ఛత్తీస్ గఢ్ లో రెచ్చిపోతున్న మావోలు
ఛత్తీస్ గఢ్ లో ఎన్నికల వేళ మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. పోలింగ్ ప్రారంభమవడానికి కొన్ని గంటల ముందు నుంచే బాంబుల మోత మోగిస్తున్నారు. విధులకు వెళ్తున్న పోలీసులు, పోలింగ్ సిబ్బందినే టార్గెట్ చేశారు. గతంలో ఓటు వేస్తే వేళ్లు నరుకుతామని హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఛత్తీస్ గఢ్ లో నేడు తొలిదశ పోలింగ్ జరుగుతుంది. దంతెవాడ జిల్లాలోని తుమక్‌పాల్-నయనార్ రోడ్డుపై ఉదయం 5 గంటల ప్రాంతంలో పోలింగ్ విధుల నిమిత్తం వెళ్తున్న భద్రతా సిబ్బంది, ఎన్నికల […]
ఛత్తీస్ గఢ్ లో ఎన్నికల వేళ మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. పోలింగ్ ప్రారంభమవడానికి కొన్ని గంటల ముందు నుంచే బాంబుల మోత మోగిస్తున్నారు. విధులకు వెళ్తున్న పోలీసులు, పోలింగ్ సిబ్బందినే టార్గెట్ చేశారు. గతంలో ఓటు వేస్తే వేళ్లు నరుకుతామని హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఛత్తీస్ గఢ్ లో నేడు తొలిదశ పోలింగ్ జరుగుతుంది. దంతెవాడ జిల్లాలోని తుమక్‌పాల్-నయనార్ రోడ్డుపై ఉదయం 5 గంటల ప్రాంతంలో పోలింగ్ విధుల నిమిత్తం వెళ్తున్న భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈడీని పేల్చేశారు. అయితే ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. అంతా సురక్షితంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆదివారం కూడా మావోయిస్టులు బాంబు దాడికి తెగబడ్డారు. గాలింపు చర్యలకు వెళ్లిన భద్రతా సిబ్బందిపై కాంకేర్ జిల్లాలో బాంబులు పేల్చారు. ఈ ఘటనలో ఓ ఎస్సై ప్రాణాలు కోల్పోయారు.
నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న 10 నియోజక వర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది. మిగతా 8 చోట్ల ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. అత్యంత భద్రత నడుమ 18 స్థానాలకు తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్, బస్తార్, సుక్మా, రాజనందగావ్, దంతెవాడ జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 190 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మిగతా 72 స్థానాలకు ఈ నెల 20న పోలింగ్ జరగనుంది.
ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌తో పాటు మంత్రులు కేదార్ కశ్యప్, మహేశ్ గగ్దా, ఎంపీ విక్రమ్ ఉసెందీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. డిసెంబరు 11న ఫలితాలు వెలువడనున్నాయి.