Telugu Global
National

700 కోట్ల పెట్టుబడితో చమురు, సహజవాయు రంగంలోకి 'మేఘా'

చమురు, సహజ వాయు రంగంలోకి అడుగిడిన మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో ఏడు వందల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి అసోం, గుజరాత్‌ లలో చమురు వెలికితీతతో పాటు వాణిజ్య కార్యకలాపాలను  ప్రారంభించనుంది. గుజరాత్‌లోని కాంబెల్‌, అసోంలోని లక్ష్మీజెన్‌ ఆయిల్‌ ఫీల్డ్స్‌లో చమురు, గ్యాస్‌ వెలికితీత పనులను ప్రభుత్వం నుంచి పోటీ పద్దతిలో దక్కించుకున్న మేఘా 2020 సంవత్సరంలో ఉత్పత్తి ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు […]

700 కోట్ల పెట్టుబడితో చమురు, సహజవాయు రంగంలోకి మేఘా
X

చమురు, సహజ వాయు రంగంలోకి అడుగిడిన మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో ఏడు వందల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి అసోం, గుజరాత్‌ లలో చమురు వెలికితీతతో పాటు వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది.

గుజరాత్‌లోని కాంబెల్‌, అసోంలోని లక్ష్మీజెన్‌ ఆయిల్‌ ఫీల్డ్స్‌లో చమురు, గ్యాస్‌ వెలికితీత పనులను ప్రభుత్వం నుంచి పోటీ పద్దతిలో దక్కించుకున్న మేఘా 2020 సంవత్సరంలో ఉత్పత్తి ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మెయిల్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (హైడ్రోకార్బన్స్‌) పి. రాజేశ్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఇంధన విభాగంలో (హైడ్రోకార్బన్స్‌) అనేక ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్న మేఘా ఇటీవలే చమురు, సహజవాయువు వెలికితీత రంగంలోకి అడుగుపెట్టింది.

కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు…. మేఘా తనవంతు కృషి

2022 నాటికి దేశీయంగా ఇంధన ఉత్పత్తులను పెంచి విదేశాల నుంచి దిగుమతులు 10శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ కార్యాచరణలో భాగంగా చమురు, సహజవాయు వెలికితీత క్షేత్రాలను ప్రైవేటు సంస్థలకు దశల వారీగా అప్పగిస్తోంది. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అసోం, గుజరాత్‌ లలో రెండు చమురు క్షేత్రాలను మేఘా అభివృద్ధి చేసి నిర్వహించటంతో పాటు వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది.

అనుమతులిచ్చిన అసోం

2018లో బావులను డ్రిల్‌ చేయటంతో పాటు 2020లో వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంగా మేఘా ఇంజనీరింగ్‌ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కార్యచరణను రూపొందించుకుంది. కాంబెల్‌ క్షేత్రంలో దశలవారీగా మూడు బావులను తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, లక్ష్మీజెన్‌ చమురు క్షేత్రంలో తవ్వకాలకు అసోం ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతులు లభించాయని పి.రాజేశ్‌రెడ్డి వివరించారు.

ప్రభుత్వ రంగ సంస్థలకు సరఫరా

ఈ రెండు ఆయిల్‌ ఫీల్డ్స్‌లోను ప్రధానంగా బావుల తవ్వకం, క్రూడాయిల్‌ వెలికితీత, అయిల్‌తో పాటు సహజవాయువును శుద్ధిచేసే ట్రీట్‌మెంట్‌, ఎఫ్లియెంట్‌ ప్లాంట్లను మేఘా ఏర్పాటు చేస్తుంది. ఇంధనాన్ని రవాణా చేసి ప్రభుత్వ రంగ సంస్థలయిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌ లిమిటెడ్‌, ఎస్సార్‌, సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు, పరిశ్రమలకు చమురు, గ్యాస్‌ను మేఘా సంస్థ విక్రయిస్తుంది.

మేఘా లక్ష్యం

గుజరాత్‌లోని కాంబెల్‌ ఇంధన క్షేత్రం నుంచి జీవిత కాలం ఇంధనం లభిస్తుందని అంచనావేసినట్లు రాజేశ్‌రెడ్డి చెప్పారు. తాము 3.70 లక్షల బ్యారల్స్‌ (బిబిఎల్‌ఎస్‌) ముడిచమురును ఉత్పత్తి చేయాలని, ప్రతిరోజూ 1.30 లక్షల ఘనపు మీటర్ల గ్యాస్‌ను వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వివరించారు.

డిజిహెచ్‌ (డైరక్టర్‌ జనరల్‌ హైడ్రోకార్బన్స్‌) అంచనాల ప్రకారం కాంబే బేసిన్‌ (గుజరాత్‌ లోని కాంబెల్‌), అసోంలోని లక్ష్మీజెన్‌ ఆయిల్‌ ఫీల్డ్‌లో వాణిజ్యపరమైన చమురు, గ్యాస్‌ ఉత్పత్తికి సమృద్ధిగా వనరులు ఉన్నాయి. జాతీయ స్థాయిలో చమురు ఇంధన వనరులను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విధానం (లైసెన్సింగ్‌ విధానం) ప్రకారం మేఘా రెండు క్షేత్రాలను దక్కించుకుంది. మేఘా ఇంజనీరింగ్‌ పూర్తి స్థాయిలో సొంత నిధులు, ఇంజినీరింగ్‌ నైపుణ్యంతో పనులను ప్రారంభిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి బ్యాంక్‌ గ్యారెంటీలు సమకూర్చటం, ఒప్పందం చేసుకోవడం వంటి పనులను పూర్తిచేసింది.

ఇంధన రంగంలో మేఘా అనుభవం

దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంధన రంగంలో అనేక ప్రాజెక్టులను పూర్తిచేసిన మేఘా సంస్థ అసోం, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, త్రిపుర, కర్ణాటక, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలతో పాటు కువైట్‌, జోర్డాన్‌, బంగ్లాదేశ్, సింగపూర్‌ తదితర దేశాలలో రిఫైనరీ తదితర పనులను చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో ఇంధన రంగంలో ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో మౌలిక సదుపాయాలైన ప్రతిష్టాత్మక ముడి ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, కంప్రెసర్‌ ప్లాంట్లు, గ్యాస్‌ ఆధారిత క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంట్స్‌ పనులను సకాలంలో పూర్తి చేస్తోంది.

మేఘా హైడ్రోకార్బన్స్‌ ఇంజనీరింగ్‌ నిపుణుల బృందం ఫ్యాబ్రికేషన్స్‌, ఇన్‌స్టాలేషన్స్‌, హుక్‌ అప్‌ వంటి వాటి కోసం అధునాతన సాంకేతిక పద్ధతులను అవలంభిస్తుంది. ప్రపంచ శ్రేణి నాణ్యత ప్రమాణాలతో, అనుకున్న సమయం కంటే ముందుగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి మేఘా హైడ్రోకార్బన్స్‌ బృందం ప్రాధాన్యత ఇస్తోంది.

ఇంటింటికీ మేఘా గ్యాస్‌

గృహ అవసరాలకు ఎల్పీజీ వంట గ్యాస్‌ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్రప్రభుత్వం పైప్‌ల ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా కార్యక్రమాన్ని చేపట్టింది. తొలిసారిగా గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్‌ను సరఫరా చేసే ప్రాజెక్ట్‌ మేఘా ఇంజనీరింగ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, కర్నాటకలోని తూంకూరు, బెల్గాం జిల్లాలో ప్రారంభించి ముందంజలో ఉంది.

తాజాగా తెంగాణలోని పది జిల్లాలో 5.5 లక్షల గృహాలకు వంటగ్యాస్‌ అందించే 3100 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ల పనులు మేఘా ఇంజనీరింగ్‌ ఇటీవలనే దక్కించుకుంది. దేశవ్యాప్తంగా సహజవాయువు పైపులైన్లను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి మేఘా ఇంజనీరింగ్‌ హైడ్రోకార్బన్స్‌ విభాగం పనిచేస్తోంది.

First Published:  13 Nov 2018 5:47 AM IST
Next Story