Telugu Global
NEWS

ఆ పార్టీల అధ్యక్షులంతా పోటీ నుంచి తప్పుకున్నట్టే !

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన మహా కూటమిలో పెద్ద లీడర్లకు పెద్ద చిక్కొచ్చిపడింది. సీట్ల సర్దుబాటుతో సతమతమవుతున్న ఆ పార్టీ నేతల సమయం అంతా అందుకే సరిపోతుందట. సీట్ల సర్దుబాటు తరువాత క్యాంపెయినింగ్ ఉండటంతో, చేసేది లేక టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతలు పోటీలో నిలిచేందుకు అవకాశం లేకుండాపోయిందని చెబుతున్నారు. కుటుంబంలో ఒక్కరికే సీటు సిద్ధాంతాన్ని మహా కూటమి అవలంబిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ హుజూర్ […]

ఆ పార్టీల అధ్యక్షులంతా పోటీ నుంచి తప్పుకున్నట్టే !
X

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన మహా కూటమిలో పెద్ద లీడర్లకు పెద్ద చిక్కొచ్చిపడింది. సీట్ల సర్దుబాటుతో సతమతమవుతున్న ఆ పార్టీ నేతల సమయం అంతా అందుకే సరిపోతుందట. సీట్ల సర్దుబాటు తరువాత క్యాంపెయినింగ్ ఉండటంతో, చేసేది లేక టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతలు పోటీలో నిలిచేందుకు అవకాశం లేకుండాపోయిందని చెబుతున్నారు.

కుటుంబంలో ఒక్కరికే సీటు సిద్ధాంతాన్ని మహా కూటమి అవలంబిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ హుజూర్ నగర్ నుంచి, ఆయన సతీమణి పద్మావతి కోదాడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కుటుంబంలో ఒకరికే సిద్ధాంతం వల్ల కోదాడ సీటును త్యాగం చేసి, భర్త ఉత్తమ్ కు లైన్ క్లియర్ చేసింది ఆమె. ప్రస్తుతం కోదాడ నుంచి బరిలోకి దిగేందుకు టీడీపీ ఉవ్విళ్లూరుతోంది.

ఇక, టీడీపీని లీడ్ చేస్తున్న ఎల్ రమణ పోటీ చేసే అంశం సందిగ్థంలో పడింది. గత ఎన్నికల్లో ఆయన జగిత్యాల నుంచి పోటీ చేశారు. ఈ సారి కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి అనధికార ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. దాంతో రమణ కోరుట్ల నుంచి పోటీ చేయాలని భావించారట. పార్టీ వ్యవహారాల్లో తలమునకలైన ఆయన పోటీకి దూరంగా ఉండి, ప్రచారానికే పరిమితమవ్వాలని చంద్రబాబు సూచించారట. దాంతో ఆయన కేవలం పార్టీ క్యాంపెయినింగ్ కు పరిమితమైపోయారు.

కూటమిలో మరో పార్టీ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కూడా పోటీ చేయడం లేదని తెలుస్తోంది. మొదట్లో పోటీకి సై అన్నారు. రెండు మూడు నియోజకవర్గాలను కూడా ఆయన కోసం పార్టీ శ్రేణులు అన్వేషణ సాగించాయి. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారో అన్న విషయాన్ని ఆయా నియోజకవర్గాల ప్రజలతో పాటు ప్రత్యర్థి పార్టీ శ్రేణులు కూడా ఆసక్తిగా గమనించాయి. అయితే, ఆయన పోటీ చేయడం లేదని ఆ పార్టీ నేతలు ఇప్పుడు స్పష్టత ఇస్తున్నారు. కేవలం ఈయన కూడా ప్రచారానికి, పార్టీ అభ్యర్థుల గెలుపోటములపైనే దృష్టి పెట్టారట.

సీపీఐ విషయానికి వస్తే.. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్ నుంచి ఒకసారి విజయం సాధించారు. ఈ సారి ఆయన ఖచ్చితంగా పోటీ చేస్తారని భావించినా, ఆయన కోరుకున్న నియోజకవర్గం సీట్ల సర్దుబాటులో దొరకకపోవడంతో పోటీకి దూరంగా ఉండిపోతున్నారని తెలుస్తుంది. హుస్నాబాద్ లో కాంగ్రెస్ నేత ప్రవీణ్ రెడ్డి ప్రచారం ఇప్పటికే మొదలుపెట్టేశారు.

ఏది ఏమైనా, మహా కూటమిని లీడ్ చేస్తున్న లీడర్లందరూ ప్రచారానికే, పార్టీ గెలుపు మీదే దృష్టి పెట్టారు. ఒక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే పోటీలో దిగగా, మిగతా పార్టీల నేతలు త్యాగధనులుగా మారిపోయి తమ సీటును వేరొకరికి అప్పగించారు. కూటమి అధికారంలోకి వస్తే ఉత్తమ్ సీఎం అభ్యర్థి అని అందరూ ఇన్ డైరెక్ట్ గా తేల్చేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కూటమిలోని అన్ని పార్టీల నేతలు ఐక్యంగా ముందుకుసాగుతుండటం టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది.

First Published:  3 Nov 2018 9:05 AM IST
Next Story