చాతక పక్షి
చాతక పక్షి నేల మీద ఉన్న నీళ్లు తాగదు. వర్షం పడుతున్నప్పుడు మాత్రమే వాన చినుకుల్ని తాగుతుంది. అంతే. అంటే వర్షాకాలంలో తప్ప తక్కిన రుతువుల్లో నీళ్లు తాగదు. అందుకే అది తక్కిన రుతువుల్లో దాహంతో అలమటిస్తూ అరుస్తూ ఉంటుంది. దీనికో కథ ఉంది. ఒక ఊళ్లో ఒక స్త్రీ ఉండేది. ఆమె ఇంట్లో మగవాళ్లు లేరు. కూతురు, కోడలు మాత్రమే ఉండే వాళ్లు. మగవాళ్లు ఏమయ్యారో తెలీదు. వాళ్లకు కొంత పొలం ఉండేది. నాలుగు గేదెలుండేవి. […]
చాతక పక్షి నేల మీద ఉన్న నీళ్లు తాగదు. వర్షం పడుతున్నప్పుడు మాత్రమే వాన చినుకుల్ని తాగుతుంది. అంతే. అంటే వర్షాకాలంలో తప్ప తక్కిన రుతువుల్లో నీళ్లు తాగదు. అందుకే అది తక్కిన రుతువుల్లో దాహంతో అలమటిస్తూ అరుస్తూ ఉంటుంది. దీనికో కథ ఉంది.
ఒక ఊళ్లో ఒక స్త్రీ ఉండేది. ఆమె ఇంట్లో మగవాళ్లు లేరు. కూతురు, కోడలు మాత్రమే ఉండే వాళ్లు. మగవాళ్లు ఏమయ్యారో తెలీదు. వాళ్లకు కొంత పొలం ఉండేది. నాలుగు గేదెలుండేవి.
కూతురు రెండు గేదెలు తీసుకుని, కోడలు రెండు గేదెల్ని తీసుకుని నాగలికి కట్టి పొలం దున్నే వాళ్లు.
ఒక రోజు కూతురు, కోడలు గేదెల్ని తీసుకుని పొలానికి వెళ్లారు. నాగలికి కట్టి పొలం దున్నడం మొదలుపెట్టారు. మధ్యాహ్నమైంది. ఎండ మండిపోతోంది. కూతురు, కోడలు అలసిపోయారు. కొంత పొలం కూడా దున్నలేదు. ఎండకు గేదెలు కూడా అలసిపోయాయి. అంతలో డప్పుల మోత వినిపించింది. ఒక గుంపు కొండకేసి సాగిపోయింది. కొండ మీద పెద్ద ఉత్సవం జరుగుతోంది. కూతురికి ఆ ఉత్సవానికి వెళ్లాలని ఉబలాటం కలిగింది. గేదెల్ని వదిలి ఇంటికి పరిగెత్తి తల్లితో ‘అమ్మా! కొండ మీద ఉత్సవం జరుగుతోంది. నేను వెళతాను’ అంది.
తల్లి మొదట కాదన్నా తర్వాత ‘సరే! మొదట నువ్వు గేదెల్ని చెరువు దగ్గరికి తీసుకెళ్లి వాటి దాహం తీర్చి వాటిని తీసుకొచ్చి కొట్టంలో కట్టేసి వెళ్లు’ అంది.
కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి విషయం వదినతో చెప్పి గేదెల్ని కట్టు విప్పి చెరువు దగ్గరికి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. అవి అలసిపోయి ఉండడంతో మెల్లగా నడిచాయి. వాటిని చెరువు దాకా తీసుకెళితే ఆలస్యమవుతుందని ఇంటికి తీసుకెళ్లి వాటి దాహం తీర్చానని చెప్పి కొట్టంలో వదిలి వెళ్లింది. ఉత్సవానికి వెళ్లిపోయింది. కోడలు మెల్లగా గేదెల్ని చెరువు దగ్గరికి తీసుకెళ్లి వాటి దాహం తీర్చి ఇంటికి తీసుకొచ్చింది.
ఎందుకు ఆలస్యమైందని అత్త అడిగితే అవి అలసిపోవడం వల్ల ఆలస్యమైందని చెప్పింది. కూతురు కొండపైకి వెళ్లి ఉత్సాహంగా ఉత్సవంలో పాల్గొంది.
ఇక్కడ కొట్టంలోని కూతురి గేదెలు దాహంతో అల్లాడిపోయాయి. అవి దాహంతోనే చనిపోయాయి.
చనిపోయే ముందు ‘తమను దాహంతో కన్నుమూసేలా చేసిన కూతురు తను కూడా బతకంతా దాహంతో అల్లాడుతూ ఉండాలని’ శపించాయి.
అప్పుడు కొండ మీద ఉత్సవంలో ఉన్న కూతురు చాతక పక్షిగా మారిపోయింది. కూతురు తిరిగి రాకపోవడంతో తల్లి తల్లడిల్లింది.
చాతక పక్షిగా మారిన కూతురు ఇంటికి వచ్చి ఇంటి ముందు వాలి అరచినా తల్లి తరిమేసింది.
అందుకనే చాతక పక్షులు దాహంతో అరుస్తూ ఉంటాయి అనేది ఒక కథనం.
– సౌభాగ్య