మహిళా క్రికెట్లో బల్లే బల్లే హిట్టర్ హర్మన్ ప్రీత్ కౌర్
వన్డే ప్రపంచకప్ లో 171- టీ-20 ప్రపంచకప్ లో 103 అప్పుడు కంగారూలు… ఇప్పుడు కివీల ఊచకోత కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్ లోనే….. భారత కెప్టెన్, పంజాబీ హిట్టర్ హర్మన్ ప్రీత్ కౌర్ భుల్లర్ ధూమ్ ధామ్ సెంచరీతో చెలరేగిపోయింది. యాభై ఓవర్ల వన్డే ప్రపంచకప్ లో మాత్రమే కాదు…ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్ లో సైతం శతకాలు బాదిన భారత ఏకైక మహిళా క్రికెటర్ గా హర్మన్ సరికొత్త చరిత్ర […]
- వన్డే ప్రపంచకప్ లో 171- టీ-20 ప్రపంచకప్ లో 103
- అప్పుడు కంగారూలు… ఇప్పుడు కివీల ఊచకోత
కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్ లోనే….. భారత కెప్టెన్, పంజాబీ హిట్టర్ హర్మన్ ప్రీత్ కౌర్ భుల్లర్ ధూమ్ ధామ్ సెంచరీతో చెలరేగిపోయింది.
యాభై ఓవర్ల వన్డే ప్రపంచకప్ లో మాత్రమే కాదు…ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్ లో సైతం శతకాలు బాదిన భారత ఏకైక మహిళా క్రికెటర్ గా హర్మన్ సరికొత్త చరిత్ర సృష్టించింది.
హాట్ హాట్ భారత మహిళా క్రికెట్….
భారత మహిళా క్రికెట్ కు మంచిరోజులొచ్చాయి. మహిళలు ఆడే క్రికెట్టా అంటూ….తేలిగ్గా తీసుకొనే రోజులు పోయాయి. పురుషుల క్రికెట్ తో సమానంగా మహిళా క్రికెట్ నూ ఆదరించాల్సిన రోజులు వచ్చాయి.
ప్రపంచ క్రికెట్లో విరాట్ కొహ్లీ నాయకత్వంలోని మెన్ ఇన్ బ్లూ జట్టు ఏ రేంజ్ లో రాణిస్తుందో….. ప్రపంచ మహిళా క్రికెట్లో …. మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్లు సైతం…. అదేస్థాయిలో రాణిస్తున్నాయి.
వన్డే ప్రపంచకప్ రన్నరప్ గా….
ఇంగ్లండ్ వేదికగా గత ఏడాది ముగిసిన 2017 ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ కు… భారత మహిళా జట్టు చేరి సంచలనం సృష్టించింది. ఎనిమిది జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో…. ఇంగ్లండ్, న్యూజిలాండ్, సెమీ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా లాంటి మేటిజట్లను భారత్ చిత్తు చేసి తానేమిటో నిరూపించుకొంది.
వన్డే జట్టు వైస్ కెప్టెన్, టీ-20 టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ గురించి ఎంత చెప్పుకొన్నా అది తక్కువే అవుతుంది. మహిళా క్రికెట్లో బిగ్ హిట్టింగ్ ఆల్ రౌండర్ గా హర్మన్ ప్రీత్ కౌర్ తర్వాతే ఎవరైనా.
మేడిన్ మోగా క్రికెటర్….
పంజాబ్ లోని మోగాలో జన్మించి…. చిన్నతనం నుంచే అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడుతూ ఎదిగిన …28 ఏళ్ల హర్మన్ ప్రీత్… ప్రపంచకప్ సెమీస్ లో ఆస్ట్రేలియాపై విశ్వరూపమే ప్రదర్శించింది.
రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి రౌండ్లో న్యూజిలాండ్ పై నెగ్గితీరాల్సిన మ్యాచ్ లో స్ట్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీ సాధించిన హర్మన్ ప్రీత్… సెమీఫైనల్లో మాత్రం…. తన కెరియర్ లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడింది.
ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, టాప్ ర్యాంకర్ ఆస్ట్రేలియా బౌలింగ్ ను….హర్మన్ ప్రీత్ ఊచకోత కోసింది. డెర్బీ షైర్ కౌంటీ గ్రౌండ్ వేదికగా జరిగిన ..42 ఓవర్ల ఈ మ్యాచ్ లో… హర్మన్ ప్రీత్ శివమెత్తి పోయింది. గ్రౌండ్ నలుమూలలకూ భారీషాట్లతో పరుగుల మోత మోగించింది.
పరుగుల వెల్లువ…..
కెప్టెన్ మిథాలీ తో కలసి కీలక భాగస్వామ్యం నమోదు చేసింది. మొదటి 50 పరుగులు సాధించడానికి 64 బాల్స్ ఎదుర్కొన్న హర్మన్ ప్రీత్…ఆ తర్వాత గేర్ మార్చి స్పీడ్ పెంచింది. కేవలం 26 బాల్స్ లోనే రెండో 50 పరుగులు సాధించింది. మూడో యాభై పరుగులు సాధించడానికి 18 బాల్స్ మాత్రమే ఎదుర్కొంది.
కేవలం 115 బాల్స్ లోనే 20 బౌండ్రీలు, 7 సిక్సర్లతో 171 పరుగులు సాధించి అజేయంగా నిలిచింది. ప్రపంచకప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్ గా హర్మన్ రికార్డుల్లో చేరింది.
అంతేకాదు…వ్యక్తిగతంగా నాలుగో అత్యుత్తమ స్కోరు సాధించిన మహిళా క్రికెటర్ గా నిలిచింది. బెలిండా క్లార్క్, చమారీ అటపట్టు విజయాంగిని, ఎడ్వర్డ్స్ ల తర్వాతి స్థానంలో హర్మన్ ప్రీత్ కౌర్ నిలిచింది.
తన సూపర్ బ్యాటింగ్ తో…భారత్ కు ఫైనల్స్ బెర్త్ అందించింది. 1975 ప్రపంచకప్ ఫైనల్స్ తర్వాత…భారత్ మరోసారి టైటిల్ సమరానికి అర్హత సాధించడం ఇదే కావడం విశేషం.
టీ-20 ప్రపంచకప్ లో సైతం….
కరీబియన్ ద్వీపాలు వేదికగా ప్రారంభమైన 2018 టీ-20 ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్ లోనే హర్మన్ ప్రీత్…మెరుపు సెంచరీతో చెలరేగిపోయింది. రెండో ర్యాంకర్ న్యూజిలాండ్ తో ముగిసిన గ్రూప్- బీ తొలిరౌండ్ పోటీలోనే…. తన బ్యాటుకు పూర్తి స్థాయిలో పనిచెప్పింది.
టీ-20 మహిళా ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో శతకం సాధించిన భారత తొలిమహిళగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. గయానా నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన పోటీలో…న్యూజిలాండ్ బౌలర్లను హర్మన్ ప్రీత్ ఓ ఆటాడుకొంది.
49 బాల్స్ లోనే సెంచరీ….
కేవలం 51 బాల్స్ లోనే 7 బౌండ్రీలు, 8 సిక్సర్లతో సుడిగాలి సెంచరీ సాధించింది. హర్మన్ ప్రీత్ 103 పరుగుల స్కోరుకు అవుటయ్యింది. కేవలం 49 బాల్స్ లోనే వంద పరుగులు సాధించిన హర్మన్ ప్రీత్…. మహిళా టీ-20 క్రికెట్లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసింది.
జెమీమా రోడ్రిగేస్ తో కలసి నాలుగో వికెట్ కు 134 పరుగులు జోడించింది. అంతేకాదు..న్యూజిలాండ్ ప్రత్యర్థిగా భారత్ 194 పరుగులతో అత్యధిక స్కోరు సాధించడంలో ప్రధానపాత్ర వహించింది.
వన్డే ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్ లో 171 పరుగులు సాధించిన హర్మన్ ప్రీత్… ఇప్పుడు టీ-20 ప్రపంచకప్ లో సైతం శతకం బాదడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.
గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ లో భారత్ కు రన్నరప్ స్థానం అందించిన హర్మన్ ప్రీత్ కౌర్… ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ లో…. తనజట్టును విశ్వవిజేతగా నిలపాలని కోరుకొందాం.