పట్టణ వాస్తు మార్చినా.... ఎమ్మెల్యేకి శని వదల్లేదు
ఎన్నికల టైమ్ రాజకీయనాయకులకు విలువైంది. ఈ సమయంలో కాలం కలసిరాకపోతే ఇక అంతే సంగతులు. ఇప్పుడు తాజా మాజీ ఎమ్మెల్యేకు ఇదే పరిస్థితి ఎదురైంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. ఆతర్వాత అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో మళ్లీ ఆయనకే టికెట్ వచ్చింది. ఈ సారి తిరిగి ఎలాగైనా గెలవాలని ఆయన మూడు నెలల నుంచి నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కానీ ఒకే ఒక అంశం ఆయన్ని ఇప్పుడు పోటీ నుంచి తప్పుకునేలా […]
ఎన్నికల టైమ్ రాజకీయనాయకులకు విలువైంది. ఈ సమయంలో కాలం కలసిరాకపోతే ఇక అంతే సంగతులు. ఇప్పుడు తాజా మాజీ ఎమ్మెల్యేకు ఇదే పరిస్థితి ఎదురైంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. ఆతర్వాత అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో మళ్లీ ఆయనకే టికెట్ వచ్చింది. ఈ సారి తిరిగి ఎలాగైనా గెలవాలని ఆయన మూడు నెలల నుంచి నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కానీ ఒకే ఒక అంశం ఆయన్ని ఇప్పుడు పోటీ నుంచి తప్పుకునేలా చేస్తోంది. అదే ఆరోగ్య సమస్య.
పరకాల తాజా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇటీవల బాత్‌రూమ్‌లో జారిపడ్డారు. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టింది. వెంటనే హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. బీపీ ఎక్కువ కావడం వల్లే కళ్లు తిరిగి ఆయన పడ్డారని డాక్టర్లు తేల్చారు. కింద పడడం వల్ల మెదడులో రక్తం గడ్డ కట్టిందని నిర్దారించారు. అయితే ఒకసారి రక్తం గడ్డ కడితే మళ్లీమళ్లీ ఇదే సమస్య వస్తుందని డాక్టర్లు హెచ్చరించారు. బీపీ కంట్రోల్‌లో పెట్టుకోవాలని సూచించారు.
ఎన్నికల ప్రచారం అంటేనే హై బీపీతో కూడుకున్న సమస్య. ఈ పరిస్థితుల్లో పోటీ చేయకపోవడమే మంచిదని సలహా ఇచ్చారు. డాక్టర్ల అడ్వైజ్‌తో ఇప్పుడు ధర్మారెడ్డి ధర్మ సంకటంలో పడ్డారు. పోటీ చేయాలా? వద్దా? అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆరోగ్యం కంటే ఎమ్మెల్యే పదవి గొప్ప కాదని…. పోటీ చేయొద్దని కుటుంబసభ్యులు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ సారి పరకాలలో కాంగ్రెస్ తరపున కొండా సురేఖ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆమెకు బలగం ఎక్కువ. ఆమెతో పోటీ పడి గెలవడం కష్టమన్న భావన ధర్మారెడ్డి ఫ్యామిలీలో ఉంది. తాను పోటీ చేయకపోతే… తన కుటుంబసభ్యుల్లో ఒకరిచేత పోటీ చేయించాలనే ఆలోచనలో ధర్మారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే పరకాల నియోజకవర్గానికి ఓ సెంటిమెంట్ ఉంది. ఇక్కడ వరుసగా ఏ ఎమ్మెల్యే కూడా రెండోసారి గెలవలేదు. నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఆనవాయితీగా సెంటిమెంట్ వస్తోంది. కొండా సురేఖ కూడా రెండోసారి ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ సెంటిమెంట్‌ను తిరగరాసేందుకు మూడు నెలల కిందటనే ధర్మారెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. పరకాల పట్టణానికి వాస్తు మార్పులు చేయించారు. పట్టణంలో బొడ్రాయిని పెట్టారు.
ఈ వాస్తు మార్పులతో తన విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆయన తలిచారు. కానీ కాలం ఇలా ఆయన ముందుకు మరో సమస్యని తెచ్చిపెట్టింది. పరకాలలో పోటీపై దసరా తర్వాత కేసీఆర్‌తో చర్చించి ధర్మారెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.