అయోధ్య రామమందిరం.... బీజేపీకి సుప్రీం కోర్టు షాక్
2019 ఎన్నికలకు ఇంకా ఎంతో దూరం లేదు. ఇప్పటినుంచే పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఆ ఎన్నికలకు సెమీ ఫైనల్ లాంటి తాజా ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఇందులో అన్నీ పెద్ద రాష్ట్రాలే కావడంతో దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలపై ప్రధానంగా దృష్టిపెట్టారు. ఈ ఐదు రాష్ట్రాల్లో గెలిచే పార్టీనే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు […]
2019 ఎన్నికలకు ఇంకా ఎంతో దూరం లేదు. ఇప్పటినుంచే పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఆ ఎన్నికలకు సెమీ ఫైనల్ లాంటి తాజా ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఇందులో అన్నీ పెద్ద రాష్ట్రాలే కావడంతో దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలపై ప్రధానంగా దృష్టిపెట్టారు. ఈ ఐదు రాష్ట్రాల్లో గెలిచే పార్టీనే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.
బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. సినీ, క్రీడా ప్రముఖులను పార్టీలో చేర్చుకొని గ్లామర్ తో గెలవాలని యోచిస్తోంది. మరో పక్క హిందుత్వ వాదంతో ముందుకెళ్తున్న బీజేపీ.. అయోధ్య రామమందిర నిర్మాణంపై దృష్టి పెట్టింది. వరుసగా సుప్రీం కోర్టులో పిటీషన్ లు దాఖలు చేయించింది.
అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని 2019 ఎన్నికలకంటే ముందే మొదలుపెట్టాలని బీజేపీ భావించింది. సుప్రీం కోర్టు అనుమతులు తీసుకొని మొదలు పెడితే.. రాబోయే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు మెరుగవుతాయని భావించి భారీ స్కెచ్ గీసింది. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగింది..
అయోధ్య రామ మందిర నిర్మాణంపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ సుప్రీం కోర్టు సోమవారం మధ్యాహ్నం సంచలన తీర్పునిచ్చింది. చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల న్యాయమూర్తుల బృందం అయోధ్యరామ మందిర నిర్మాణంపై స్పెషల్ బెంచ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. జనవరి నుంచి ఈ కేసును విచారించనున్నట్టు తీర్పునిచ్చింది.
సుప్రీం జనవరికి వాయిదావేయడం.. ప్రత్యేక బెంచ్ ఏర్పాటుతో అయోధ్యరామ మందిర నిర్మాణం కేసు వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు (మే నెలలోపు) తేలదని అర్థమైపోయింది. ఎన్నికల వేళ రామ మందిర నిర్మాణం చేపట్టి లబ్ధి పొందాలని చూసిన బీజేపీ ఆశలపై ఈ తీర్పు నీళ్లు చల్లింది.
అయితే హిందూ-ముస్లిం ల వివాదాస్పద స్థలం అయోధ్యలో చేపట్టే ఈ మందిర నిర్మాణం చాలా సున్నితమైనది కావడం.. ఇరు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగే అవకాశం ఉండడంతో సుప్రీం నిష్పక్షపాతంగా.. పార్టీల రాజకీయాలకు అతీతంగా తీర్పును వాయిదా వేయడంపై సర్వాత్ర హర్షం వ్యక్తం అవుతోంది.