Telugu Global
NEWS

జగన్‌పై దాడి.... వరుస తప్పులతో ఆత్మరక్షణలోకి

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పై జరిగిన హత్యాయత్నం వ్యవహారాన్ని తక్కువ చేసి చూపించబోయి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారనేది ప్రస్తుతం సర్వత్రా జరుగుతున్న చర్చ. చంద్రబాబుకు జగన్‌ అంటే ఎంత కక్ష ఉన్నా దాన్ని లోపలే దాచుకుని హత్యాయత్నం జరిగినపుడు కచ్చితంగా ఖండించి ఉండాల్సింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలకు తావు లేదు అని ఉండాల్సింది. దాడిపై విచారం ప్రకటిస్తూ ఐజీ లేదా ఎస్పీ ర్యాంకు అధికారి నేతృత్వంలో విచారణకు ఆదేశిస్తామని చెప్పి ఉండాల్సింది. కానీ […]

జగన్‌పై దాడి.... వరుస తప్పులతో ఆత్మరక్షణలోకి
X

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పై జరిగిన హత్యాయత్నం వ్యవహారాన్ని తక్కువ చేసి చూపించబోయి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారనేది ప్రస్తుతం సర్వత్రా జరుగుతున్న చర్చ.

చంద్రబాబుకు జగన్‌ అంటే ఎంత కక్ష ఉన్నా దాన్ని లోపలే దాచుకుని హత్యాయత్నం జరిగినపుడు కచ్చితంగా ఖండించి ఉండాల్సింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలకు తావు లేదు అని ఉండాల్సింది.

దాడిపై విచారం ప్రకటిస్తూ ఐజీ లేదా ఎస్పీ ర్యాంకు అధికారి నేతృత్వంలో విచారణకు ఆదేశిస్తామని చెప్పి ఉండాల్సింది. కానీ అవేవీ జరుగలేదు. పైగా దాడి జరిగింది జగన్‌పై కాదు, తనపైనే అన్నట్లుగా ఆక్రోశం వెళ్ళ గక్కారు.

డీజీపీ చేత తొలుత దాడి చేసిన వ్యక్తి జగన్‌ అభిమాని అని చెప్పించడంతోనే పప్పులో కాలేశారు. దానికి సమర్థింపుగా అదే రోజు రాత్రి విలేకరుల సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తటస్థులను ఏ మాత్రం ఒప్పించలేకపోయాయి.

అంతెందుకు? చంద్రబాబును అవసరాల రీత్యానో…. సామాజిక వర్గం కారణంగానో సమర్థించే వారు కూడా “ఏమిటీ…. చంద్రబాబు ఇలా మాట్లాడారు….” అని నిట్టూర్పులను విడిచారు. అసలు సంఘటనను చిన్నదిగా చేసి చూపడానికి చంద్రబాబు పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడ కూడని విధంగా ఆయన మాట్లాడారనే అపకీర్తిని మూట గట్టుకున్నారు. వాస్తవానికి జగన్‌పై దాడికి చంద్రబాబును నైతికంగా బాధ్యుడిని చేస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు కూడా అప్పటికి మాట్లాడలేదు.

చంద్రబాబు స్పందన చూశాకే వారికి ఇందులో కుట్ర ఉందనేది అవగతం అయింది. చంద్రబాబు అసలు అసహనం ఎందుకు ప్రదర్శించారు? ఎదురుదాడికి ఎందుకు దిగారనే ఆలోచనలు అప్పటి నుంచే వారికి మొదలయ్యాయి? జగన్‌పై జరిగింది అసలు హత్యాయత్నమే కాదని ముఖ్యమంత్రి చెప్పిన మూడో రోజే రిమాండు రిపోర్టులో నిందితుడు శ్రీనివాస్‌ హత్య చేయడానికి ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు.

దీంతో చంద్రబాబు వాదనలోని డొల్లతనం బయటపడింది. ఏది ఏమైనా తనపై హత్యాయత్నం జరిగిన తరువాత ఇప్పటికీ జగన్‌ నోరు మెదపలేదు. కానీ చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు.

నిన్నమొన్నటి వరకూ చంద్రబాబుకు మీడియా సలహాదారుగా ఉండి ఇప్పుడు అక్కడి నుంచి ఉద్వాసనకు గురైన పరకాల ప్రభాకర్‌ కూడా చంద్రబాబు చేసింది పూర్తిగా తప్పని చెబుతున్నట్లు సమాచారంగా ఉంది.

ఆయన తన అంతరంగికుల వద్ద చంద్రబాబు చిన్న విషయాన్ని కెలుక్కుని అనవసరంగా తనపై అనుమానాలు కలిగేలా చేసుకున్నాడని ఆయన వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది.

చంద్రబాబు చుట్టూ ఉన్న ఆయన వర్గానికే చెందిన మేధావుల మాట విని ఇలా పెడదారి పట్టారని ఆయన చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఇదే ప్రభాకర్‌ గతంలో ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబును గట్టిగా సమర్థిస్తూ మాట్లాడిన విషయం విదితమే!

First Published:  30 Oct 2018 3:57 PM IST
Next Story