కుంభ కర్ణుడు
Kumbhakarna (కుంభకర్ణుడు): ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళు మరచి నిద్రపోయే వాళ్ళని కుంభ కర్ణులనడం వింటూ వుంటాం. అలాగే ఎంతపెడితే అంతా తినే వాళ్ళని కూడా కుంభకర్ణులనే పిలుస్తాం.
ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళు మరచి నిద్రపోయే వాళ్ళని కుంభ కర్ణులనడం వింటూ వుంటాం. అలాగే ఎంతపెడితే అంతా తినే వాళ్ళని కూడా కుంభకర్ణులనే పిలుస్తాం. అంటే నిద్ర, ఆహారం మితిమీరి చేసే వాళ్ళను కనీసం కుంభకర్ణుడి అన్ననో తమ్ముడనో బంధుత్వం కలిపేస్తాం. మరి అసలు కుంభ కర్ణుని సంగతేంటి?
కుంభకర్ణుడు రావణుని సోదరునిగా మనకు తెలుసు. కైకసి, విశ్రవసునకు పుష్పోత్కటము నందు కుంభకర్ణుడు పుట్టాడు. పుట్టగానే, దొరికిన జంతువుల్ని పట్టుకొని మింగే ప్రయత్నం చేసాడట. అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు బాణాలు వేసి కుంభకర్ణుడ్ని తరిమినా, అతని చేష్టలకు భయపడి బ్రహ్మతో చెప్పుకున్నాడట.
కుంభకర్ణుడు రావణునితో వెళ్ళి బ్రహ్మకోసం ఘోరమైన తపస్సు చేశాడట. అన్న రావణుని మించి తపస్సు చేసేసరికి దేవతలందరూ భయపడ్డారట. వాళ్ళంతా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి 'ఆ కుంభకర్ణుడు యిప్పటికే చాలా శక్తి మంతుడు, మళ్ళీ ఈ తపస్సు వల్ల యేం సాధిస్తాడో? ఈ సృష్టికి ప్రతిసృష్టిగా వున్నాడని వాపోయారట. తమని కాపాడమని వేడుకున్నారట. అప్పుడు బ్రహ్మ అనుజ్ఞ మేరకు సరస్వతి కుంభకర్ణుని నాలుక మీద నిలచి 'ఆరు నెలలు నిద్ర, ఒక రోజు భోజనం కావాలి' అని పలికించిందట. అడిగిన వరమే యిచ్చాడట బ్రహ్మ.
కొడుకు తపమూ ఫలమూ చూసి చింతపడిన విశ్రవుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వరములు మార్చమని కోరాడట. ఇచ్చిన వరము తిరుగులేనిదని చెప్పిన బ్రహ్మ ఆరు నెలల నిద్రానంతరము ఒకరోజు మేల్కని భోజనం చేస్తాడని, ఆరోజు మహా బల పరాక్రమాలు వుంటాయని చెప్పేడట.
అందుకే కుంభకర్ణుడి కోసం ప్రత్యేక భవనం, ప్రత్యేక భోజన సౌకర్యం కల్పించారట. కుంభకర్ణుడు నిద్రలో తీసే గురకకు చెవులు చిల్లులు పడేవట. నోటి నుండి వదిలిన గాలికి సైనికులు అల్లంత దూరం వెళ్ళి పడేవారట. అందుకే రామ రావణ యుద్ధమప్పుడు కుంభకర్ణుని నిద్ర లేపడం చాలా కష్టమయిందట. మేళ తాళాలు హోరు చెవిదగ్గర పెట్టేరట. ముక్కుల్లో గునపాలు గుచ్చేరట. కంటి రెప్పల్ని తెరచాపల్లా నలుగురూ కలిసి ఎత్తేరట. చెవి దగ్గరే ఏనుగులతో ఘీంకరించేటట్టు చేసేరట. కుంభకర్ణుని నిద్ర లేపడానికి పెద్ద యుద్ధం చేసినంత అలసి పోయేరట. ఆఖరికి కుంభకర్ణుడు నిద్ర లేచినా ఆకలి ఆకలి అని అరిచేడట. వెయ్యిమంది పెట్టు ఒక్కడే తిని తేన్చి ఆవలింతలు తీస్తూ మళ్ళీ నిద్రపోయేడట. అప్పుడు రావణుడే వచ్చి చెప్పి రాముడితో యుద్ధానికి కుంభకర్ణుడిని పంపించాడట.
చివరకు కుంభకర్ణుడు యుద్ధంలో రామలక్ష్మణులకు ఎదురు నిలువలేక చనిపోయాడట. ఎంత బలవంతుడో నిద్ర మధ్యలో లేవడం వల్ల అంత బలహీనుడయిపోయినాడట. ఇదంతా కుంభకర్ణుని ముందుజన్మ శాపంగా చెపుతారు. కుంభకర్ణుడు పూర్వ జన్మలో విష్ణుమూర్తి భక్తుడు. విజయుడనీ ద్వారపాలకుడు. శాపము వల్ల కుంభకర్ణుడయినాడు!.
– బమ్మిడి జగదీశ్వరరావు