Telugu Global
NEWS

ఎమ్మెల్యే ఐజయ్యకు వైసీపీ టికెట్‌ హుళక్కేనా!

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే యక్కలదేవి ఐజయ్యకు ఈ దఫా మళ్లీ ఆ పార్టీ టికెట్‌ లభించడం అనుమానాస్పదంగా ఉంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఐజయ్యపై అంత సదభిప్రాయం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో చివరి నిమిషంలో వచ్చి వైఎస్సార్‌సీపీ టికెట్‌ ఎగరేసుకుని పోయి 22 వేల భారీ ఆధిక్యతతో గెలుపొందిన ఐజయ్య అటు ప్రజల్లో పలుకుబడి నిలబెట్టుకోవడంలోనూ, ఇటు అధినాయకుని విశ్వాసం చూరగొనడంలోనూ విఫలమయ్యారని […]

ఎమ్మెల్యే ఐజయ్యకు వైసీపీ టికెట్‌ హుళక్కేనా!
X

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే యక్కలదేవి ఐజయ్యకు ఈ దఫా మళ్లీ ఆ పార్టీ టికెట్‌ లభించడం అనుమానాస్పదంగా ఉంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఐజయ్యపై అంత సదభిప్రాయం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు.

2014 ఎన్నికల్లో చివరి నిమిషంలో వచ్చి వైఎస్సార్‌సీపీ టికెట్‌ ఎగరేసుకుని పోయి 22 వేల భారీ ఆధిక్యతతో గెలుపొందిన ఐజయ్య అటు ప్రజల్లో పలుకుబడి నిలబెట్టుకోవడంలోనూ, ఇటు అధినాయకుని విశ్వాసం చూరగొనడంలోనూ విఫలమయ్యారని నియోజకవర్గంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.

2014లో వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన 67 మంది ఎమ్మెల్యేల్లో 23 మంది తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు లొంగి అధికారపార్టీలోకి చేరిపోయారు. అదే సమయంలో ఐజయ్యకు కూడా టీడీపీ నుంచి మంచి ఆఫర్లే వచ్చాయి. ఐజయ్య తన కుమారుడి ప్రభావానికి తలొగ్గి కొంత ఊగిసలాటకు అప్పట్లో లోనయ్యారు.

వైఎస్సార్‌సీపీ నేతలు కూడా పార్టీ వీడవద్దని ఆయనకు నచ్చ జెప్పడంతో ఐజయ్య తాను గెలిచిన పార్టీలోనే ఉండి పోవడంతో పాటుగా కర్నూలులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సభ జరిగినపుడు వేదికపైనే ఆయన్ను గట్టిగా ఎదుర్కొన్నారు. అది అప్పట్లో అందరినీ ఆకర్షించింది కూడా.

టీడీపీ నుంచి వచ్చిన ప్రలోభాలకు ఐజయ్య ఊగిసలాడ్డం, నియోజకవర్గంలో ఆయనంటే ప్రజల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో జగన్‌ ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నారని తెలిసింది. పార్టీ కార్యకర్తలతోనూ…. ఏదైనా పని కోసం వచ్చే ప్రజలతోనూ ఐజయ్య దురుసుగా వ్యవహరిస్తున్నారనే విషయం జగన్‌ దృష్టికి వచ్చిందంటున్నారు. ఇతరత్రా కూడా ఆయ ప్రవర్తనపై జరుగుతున్న చర్చ ప్రతికూలంగా పరిణమిస్తోందని అంటున్నారు.

అంతేకాక ఆ నియోజకవర్గంలో గెలుపు ఓటములను నిర్దేశించే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా ఐజయ్య వ్వవహారశైలి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు సమాచారంగా ఉంది. వైఎస్సార్‌సీపీకి గెలుపు రీత్యా సురక్షితమైన నియోజకవర్గాల్లో ఒకటైన నందికొట్కూరులో అభ్యర్థిని మార్చకపోతే…. అక్కడ గెలుపొందడం కష్టం అనే భావనలో వైఎస్సార్‌సీపీ వర్గాలు కూడా ఉన్నాయి.

ప్రలోభాలకు ఊగిసలాడినా చివరకు తమ వెంటే నడిచిన ఐజయ్యను అంత సులభంగా జగన్‌ మారుస్తాడా? అనే అనుమానం కూడా ఉంది. ఈ అనుమానంతోనే ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ టికెట్‌ కావాలంటూ ఇద్దరు నేతలు వేచి చూస్తూ వెయిటింగ్‌ లిస్టులో ఉన్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి ఒకరు కాగా, గతంలో ఉమ్మడి రాష్ట్రం అసెంబ్లీలో ప్రధాన భద్రతాధికారిగా పనిచేసిన అర్థర్‌ మరొకరు. వీరిద్దరూ ఇప్పటికే తమ ప్రయత్నాలు తీవ్రతరం చేశారు.

ఐజయ్యను మారిస్తే తమ పేర్లను పరిశీలించాల్సిందిగా ఇప్పటికే జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారని తెలిసింది. అయితే లబ్బి వెంకటస్వామి అంటే జగన్‌కు అంత సదభిప్రాయం లేదని చెబుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో పైకొచ్చిన లబ్బి ఆ తరువాత పరిణామాల్లో చంద్రబాబునాయుడు వైపు వెళ్ళిపోవడమే కాక 2014లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇది స్థానిక కార్యకర్తలకు మింగుడుపడని పరిణామంగా ఉంది. కొందరు వైఎస్సార్‌సీపీకి చెందిన రెడ్డి నాయకుల ద్వారా వెంకటస్వామి తన ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

అర్థర్‌కు 2014 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ “బి” ఫారం ఇచ్చినట్టే ఇచ్చి చివరి క్షణంలో రద్దు చేశారు. ప్రస్తుతం ఆ విషయాన్ని అర్థర్‌ జగన్‌కు, ఆ జిల్లాలోని ముఖ్య నేతలకూ విన్నవించుకుంటున్నారు. గత ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్‌ చేజారినందున ఇపుడు తనకు టికెట్‌ కావాలని కోరుతున్నారు.

వైఎస్సార్‌సీపీకి చెందిన స్థానిక నేతలు వెంకటస్వామి వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం…. లబ్బి అయితే తమ చెప్పుచేతల్లో ఉంటారనుకోవడమేనని భావిస్తున్నారు. అర్థర్‌ పోలీసు అధికారి కనుక ఆయన తమ కనుసన్నల్లో ఉండడేమోననే అనుమానాలు వారికి ఉన్నాయట. వీరి ప్రయత్నాలు తెలుసుకున్న ఎమ్మెల్యే ఐజయ్య కూడా తన టికెట్‌ను నిలబెట్టుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు.

స్థానిక వైసీపీ నేతల చుట్టూ తిరుగుతూ తానేం తప్పు చేశానని, టికెట్‌ ఇవ్వక పోయేంత నేరం ఏం చేశానని అంటున్నారట. పార్టీ అగ్రనేతల వద్ద కూడా ఇదే విషయాన్ని ఆయన చెప్పుకుంటున్నారని తెలిసింది. జగన్‌ ఇప్పటికీ పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట సమర్థ అభ్యర్థులను నిర్థారించే కార్యక్రమంలో ఉన్నారనీ, ఇంకా సిట్టింగ్‌ల విషయానికి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటికి ఐజయ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమని స్థానిక పార్టీ నేత ఒకరు తెలిపారు.

First Published:  23 Oct 2018 1:37 PM IST
Next Story