Telugu Global
NEWS

కొడుకు కోసం వెళితే.... జానారెడ్డికి చేదు అనుభవం

అనుకున్నదే అయ్యింది. తన కుమారుడిని మిర్యాలగూడ నుంచి పోటీచేయించాలని గంపెడాశలు పెట్టుకున్న జానారెడ్డికి ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం రచ్చ రచ్చ అయ్యింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతిపక్ష నేత అయిన జానారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయమై పార్టీ ముఖ్య కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు శనివారం మధ్యాహ్నం స్థానిక ఫంక్షన్ హాలులో సమావేశం ఏర్పాటు చేశారు. […]

కొడుకు కోసం వెళితే.... జానారెడ్డికి చేదు అనుభవం
X

అనుకున్నదే అయ్యింది. తన కుమారుడిని మిర్యాలగూడ నుంచి పోటీచేయించాలని గంపెడాశలు పెట్టుకున్న జానారెడ్డికి ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం రచ్చ రచ్చ అయ్యింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతిపక్ష నేత అయిన జానారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.

మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయమై పార్టీ ముఖ్య కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు శనివారం మధ్యాహ్నం స్థానిక ఫంక్షన్ హాలులో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో టికెట్ ఆశిస్తున్న జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, ఇటీవలే టికెట్ కోసం పార్టీలో చేరిన అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు. కానీ పెద్ద ఎత్తున ఈ సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు మిర్యాలగూడ స్థానికేతరులకు టికెట్లు కేటాయించవద్దని నినాదాలు చేశారు. పార్టీని నమ్ముకొని ఏళ్ల తరబడి ఉన్న స్కైలాబ్ నాయక్, శంకర్ నాయక్ లకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఎస్టీలకే మిర్యాలగూడ టికెట్ కేటాయించాలని జానారెడ్డిని ఘెరావ్ చేశారు. రఘువీర్, అమరేందర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. జానారెడ్డి ఎంత వారించినా, హెచ్చరించినా కార్యకర్తలు వినకుండా సమావేశాన్ని బహిష్కరించారు. నిలదీస్తుంటే జానారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కార్యకర్తలు నినాదాలతో హోరెత్తిస్తూ జానారెడ్డి ప్రచార రథానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించి వేసి రచ్చ చేశారు. ఈ రచ్చతో జానారెడ్డి సమావేశం నుంచి అర్ధాంతరంగా వెనుదిరిగారు.

ఇలా తన కొడుకుకు మిర్యాలగూడ సీటు ఇప్పించి గెలిపించుకుందామనుకున్న జానారెడ్డి ఆశలపై నియోజకవర్గ నేతలు నీళ్లు జల్లారు. చూడాలి మరి.. మిర్యాలగూడ సీటు ఎవరికి దక్కుతుందో.

First Published:  3 Nov 2018 6:36 AM GMT
Next Story