పద్మినీరెడ్డి యూ టర్న్..... రాజనర్సింహ ఇంట్లో అసలేం జరిగింది?
తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి యూటర్న్ తీసుకున్నారు. గురువారం ఉదయం బీజేపీలో చేరిన పద్మినీ రెడ్డి…సాయంత్రం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో పార్టీలో చేరితే…. సంగారెడ్డిలోని నివాసంలో తిరిగి కాంగ్రెస్‌లోనే ఉంటానని ఆమె ప్రకటించారు. కాంగ్రెస్ కార్యకర్తల మనోవేదన చూసి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. తాను బీజేపీలో చేరడం వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఇంత మనోవేదన చెందుతారని తాను అనుకోలేదని అన్నారు. బీజేపీలో చేరడం […]
తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి యూటర్న్ తీసుకున్నారు. గురువారం ఉదయం బీజేపీలో చేరిన పద్మినీ రెడ్డి…సాయంత్రం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో పార్టీలో చేరితే…. సంగారెడ్డిలోని నివాసంలో తిరిగి కాంగ్రెస్‌లోనే ఉంటానని ఆమె ప్రకటించారు.
కాంగ్రెస్ కార్యకర్తల మనోవేదన చూసి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. తాను బీజేపీలో చేరడం వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఇంత మనోవేదన చెందుతారని తాను అనుకోలేదని అన్నారు. బీజేపీలో చేరడం అనుకోకుండా తాను తీసుకున్న నిర్ణయమని చెప్పారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా ఉన్న దామోదర రాజనర్సింహ భార్య బీజేపీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అన్నదమ్ముళ్లు వేర్వేరు పార్టీలలో ఉండడం చూశారు. అక్కాచెల్లెళ్లు వేర్వేరు కండువాలు వేసుకోవడం విన్నారు. కానీ భార్యాభర్తలు వేర్వేరు పార్టీల్లో ఉండడం చూడలేదు. పద్మినీ రెడ్డి నిర్ణయంతో కాంగ్రెస్ నేతలే కాదు… ఇతర పార్టీల నేతలూ షాక్ అయ్యారు. రాజనర్సింహ ఇంట్లో ఏం జరుగుతుందని చర్చించుకోవడం మొదలెట్టారు.
పద్మినీరెడ్డి ఇలాంటి షాక్ ఇస్తుందని రాజనర్సింహ కూడా ఊహించలేదు. ఆందోల్ ప్రచారంలో ఉండగా ఈ విషయం తెలిసింది. వెంటనే ప్రచారం రద్దు చేసుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. పద్మినీరెడ్డి పార్టీ మార్పు కారణాలపై ఇంట్లో చర్చలు జరిపారు. రాత్రికి సంగారెడ్డికి చేరుకుని ఇతర కుటుంబసభ్యులతో కలిసి చర్చించారు. ప్రెస్‌మీట్ పెట్టించి చివరకు ఆమె కాంగ్రెస్‌లోనే ఉంటానని ప్రకటన ఇప్పించారు. ఇంతవరకు ఓకే…అయితే బీజేపీలో చేరతానని ఆమె హఠాత్తుగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారనేది ఓ హాట్ టాపిక్‌గా మారింది.
పద్మినీరెడ్డి ప్రధానంగా భక్తురాలు. ఆమె పరిపూర్ణానందతో కలిసి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ నేతలతో పరిచయాలు ఉన్నాయి. ఇటీవలే ఢిల్లీ వెళ్లి అమిత్‌షా, రాంమాధవ్‌లను కలిసివచ్చిన పరిపూర్ణానంద కాంగ్రెస్‌ను దెబ్బకొట్టే వ్యూహాలు తన దగ్గర ఉన్నాయని చెప్పినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే పద్మినీరెడ్డిని బీజేపీలో చేర్చారనేది ఓ టాక్.
పద్మినీరెడ్డికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉంది. సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే అక్కడ జగ్గారెడ్డి కీలక నేతగా ఉన్నారు. ఆమెకు టికెట్ రావడం కష్టం.
మెదక్ ఎంపీగా పోటీ చేసే చాన్స్ వస్తుందో లేదో తెలియదు. ఇంతకుముందు కూడా బీజేపీ దామోదరతో పాటు ఆమె భార్యకు టికెట్ ఇస్తామని… పార్టీలోకి రావాలని ఆఫర్ ఇచ్చింది. అయితే ఈ ఆఫర్‌ను దామోదర తిరస్కరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో ఉంటే ఎప్పటికైనా సీఎం అవుతానని…. బీజేపీలో చేరితే పొలిటికల్ కెరీర్ నష్టపోతామని కుటుంబసభ్యులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక్కడే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి పద్మినీరెడ్డి పార్టీ మారే నిర్ణయం తీసుకున్నారని దామోదర సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి ఆమె నిర్ణయం మార్చుకోవడంతో ఇప్పుడు దామోదర ఫ్యామిలీయే కాదు… కాంగ్రెస్ నేతలు కూడా ఊపిరి పీల్చుకున్నారు.