Telugu Global
Family

భీముడు

మనం నలుగురం చెయ్యలేని పనిని ఒక్కడే చేసేస్తే భీముడిలా వున్నాడంటాం. ప్రతి మనిషికి కొంత బలం వుంటుంది. కాని ఎక్కువ బలం ఉన్న వాళ్ళని చూస్తే ఠపీమని భీముడు గుర్తుకు వస్తాడు. ఇప్పుడు మనకాలంలో కూడా కొంత మంది బల పరాక్రమాల్ని ప్రదర్శిస్తూ వుంటారు. లారీకి తాడు కట్టి పళ్లతో పట్టి లాగెయ్యడం… గుండెల మీద రాతి పలకని పెట్టి పగలగొట్టించుకోవడం… పెద్ద పేద్ద బరువులు ఎత్తేయడం… ఇలా చాలానే చూసుంటారు. వాళ్ళని కలియుగ భీముళ్ళతో పోలుస్తారు. […]

భీముడు
X

మనం నలుగురం చెయ్యలేని పనిని ఒక్కడే చేసేస్తే భీముడిలా వున్నాడంటాం. ప్రతి మనిషికి కొంత బలం వుంటుంది. కాని ఎక్కువ బలం ఉన్న వాళ్ళని చూస్తే ఠపీమని భీముడు గుర్తుకు వస్తాడు. ఇప్పుడు మనకాలంలో కూడా కొంత మంది బల పరాక్రమాల్ని ప్రదర్శిస్తూ వుంటారు. లారీకి తాడు కట్టి పళ్లతో పట్టి లాగెయ్యడం… గుండెల మీద రాతి పలకని పెట్టి పగలగొట్టించుకోవడం… పెద్ద పేద్ద బరువులు ఎత్తేయడం… ఇలా చాలానే చూసుంటారు. వాళ్ళని కలియుగ భీముళ్ళతో పోలుస్తారు. మరి అసలు సిసలు భీముడు మీకు తెలుసా?

పంచపాండవులలో రెండవవాడు భీముడు. కుంతీదేవికి పాండురాజుకీ వాయు దేవుని అనుగ్రహం వల్ల పుట్టినవాడు.

ఒకరోజు కుంతీదేవి భీముణ్ని ఎత్తుకొని వనదేవతని పూజించడానికి వెళ్తూవుంది. పులి ఆమె వెంట పడింది. పరిగెత్తిన కుంతీదేవి చేతుల్లోంచి జారి భీముడు కిందనున్న రాతి మీద పడ్డాడట. ఏమయిందోనని పాండురాజు ఆందోళనతో లేవదీస్తే భీమునికి యేం కాలేదు కాని ఆరాయి ముక్క ముక్కలయిపోయిందట. అంతేకాదు. పాండురాజు మరణం తర్వాత హస్తినకు వచ్చిన పాండవులు కౌరవుల్ని ఓడించారట. భీముని బల పరాక్రమాలకు దుర్యోధనుడు బెదిరిపోయి ఈర్ష్యతో విషసర్పములతో కాటు వేయించినా-మడుగులో తోయించినా హాని కలుగ లేదు గనుకనే’ వజ్రకాయుడు’ అని కూడా అన్నారు.

బలములోనే కాదు, మనో నిబ్బరంలోనూ భీమునికి భీముడే సాటి. లక్కయింటికి తను కాపలావున్నప్పుడు హిడింబుడిని సంహరించాడు. మోహించిన హిడింబిని కాదు పొమ్మన్నాడు. కాని అన్న ధర్మరాజు ఆమె కోరిక తీర్చమని కోరినాకనే భీముడు అంగీకరించాడు. హిడింబిని భీముని సంతానమే ఘటోత్కచుడు.

అరవీర పరాక్రమాల్లోనూ పై చేయి భీమునిదేనని బకాసురుడు, జరా సంధులను సంహరించే ఘట్టాలు తెలియజేస్తాయి. బకాసురునకు తనే బండిమీద ఆహారం తీసుకొనిపోయి, తనే ఆ ఆహారం తిని తనని మింగాలని వచ్చిన బకాసురుణ్ని ముష్టియుద్ధం చేసి సంహరించాడు. అలాగే బ్రాహ్మణుడి వేషంతో జరాసంధుని కోటలోకి ప్రవేశించి ముష్టియుద్ధంలోనే వధించాడు.

మత్స్య యంత్రమును పడగొట్టి ద్రౌపతిని తెచ్చిన భీమార్జునుల మాటవిని భిక్షమనుకొని చూడకుండా అన్నదమ్ములను పంచుకోమని తల్లి కుంతి అనడంతో-ఆమె ఆసోదరులందరికీ ఇల్లాలయింది. అలాంటి సహచరిని ధర్మరాజు జూదములో ఓడినప్పుడు దుర్యోధనుడు ఆమెను పరాభవించాడు. అప్పుడు భీముడు దుర్యోధనుని తొడగొట్టి ఆ రక్తంతో ద్రౌపతి కురులను ముడివేస్తామన్న ప్రతిజ్ఞను తరువాత కాలంలో జరిగిన కురుక్షేత్రంలో నెరవేర్చిన పౌరుషవంతుడు భీముడు.

అన్న మాటే కాదు, తానన్న మాటనూ నిలుపుకొని కౌరవపాండవ యుద్ధంలో తన భుజ బల పరాక్రమాలతో పురాణమున ప్రసిద్దికెక్కాడు భీముడు!.
– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  29 Oct 2018 9:48 AM IST
Next Story