రావణుడు
రావణుడు Ravana: మనకు రాముడు యెంతగా తెలుసునో రావణుడూ అంతగా తెలుసు. పది తలలతో చూడగానే రావణుడని ఇట్టే పోల్చేస్తాం. అతని రాక్షస గుణమే కాదు, అతని వీర భక్తికూడా మనల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది. రావణుని పదితలల గురించి పలు కథలున్నాయి.
మనకు రాముడు యెంతగా తెలుసునో రావణుడూ అంతగా తెలుసు. పది తలలతో చూడగానే రావణుడని ఇట్టే పోల్చేస్తాం. అతని రాక్షస గుణమే కాదు, అతని వీర భక్తికూడా మనల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది.
రావణుని పదితలల గురించి పలు కథలున్నాయి. విశ్వవో బ్రహ్మకు సుమాలి కూతురైన కైకసికి పుట్టిన తొలి కుమారుడే రావణుడు. రావణునికి కుంభకర్ణుడు, విభీషణుడు అనే సోదరులతో పాటు శూర్పణఖ అనే సోదరి కూడా వుంది.
రావణుడు పుట్టినప్పుడట రక్తం వర్షం కురిసిందట. గ్రద్దలు అరిచాయట. దేవతలు కూడా భయపడ్డారట. అప్పుడితనికి 'దశగ్రీవుడు' అని పేరు పెట్టారట.
ఒకరోజు యుగ కుభేరుడు పుష్పక విమానమెక్కి తిరుగుతూ వుంటే కైకసి చూసి ఓర్వలేకపోతుంది. తల్లి మనసు తెలుసుకున్న రావణుడు అది పొందడానికి బ్రహ్మను గురించి తపస్సు చేస్తాడు. ఒంటి వేలి మీద తపస్సు చేశాడని, వేయేండ్ల కొక శిరస్సు చొప్పున తొమ్మిది శిరస్సులు రాల్చాడని అపుడు బ్రహ్మ ప్రత్యక్ష మయ్యాడని చెపుతారు. "నాకు నరుల వలన భయము లేదు, దేవ యక్ష గంధర్వాదులచే మరణం లేకుండా వరమివ్వు" అని కోరాడని చెప్తారు. ఆతర్వాతనే లంకకు రాజయ్యాడు రావణుడు.
రావణుడు మండోధరిని పెళ్ళి చేసుకున్నాడు. వీరికి మేఘనాథుడు, దేవాంతకుడు, నరాంతకుడు, మహాపార్శ్వుడు, అక్షుడు అనే కొడుకులు పుట్టారు.
తనకు బుద్దులు చెప్పబోయిన కుబేరుని అలకా పట్టణంపై దాడి చేయడమే కాకుండా అతన్ని ఓడించి పుష్పక విమానమును స్వాధీనపరచుకున్నాడు రావణుడు. అతన్ని పుష్పక విమానం పై నుండి తోసేసాడు కూడా. ఆ పుష్పక విమానం మీదనే కైలాసం వెళ్ళాడు. దర్శనానికి వీలుపడదన్న నందీశ్వరుని వానర ముఖంతో వెక్కిరించాడు. దాంతో కోపం వచ్చిన నందీశ్వరుడు 'వానరులతోనే నీ వంశం నాశనమవుతుంది' అని శపించాడు. అప్పుడు రావణుడు 'నువ్వెంత? నీ శివుడెంత?' అని కైలాసాన్ని బంతి ఆడించినట్టు ఆడించాడు. శివుడది గ్రహించి తన కాలిబటన వేలితో నొక్కాడు. దానికింద రావణుడి చేతులు పడి నలిగిపోయాయి. ఆ బాధతో రావము చేసాడు కాబట్టే దశకంఠుడికి రావణుడని పేరొచ్చింది.
శూర్పణఖ ప్రేరకంగానో కారకంగానో సీతను రావణుడు ఎత్తుకుపోవడం మీరెరిగిందే. అశోక వనంలో సీతను వుంచి విడువక పోవడంతో రామరావణ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో విభీషణుడు రావణునికి నచ్చజెప్పాలని భంగపడి, బహిష్క్రుతుడై రాముని శరణుకోరాడు. అయితే రావణుని ధాటికి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. రామునికి కూడా రావణుని ఎదుర్కోవడం కష్టమైపోయింది. విభీషణుని ఉపాయం మేరకు రావణుని నాభి దగ్గరున్న అమృత కలశాన్ని పగలగొట్టడంతో రావణుడు ప్రాణాలు వదిలాడు.
రావణుని జన్మ శాపగ్రస్త కారణంగా జరిగిందని హిరణ్యకశపుని వధించడంలో కపటముగా స్తంభం నుండి 'ఇరవై గోళ్ళతో నన్ను చంపితివి, ఇదా పౌరుషం?' అని ఆక్షేపణ చేయడం – దాంతో 'నీకు ముందు జన్మలో ఇరువది బాహువులు, పది శిరస్సులను ఇచ్చి, నేను సామాన్యుడినై సంహరిస్తాను' అన్నట్టుగానే జరిగిన విష్ణుమాయగా చెపుతారు. ఏమయినా రావణుని పాత్ర పట్టుదలకూ, భక్తికీ, చెడువల్లకలిగే హానికి రూపమిచ్చి మలచినట్టుగా తోస్తుంది.
– బమ్మిడి జగదీశ్వరరావు