Telugu Global
Family

గర్వం

మనుషులయినా దేవతలయినా అందరం పరమాత్మ సృష్టిలో భాగం.  మనం అహంకరిస్తే అది మనకే ప్రమాదం. దీనికి ఎవరూ మినహాయింపుకారు. దేవతలు రాక్షసుల్ని యుద్ధంలో జయించారు. అదంతా తమ ప్రతాపంవల్లనే అని వాళ్ళు విర్రవీగారు. అది పరమాత్ముని కృప వల్ల జరిగిందనివాళ్ళు అనుకోలేదు. అదంతా స్వయం శక్తి వల్లనే సాధ్యమయిందని, సృష్టిలో తమని మించిన శక్తి సంపన్నులు ఎవరూ లేరని గర్వించారు. ఒక సారి గర్వం మొదలు కావాలి కానీ దానికి అంతముండదు. దానివల్ల అంధులవుతారు. విచక్షణ కోల్పోతారు. […]

మనుషులయినా దేవతలయినా అందరం పరమాత్మ సృష్టిలో భాగం. మనం అహంకరిస్తే అది మనకే ప్రమాదం. దీనికి ఎవరూ మినహాయింపుకారు. దేవతలు రాక్షసుల్ని యుద్ధంలో జయించారు. అదంతా తమ ప్రతాపంవల్లనే అని వాళ్ళు విర్రవీగారు. అది పరమాత్ముని కృప వల్ల జరిగిందనివాళ్ళు అనుకోలేదు. అదంతా స్వయం శక్తి వల్లనే సాధ్యమయిందని, సృష్టిలో తమని మించిన శక్తి సంపన్నులు ఎవరూ లేరని గర్వించారు.

ఒక సారి గర్వం మొదలు కావాలి కానీ దానికి అంతముండదు. దానివల్ల అంధులవుతారు. విచక్షణ కోల్పోతారు.

పరమాత్మ వాళ్ళ అహంకారాన్ని పోగొట్టడానికి యక్షుని రూపంలో వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ యక్షుడు తమకోసం వచ్చిన పరమాత్ముడని వాళ్ళు తెలుసుకోలేదు. దేవతలు తమలో ఒకడయిన అగ్నితో ‘ఈ యక్షుడెవడో ఎందుకు మన దగ్గరికి వచ్చాడో బోధపడడం లేదు. నువ్వు వెళ్ళి అతని వ్యవహారమేదో కనుక్కుని రా’ అని పంపాడు. అగ్ని యక్షుడి దగ్గరికి వెళ్ళాడు.

ఎవ్వరు నువ్వు? అన్నాడు యక్షుడు

అగ్ని ‘నేను అగ్నిదేవుణ్ణి! నన్ను జుతవేదసుడంటారు.. ముల్లోకాలలో పేరుగడించిన వాణ్ణి’ అన్నాడు..

యక్షుడు ‘ ఏమిటి నీ ప్రత్యేకత. నీ శక్తి సామర్ధ్యాలు ఎలాంటివి?’ అన్నాడు.

అగ్ని ‘నేను క్షణంలో దేన్నయినా భస్మం చెయ్యగలను. దహించగలను’ అన్నాడు. యక్షుడు ఒక గడ్డిపోచను అగ్నిముందు వేసి ‘దీన్ని దహించు’ అన్నాడు. అగ్ని తన శక్తి సామర్ధ్యాల్ని ఆ గడ్డిపోచమీద కేంద్రీకరించినా దాన్ని ఏమీ చెయ్యలేకపోయాడు. అవమానంలో అగ్ని వెనక్కి వెళ్ళి దేవతలతో చెప్పాడు. దేవతలు వాయుదేవుడితో ‘నువ్వు వెళ్ళి ఆ యక్షుడి పనిపట్టు’ అన్నాడు. వాయువు యక్షుడి దగ్గరికి వెళ్ళాడు. ‘నేను పర్వతాలనైనా ఎగరగొట్టగలిగే బలసంపన్నుణ్ణి. చరాచర జగత్తంతా నిర్భయంగా సాగుతానన్నాడు. యక్షుడు’ సరే! ఈ గడ్డిపోచను కదిలించు’ అన్నాడు. వాయుదేవుడు ఎంత గింజుకున్నా గడ్డిపోచను అణువంత కూడా కదిలించలేకపోయాడు. అవమానంతో తిరిగి వెళ్ళాడు. దేవతల రాజయిన యింద్రుని దగ్గరకు వెళ్ళి మొరబెట్టుకున్నారు. సరే నేను చూస్తానని ఇంద్రుడు యక్షుని దగ్గరకు వెళ్ళాడు. యక్షుడు అదృశ్య మయ్యాడు. యక్షుని స్థానంలో అపూర్వ సౌందర్య రాశియైన స్త్రీ వుంది. ఆమె ఎవరో కాదు పార్వతీదేవి. ఇంద్రుడు ఆమెకు అభివాదం చేసి ‘అమ్మా! యింత క్రితం దేవతలనందర్నీ నిరుత్తరుల్ని చేసిన శక్తి వంతుడయిన ఆ యక్షుడెవరు?’ అని అడిగాడు. దానికి హిమవంతుని కూతురయిన పార్వతి. ‘ఇంద్రా! అతను యక్షుడు కాడు. ఆ రూపంలో ప్రత్యక్షమయిన బ్రహ్మ లేదా పరమాత్ముడు. బలహీన మనస్కులయిన దేవతలు ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేకపోయారు. అందుకనే గుర్తించ లేకపోయారు. రాక్షసుల్ని మీరు గెలిచారు. కానీ ఆ శక్తి సామర్థ్యాలు మీవే అని అహం చూపారు. పరమాత్మ దయదలిచి మీకా శక్తి సామర్థ్యాల్ని యిచ్చాడన్న సత్యాన్ని గ్రహించలేక అంధులయి అహంకరించారు. పరమాత్మ శక్తిని గ్రహించలేక అంతా తామే సాధించామని గర్వించారు. ఆత్మతత్వాన్ని గ్రహించాలి. అహంకారం అనర్ధదాయకం’ అంది.

ఇంద్రుడు పశ్చాత్తాపంతో ప్రణమిల్లాడు.

– సౌభాగ్య

First Published:  6 Nov 2018 1:30 PM IST
Next Story