది ఎవరు తీసుకున్నారో, ఎలా పోయిందో తెలీలేదు. అది చాలా విలువైంది. రాజు గారికి ఏమీ పాలుపోలేదు. అప్పుడు అద్భుతశక్తుల గురించి తెలిసిన బ్రాహ్మడు రాజు గారి మనసులో మెదిలాడు. వెంటనే సేవకుల్ని పంపి బ్రాహ్మణ్ణి ఆహ్వానించారు.

రాజు తన భార్య వజ్రాల హారం పోయిన విషయం చెప్పి అది ఎక్కడుందో, ఎవరు అపహరించారో చెప్పమన్నాడు. ఏ భవిష్యత్తూ గురించీ ఏమీ తెలియని బ్రాహ్మడు తన భార్య తెచ్చిపెట్టిన బాధలకు మనసులోనే ఆమెపై ఆగ్రహించాడు. తాత్కాలికంగా తప్పించుకోవడానికి 'రాజు గారూ! గ్రహాల గమనాన్ని గణించడానికి నాకు మూడు రోజుల సమయం కావాలి. మూడు రోజులయ్యాక అసలు విషయం తెలుస్తుంది' అన్నాడు.

రాజు 'నీకు మూడు రోజుల గడువుయిస్తాను. దొంగ ఎవరో నువ్వు చెప్పలేకపోతే నీకు మరణ దండన తప్పదు' అన్నాడు.

ఆ మాటల్తో హతాశుడైన బ్రాహ్మడు ఇల్లు చేరి 'చివరికి నా ప్రాణాల మీదకు తెచ్చావు కదా!' అని భార్యపై కోపగించి ఏమీ తోచక పడుకున్నాడు. రెండ్రోజులు గడిచాయి. రెండు రోజులూ కంటి మీద కనుకు లేదు. ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. మూడో రోజు రాత్రి ఎంతో ప్రయత్నించాడు. ఎట్లాగూ తను ఎవరు దొంగలించారో చెప్పలేడు. కనీసం ప్రశాంతంగా పడుకుని మరుసటి రోజు మరణానికి సిద్ధపడాలని అనుకున్నాడు. కానీ నిద్రరాలేదు. బాధతో 'నిద్రా దేవీ! రారాదా!' అని ఆక్రోశించాడు. అప్పటి దాకా ఆయన ఇంటి బయట ఒక స్త్రీ ఉంది. ఆమె రాణి గారి దాసి. ఆమె ఆ దొంగతనం చేసింది. రాజు గారు నిజం కనిపెట్టమని ఆ బ్రాహ్మణ్ణి ఆదేశించినప్పటి నించీ ఆమె బ్రాహ్మడి చర్యల్ని గమనిస్తూ అనుసరిస్తోంది. ఆమె పేరు నిద్రాదేవి. బ్రాహ్మడు నిద్ర రాక అలా అన్నాడు. బయట ఉన్న తనను గుర్తించి పిలిచాడనుకుని నిద్రాదేవి బ్రాహ్మడి గదిలోకి వచ్చి అతని పాదాలపై పడి తను చేసిన తప్పును మన్నించమని, ఈ విషయం తెలిస్తే రాజు గారు తనని ఉరి తీయించడం ఖాయమని, ఎట్లాగైనా తనను కాపాడమని కన్నీళ్ల పర్యంతమైంది.

అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి క్షణకాలం నిశ్చేష్ఠుడై వెంటనే తేరుకుని బ్రాహ్మడు గాంభీర్యం తెచ్చిపెట్టుకుని 'ఆ స్థానంలో పని చేస్తూ, పైగా అంత:పురంలో ఉంటూ ఇట్లాంటి అనుచిత కార్యాలు చేయడం తప్పు కదా!' అని హితబోధ చేశాడు.

ఆమె 'మీరు దైవస్వరూపులు. శక్తి సంపన్నులు. నన్ను కాపాడడం మీ చేతుల్లోనే ఉంది' అని వజ్రాల హారాన్ని ఇచ్చింది. బ్రాహ్మడు ఆమెకు ధైర్యం చెబుతూ 'నీ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదు. నేను అభయమిస్తున్నాను. ఈ వజ్రాల హారాన్ని నీ దగ్గరే పెట్టు. నేను సభలోకి వచ్చిన తర్వాత రాజు గారి సమక్షంలోకి నిన్ను పిలుస్తాను. అప్పుడు ఈ హారాన్ని తీసుకురా. కానీ నీకు ఎట్లాంటి ప్రాణహానీ జరగదని నేను హామీయిస్తున్నా' అన్నాడు.

మరుసటి రోజు బ్రాహ్మడు రాజు సభకు వెళ్లాడు. అప్పటికే సభ కొలువుదీరి ఉంది. జనమంతా బ్రాహ్మడి కోసమే ఎదురుచూస్తున్నారు. రాజు గారు ఉత్కంఠతో ఉన్నాడు.

బ్రాహ్మడు నిర్మలంగా సభలో ప్రవేశించి రాజు గారికి నమస్కరించి తన ఆసనంలో ఆశీనుడయ్యాడు.

సభలో నిశ్శబ్దం వ్యాపించింది.

బ్రాహ్మడు రాజును చూసి 'మహారాజా! ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు కదా! దొంగతనం అంత:పురంలోనే జరిగింది. మీ రాణి గారి చెలికత్తెల్లో ఒకావిడ ఈ పని చేసింది. ఆమె పేరు నిద్రాదేవి. ఆమెను పిలిపించండి' అన్నాడు.

నిద్రాదేవి సభకు వచ్చింది. బ్రాహ్మడు రాజుతో 'రాజా! ఆమె అత్యాశతో ఈ తప్పు చేసింది. పశ్చాత్తాపపడుతోంది. ఆమెకు ఎట్లాంటి శిక్షా ఇవ్వకుండా ఆమెను వదిలిపెట్టండి' అన్నాడు. వజ్రాల హారం దొరికినందుకు సంతోషించిన రాజు ఆమెను మందలించి వదిలేశాడు.

బ్రాహ్మడి మేధస్సుకు ఆశ్చర్యపడిన రాజు అతన్ని ఆస్థానజ్యోతిష్యుడిగా నియమించాడు. బ్రాహ్మడి భార్య కూడా రాజధానికి వచ్చేసింది. గౌరవం, ఆస్తి, అంతస్థులతో వాళ్లు ఆనందంగా ఉన్నారు.

- సౌభాగ్య

First Published:  16 Nov 2018 2:30 PM IST
Next Story