Telugu Global
National

పండుగల సీజన్ కోసం 50వేల ఉద్యోగుల్ని తీసుకున్న అమెజాన్

అమెజాన్ ఈ-కామర్స్ సంస్థ ఈ దసరా, దీపావళి పండుగల సీజన్ ను పెద్ద ఎత్తున క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా కొత్తగా 50,000 కన్నా ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకొని వస్తువులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసింది. దీనికోసం పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన కూడా చేపడుతోంది. ఈ మధ్య ప్రపంచ రిటైలర్ వాల్ మార్ట్ చేతికి చిక్కిన దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అమెజాన్ సంస్థ […]

పండుగల సీజన్ కోసం 50వేల ఉద్యోగుల్ని తీసుకున్న అమెజాన్
X

అమెజాన్ ఈ-కామర్స్ సంస్థ ఈ దసరా, దీపావళి పండుగల సీజన్ ను పెద్ద ఎత్తున క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా కొత్తగా 50,000 కన్నా ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకొని వస్తువులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసింది. దీనికోసం పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన కూడా చేపడుతోంది.

ఈ మధ్య ప్రపంచ రిటైలర్ వాల్ మార్ట్ చేతికి చిక్కిన దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అమెజాన్ సంస్థ భారీ ఆఫర్లతో మార్కెట్ ను షేక్ చేయబోతోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివెల్ ను ఈనెల 10-15 వరకు నిర్వహిస్తోంది. అమెజాన్ సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా 50 కన్నా ఎక్కువ శాశ్వత కేంద్రాలు, బహుళ పంపిణీ కేంద్రాలు, దేశవ్యాప్తంగా 150 బట్వాడా స్టేషన్లతో భారీ నెట్ వర్క్ ను కలిగి ఉంది.

అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా మాట్లాడుతూ ”అమెజాన్ ఇండియా ద్వారా ఈ పండుగ సీజన్ లో వినియోగదారులు బుక్ చేసుకున్న వస్తువులను ఎలాంటి అంతరాయం, ఆలస్యం చేయకుండా అందించడానికి అమెజాన్ నెట్ వర్క్ భారీ విస్తరణకు పూనుకుందని.. ఇందుకోసం దేశవ్యాప్తంగా 50వేల మంది సీజనల్ అసోసియేట్స్ ను నియమించామని.. ఇది అమెజాన్ నెట్ వర్క్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసిందని” తెలిపారు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అక్టోబర్ 10-15 మధ్య భారీ అసాధారణ ఆఫర్లను ప్రకటిస్తున్నట్టు ఆయన తెలిపారు. అమెజాన్ ఇండియా పండుగల సమయంలోనే కాదు…. ఏడాది పొడవునా…. మౌళిక సదుపాయాలను, డెలివరీ నెట్ వర్క్ ను పెంచడానికి భారీగా పెట్టుబడి పెట్టిందని ఆయన వివరించారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, ఫుణే వంటి నగరాల్లో ఈ సెన్సేషనల్ స్థానాలు ఏర్పాటు చేశామని.. ఇంకా సార్టింగ్ సెంటర్లు, డెలివరీ స్టేషన్లు, కస్టమర్ సర్వీస్ సైట్లు ఇతర పండుగల సమయంలో కూడా కొనసాగిస్తామని తెలిపారు.

అమెజాన్ ఈ పండుగల సీజన్ కోసం వినియోగదారులకు చేరువ అయ్యేందుకు తెలుగు, తమిళం, కన్నడ భాషలలో 16 నగరాల్లో 20 కస్టమర్ సర్వీస్ సైట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ సేవా సైట్లు ఈ-మెయిల్, చాట్, సోషల్ మీడియా, ఫోన్, పోస్ట్ ఆర్డర్ ద్వారా అమెజాన్ వినియోగదారులకు సేవలందించబోతోంది.

అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్ లు పండుగల సీజన్ లో ఇలా తాత్కాలికంగా చాలా మందిని తీసుకొని.. తాత్కాలిక కేంద్రాలను నిర్వహిస్తుంటుంది. ఫ్లిప్ కార్ట్ కూడా అక్టోబర్ 10-14 నుంచి బిగ్ బిలియన్ డేస్ కోసం పెద్ద ఎత్తున డెలివరీ కేంద్రాలను గణనీయంగా విస్తరిస్తోంది.

వాల్ మార్ట్ ఫ్లిప్ కార్ట్ ను చేజిక్కించుకున్నాక తన నిల్వ గిడ్డంగుల సామార్థ్యాన్ని రెట్టింపు చేసింది. ప్రస్తుతం 65 కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉండగా.. 60 మెయిన్ కేంద్రాలున్నాయి. పండుగల సమయంలో డిమాండ్ మేరకు కొత్తగా 30,000 డెలివరీ సిబ్బందిని తీసుకుంది.

వచ్చే నెల పండుగ అమ్మకాల్లో దేశవ్యాప్తంగా దాదాపు 20 మిలియన్ల మంది షాపింగ్ చేయనున్నారని రీసెర్చ్ సంస్థ రెడ్సీర్ ఒక నివేదికలో వెల్లడించింది. ఇందుకోసం ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు ఫేమస్ స్టార్ హీరోలు, క్రికెటర్లకు భారీగా పారితోషికం ఇచ్చి ప్రచారం చేయిస్తున్నాయని తెలిపింది.

ఈ-కామర్స్ వెబ్ సైట్ల ఆకర్షనీయ ప్రకటనలతో దేశవ్యాప్తంగా ఆఫ్ లైన్ మార్కెట్ పడిపోయింది. దసరా, దీపావళి సందర్భంగా గణనీయమైన చవకైన ఆఫర్లను ప్రకటించాయి. తద్వారా భారీ లాభాలను అర్జించాలని ప్లాన్ చేస్తున్నాయి. సాధారణంగా సెప్టెంబర్-నవంబర్ మధ్య ఈ సంస్థల వార్షిక అమ్మకాలు గణనీయంగా ఉంటాయి.. ఇందుకోసం కొన్ని నెలల ముందునుంచే ఈ సంస్థలు సర్వం సిద్దం చేసుకుంటాయి.

First Published:  8 Oct 2018 7:45 AM GMT
Next Story