Telugu Global
Family

మారీచుడు

పేరు కొత్తగా ఉందనుకుంటున్నారా? రామాయణంలో రావణుడు సీతను అపహరించడానికి ముందు ఏం జరిగిందో గుర్తుందా? అందమైన బంగారు జింకను చూసిన సీత తనకది కావాలని అందిగదా. అప్పుడు రాముడు ఆ మాయలేడి వెంట వెళ్ళాడు కదా? ఆ బంగరు జింక వేషం ధరించిన వాడే మారీచుడు. ఇతడు తాటకీ సునందలకు పుట్టాడు. పూర్వ జన్మలో ఇతడిని జితుడని పిలిచేవాడు. ఒక రోజున విపరీతమైన ఆకలితో జితుడు అగస్త్యుడనే మహా ఋషిని మింగేయాలనుకున్నాడు. అప్పుడు అగస్త్యుడు తప్పించుకొని జితుడ్ని […]

మారీచుడు
X

పేరు కొత్తగా ఉందనుకుంటున్నారా?

రామాయణంలో రావణుడు సీతను అపహరించడానికి ముందు ఏం జరిగిందో గుర్తుందా? అందమైన బంగారు జింకను చూసిన సీత తనకది కావాలని అందిగదా. అప్పుడు రాముడు ఆ మాయలేడి వెంట వెళ్ళాడు కదా? ఆ బంగరు జింక వేషం ధరించిన వాడే మారీచుడు.

ఇతడు తాటకీ సునందలకు పుట్టాడు. పూర్వ జన్మలో ఇతడిని జితుడని పిలిచేవాడు. ఒక రోజున విపరీతమైన ఆకలితో జితుడు అగస్త్యుడనే మహా ఋషిని మింగేయాలనుకున్నాడు. అప్పుడు అగస్త్యుడు తప్పించుకొని జితుడ్ని శపించాడన్న మాట.

ఆ శాపము వలనే జితుడు మరు జన్మలో రాక్షసుడిగా జన్మించాడు. రావణునికి నమ్మిన బంటుగా వున్నాడు. సీత అపహరణ సమయంలో మారీచున్ని తోడు రమ్మని అడిగాడట రావణుడు. అప్పుడు మారీచుడు రాముని గురించి తెలుసుకొని ‘రాముడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు విష్ణు దేవుడు. అతని జోలికి వెళితే లంక పతనం తప్పదు, సీతను అపహరించే ప్రయత్నం మానుకో’ అన్నాడట.

రావణుడు కోపంతో ఊగిపోయి తోడు రాకుంటే తల తీయిస్తానని బెదిరించాడట. ఎలాగైనా చావు తప్పదని తెలుసుకున్న మారీచుడు రావణుని చేతిలో కన్నా రాముని చేతిలో చావడం మేలనుకున్నాడట. తన తప్పును క్షమించమని మనసులోనే రాముణ్ని భక్తితో వేడుకున్నాడట మారీచుడు.

అదిగో అలా బంగారుజింక అవతారమెత్తి సీతకు అందంగా కనిపించాడు. జింక వేషంలో వున్నది మారీచుడని తెలియదుకదా? రాముణ్ని కోరడం, జింక వెంట రాముడు పరుగుతీసి చాలా దూరం వెళ్ళడం, రావణుని పధకం పారడం ఒకటకటీ జరిగిపోయాయి.

అది మామూలు జింక కాదని, మాయజింకని అప్పటికి కనిపెట్టిన రాముడు గురిచూసి బాణం వేసాడు. అది వెళ్ళి జింకకు అంటే మారీచునికి తగిలింది. జింక స్థానంలో మారీచుని అసలు రూపం ప్రత్యక్షమయింది. ‘హా! లక్షణా!’ అని బిగ్గరగా అరుస్తూ మారీచుడు చనిపోయాడు.

ఆ తర్వాత కథ మనకు తెలిసిందే. చూసారా రావణుడు ప్రయోగించిన మారీచుడు రాముని చేతిలో చనిపోయి శాపవిమోచనం పొందాడన్న మాట!

– బమ్మిడి జగదీశ్వరరావు
.

First Published:  4 Nov 2018 2:30 PM IST
Next Story