పోలవరం ప్రాజెక్టులో 'డంపింగ్' కలకలం...!
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణ దశలో ఉన్న పోలవరం ప్రాజెక్టుపై రగడ మొదలైంది. ప్రాజెక్టు పనులు నాసిరకంగా ఉండడంపై ప్రభుత్వం చెబుతున్న కారణాలు, ఎన్‌జీఆర్ ఐ సంస్థ చెప్పిన కారణాలకు పొంతన లేకుండా పోతోంది. ప్రాజెక్టు కోసం ఇక్కడి మడుగులను తవ్వి మట్టిని రహదారి నిర్మాణం కోసం ఉపయోగించడంతో రోడ్డు నెర్రెలు బారింది. దీంతో ఇవి నాసిరకం పనులు అని చూస్తేనే అర్థమవుతోంది. ఇదే విషయాన్ని ఎన్‌జీఆర్ ఐ శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. కాగా నీటిని నిల్వ చేసే డ్యామ్ పనులు […]
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణ దశలో ఉన్న పోలవరం ప్రాజెక్టుపై రగడ మొదలైంది. ప్రాజెక్టు పనులు నాసిరకంగా ఉండడంపై ప్రభుత్వం చెబుతున్న కారణాలు, ఎన్‌జీఆర్ ఐ సంస్థ చెప్పిన కారణాలకు పొంతన లేకుండా పోతోంది. ప్రాజెక్టు కోసం ఇక్కడి మడుగులను తవ్వి మట్టిని రహదారి నిర్మాణం కోసం ఉపయోగించడంతో రోడ్డు నెర్రెలు బారింది.
దీంతో ఇవి నాసిరకం పనులు అని చూస్తేనే అర్థమవుతోంది. ఇదే విషయాన్ని ఎన్‌జీఆర్ ఐ శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. కాగా నీటిని నిల్వ చేసే డ్యామ్ పనులు కూడా ఇదే రకంగా…. నాసిరకంగా నిర్మిస్తే పెద్ద ప్రమాదం సంభవించక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
త్రివేణి ఎర్త్ మూవర్స్ అనే సంస్థకు ప్రభుత్వం మట్టి తవ్వకం పనులను అప్పగించింది. తవ్విన మట్టిని డంపింగ్ చేసేందుకు ప్రభుత్వమే స్థలాలను కొని ఇచ్చింది. ప్రాజెక్టు సమీపంలోని చిన్న చిన్న మడుగుల్లో ఆ సంస్థ ఈ మట్టిని డంప్ చేసింది. దీంతో వర్షాలు వచ్చినప్పుడు గుట్టలపై నుంచి వచ్చిన నీరు ఈ మడుగుల్లో నిల్వ ఉండేది. అయితే ఈ మడుగులను మట్టితో కప్పేయడంతో ఇప్పుడు నీరు నిల్వకుండా ఉండే పరిస్థితి తయారైంది.
ఇక ఈ డంపింగ్ మట్టితో ప్రాజెక్టు కోసం వచ్చే వాహనాల రాకపోకలకు రహదారిని నిర్మిచింది. దీంతో రోడ్డు నెర్రెలు బారింది. వాస్తవానికి కాంట్రాక్టరే డంపింగ్ కోసం ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కానీ ప్రభుత్వమే రూ.32.66 కోట్లు వెచ్చించి డంపింగ్ స్థలాలను కొనివ్వడం గమనార్హం. కాగా ఈ విషయాన్ని కాగ్ తన నివేదికలో తప్పుబట్టింది.
అయితే ఆర్టీజీఎస్ ఈ నెర్రెలను పరిశీలించిన తరువాత వాతావరణంలో మార్పులతోనే పగుళ్లు ఏర్పడ్డాయని, వీటితో ప్రమాదమేం లేదని తేల్చింది. దీనినే ప్రభుత్వం తన నివేదికగా చూపించారు. కానీ ఎన్‌జీఆర్ ఐ సంస్థ మాత్రం డంపింగ్ యార్డు కోసం మడుగులను మట్టితో కప్పేయడం కచ్చితంగా నిబంధనలకు విరుద్ధమేనని తేల్చింది. ప్రాజెక్టు హెడ్ వర్క్ కూడా ఇలాగే కొనసాగితే భారీ ప్రమాదం సంభవించక తప్పదని హెచ్చరిస్తోంది. ఇకపై పనులు నాణ్యతగా కొనసాగాలంటే సీఎస్‌ఎంఆర్‌ఎస్, థర్డ్‌పార్టీ క్వాలిటీ కంట్రోల్‌రూంతో తనిఖీలు చేయించాలని చెబుతోంది.