ఆత్మానుభవం
వరుణ మహర్షి కొడుకు భృగువు. అతనికి ఆత్మానుభవం పొందాలని ఆకాంక్ష కలిగింది. గురువును అన్వేషించాల్సిన పని అతనికి లేకపోయింది. కారణం అతని తండ్రి ఐన వరుణ మహర్షి వేదవేదాంగాలు అభ్యసించిన జ్ఞాని. అందుకని తండ్రి దగ్గరికే వెళ్లి నాన్న గారూ… నేను బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలన్న కాంక్షతో ఉన్నాను. దయతో నాకు బ్రహ్మోపదేవం చెయ్యండి అని వేడుకున్నాడు. కొడుకు జ్ఞాన తృష్ణకు సంతోషించిన తండ్రి మన శరీర మనస్సులు, ప్రాణశక్తి అన్నీ బ్రహ్మ జ్ఞానానికి ఆధారాలే. సృష్టి […]
BY Pragnadhar Reddy19 Oct 2018 2:18 PM IST
Pragnadhar Reddy Updated On: 17 Sept 2018 1:07 PM IST
వరుణ మహర్షి కొడుకు భృగువు. అతనికి ఆత్మానుభవం పొందాలని ఆకాంక్ష కలిగింది. గురువును అన్వేషించాల్సిన పని అతనికి లేకపోయింది. కారణం అతని తండ్రి ఐన వరుణ మహర్షి వేదవేదాంగాలు అభ్యసించిన జ్ఞాని. అందుకని తండ్రి దగ్గరికే వెళ్లి నాన్న గారూ… నేను బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలన్న కాంక్షతో ఉన్నాను. దయతో నాకు బ్రహ్మోపదేవం చెయ్యండి అని వేడుకున్నాడు.
కొడుకు జ్ఞాన తృష్ణకు సంతోషించిన తండ్రి మన శరీర మనస్సులు, ప్రాణశక్తి అన్నీ బ్రహ్మ జ్ఞానానికి ఆధారాలే. సృష్టి స్థితిలయలకు కారణమైన, మూలాధారాలమైనవి ఏది ఉందో దాన్ని తపస్సు ద్వారా తెలుసుకోవచ్చు. అందువల్ల తపస్సు చేయి అన్నాడు.
భృగువు నియమ నిష్టలతో, తదేక దీక్షతో తపస్సు చేశాడు. మొదట అతను తపస్సు ద్వారా గ్రహించింది అన్నమే అన్నిటికీ ఆధారమని, అందుకనే అన్నం పరబ్రహ్మ మన్నాడు. తన అనుభవాన్ని తండ్రికి వివరించాడు.
వరుణ మహర్షి నిజమే కానీ అది పరబ్రహ్మ స్థూల స్వరూపం. అది సమగ్రం కాదు, సర్వస్వం కాదు. నీకు ఉపరితలమే పరిచయమైంది. ఛాయామాత్రంగా నువ్వు సత్యాన్ని అందుకున్నావు. మళ్లీ తపస్సు చేసి మౌలిక సత్యాన్ని గ్రహించు అన్నాడు.
భృగువు పట్టుదలతో మళ్లీ తపస్సు చేశాడు.
అప్పుడు అతనికి అన్నిటికీ మూలమైంది ప్రాణమే అని గ్రహించాడు. ప్రాణశక్తి లేకుంటే సమస్త శక్తి నిర్వీర్యమవుతుంది. ప్రాణులు చలనం లేనివవుతాయి. కాబట్టి సమస్త సృష్టికి ప్రాణమే ఆధారమని నిర్ణయించుకుని తను గ్రహించిన సత్యాన్ని తండ్రికి విన్నవించాడు.
వరుణ మహర్షి కొడుకు చెప్పింది విన్నాడు. ఏమీ మాట్లాడకుండా బదులివ్వకుండా నువ్వింకా అసలు సత్యాన్ని సమీపించలేదు. ఏకాగ్రతగా మళ్లీ ధ్యానం చేయి. ఆ తపశ్శక్తి వల్ల నీకు అంతిమ సత్యం అందివస్తుంది. అన్నాడు
తండ్రి అజ్ఞానుసారం మళ్లీ తపస్సులో మునిగాడు
ఈ సారి మనస్సే బ్రహ్మమని తెలుసుకున్నాడు. అన్ని భావనలకూ మనసే కేంద్రం అన్నీ దాంట్లోంచే ఉద్భవిస్తాయి. కాబట్టి సృష్టికి ఆధారం మనసే అని నిశ్చయించుకున్నాడు. తన అనుభవాన్ని తండ్రికి వివరించాడు.
వరుణ మహర్షి నీలో సత్యాన్వేషణ ఉంది. కానీ అదింకా సమగ్రం కాలేదు. పరిపూర్ణం కాలేదు. కాబట్టి నీ తపస్సును కొనసాగించు అన్నాడు.
సహనంతో భృగువు మళ్లీ తపోముగ్ధుడయ్యాడు. సత్యాన్వేషికి సహనమే ఆయుధం. ప్రశాంత చిత్తంతో ధ్యానమగ్నులైన వాళ్లకు పరమాత్మ దర్శనమవుతుంది. దానికి కాలనియమం లేదు.
మళ్లీ తపస్సు చేసినప్పుడు భృగువుకు విజ్ఞానమే బ్రహ్మమని అనిపించింది. తన భావాన్ని తండ్రికి నివేదించాడు.
వరుణ మహర్షి నువ్వు దారితప్పలేదు. కానీ దారిలో తటస్థమైనవన్నీ దారికి ఆధారాలుగా భావిస్తున్నావు. నీ ప్రయాణాన్ని కొనసాగించు అన్నాడు.
భృగువు మళ్లీ తపస్సులో మునిగాడు. నిర్మల ప్రయత్నాన్ని నిర్వఘ్నంగా కొనసాగించాడు.
ఆ తపస్సు ఫలితంగా అతను ఆనందమే బ్రహ్మ అని గుర్తించాడు. ఆనందమే అనంత సృష్టి సారమని గ్రహించాడు.ఈ అనంత విశ్వం ఆనందంతో సాగుతోందని తెలుసుకున్నాడు. ఆనందంలోనే ప్రతిదీ పుట్టి, ఆనందంలో ప్రతిదీ జీవించి ఆనందంలోనే ప్రతిదీ లయమవుతోందని గ్రహించాడు.
తన అపూర్వ అనుభవాన్ని తండ్రికి వివరించాడు. తండ్రి కొడుకు మాటలు విని బ్రహ్మానంద పరవశుడయ్యాడు. సుదీర్ఘ ప్రయత్నంలో తన కొడుకు సత్యాన్ని గ్రహించినందుకు ఆనదించాడు.
నానా పరమాత్మ తత్వాన్ని అన్నిటికన్నా గొప్పగా ఆవిష్కరించేది ఆనందం. అన్నం, ప్రాణం, మనసు, విజ్ఞానం, ఇవన్నీ బ్రహ్మస్వరూపమైనవే. ఇవి ఒక దానికంటే ఒకటి సూక్ష్మమైనవి. వీటన్నిటి కన్నా అత్యుత్తమమైనది ఆనందం. కానీ ఇక్కడా దేన్నీ తక్కువ చేయకూడదు. బ్రహ్మణు అందుకోవడానికి ఇవి సోపానాలు. అన్నాన్ని, ప్రాణాన్ని, మనస్సును, పరస్పరాధారాలుగా భావించాలి. వాటి గుండా విజ్ఞానానుభవమవుతుంది. అవన్నీ కలిసి ఆనందంగా పర్యవసిస్తాయి అన్నాడు.
Next Story