Telugu Global
NEWS

నన్ను పీకి ఆ తర్వాత బాబు వద్దకు వెళ్లు కేసీఆర్‌!... టీవీ9కు రేవంత్ అల్టిమేటం....

రాజకీయంగా టీఆర్‌ఎస్‌కు లబ్ది చేకూర్చేందుకు తనపై టీవీ9, టీన్యూస్‌, నమస్తే తెలంగాణ మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఐటీ దాడుల సమయంలో తనకు విదేశాల్లో ఖాతాలున్నాయంటూ తప్పుడు అకౌంట్ నెంబర్లతో మూడు మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయన్నారు. టీవీ9ను కేసీఆర్‌ బంధువు రామేశ్వరరావు కొనుగోలు చేసిన తర్వాత తనపై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీవీ9, టీ న్యూస్‌, […]

నన్ను పీకి ఆ తర్వాత బాబు వద్దకు వెళ్లు కేసీఆర్‌!... టీవీ9కు రేవంత్ అల్టిమేటం....
X

రాజకీయంగా టీఆర్‌ఎస్‌కు లబ్ది చేకూర్చేందుకు తనపై టీవీ9, టీన్యూస్‌, నమస్తే తెలంగాణ మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ఐటీ దాడుల సమయంలో తనకు విదేశాల్లో ఖాతాలున్నాయంటూ తప్పుడు అకౌంట్ నెంబర్లతో మూడు మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయన్నారు. టీవీ9ను కేసీఆర్‌ బంధువు రామేశ్వరరావు కొనుగోలు చేసిన తర్వాత తనపై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

టీవీ9, టీ న్యూస్‌, నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాల ఆధారంగా విచారణ సమయంలో ఐటీ అధికారులు తనను వేధించారన్నారు. ఏ ఆధారంతో ప్రశ్నిస్తున్నారని తాను ఐటీ అధికారులను ప్రశ్నించగా… టీవీ9, టీన్యూస్‌, నమస్తే తెలంగాణ కథనాలను ఆధారంగా చూపారన్నారు. కాబట్టి ఈ మూడు మీడియా సంస్థల కథనాల వల్ల తాను ఇబ్బంది పడ్డానని చెప్పారు.

ఎన్నికల వేళ తప్పుడు కథనాలు ప్రసారం చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించి… టీఆర్‌ఎస్‌కు లాభం చేసేందుకు టీవీ9, టీ న్యూస్, నమస్తే తెలంగాణ సంస్థలు ప్రయత్నించాయన్నారు. విదేశాల్లో ఖాతాలున్నాయంటూ చేసిన కథనాలు తప్పు అని ఒప్పుకుని అదే స్థాయిలో కథనాలు ప్రసారం చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు 24 గంటల సమయం ఇస్తున్నానన్నారు. ఒకవేళ అలా చేయని పక్షంలో పరువు నష్టం దావా వేసి కోర్టుకు ఈడుస్తానన్నారు.

ఈ మూడు సంస్థలనే తాను ప్రస్తావించడానికి కారణం ఈ మూడు సంస్థలు కేసీఆర్‌ కుటుంబసభ్యులవి కావడమేనన్నారు. టీవీ9ను మైహోం రామేశ్వరరావు కొనుగోలు చేసిన తర్వాత ఇలా తనకు వ్యతిరేకంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందన్నారు. మిగిలిన మీడియా సంస్థలు కూడా తన విషయంలో జాగ్రత్తగా కథనాలు రాయలన్నారు. లేని పక్షంలో కేసులు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. టీవీ9, నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌లు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి… తనపై ప్రసారం చేసిన కథనాలు తప్పు అని అంగీకరించాలన్నారు. లేని పక్షంలో కోర్టులోనే తేల్చుకుంటామన్నారు.

కేసీఆర్‌ తీరు కల్లుతాగిన కోతికి తేలు కుడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను యముడి వద్దకు వెళ్లి అక్కడ చర్చలు జరిపి తిరిగి వెనక్కు వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో నమోదు అయిన కేసులను ఎందుకు ఎత్తివేయడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమంలో చాలా మందిపై రైల్వే శాఖ కేసులు నమోదు చేసిందన్నారు. కానీ అందరిపైనా కేసులు అలాగే ఉంటే కేవలం కేసీఆర్‌ కుటుంబానికి చెందిన పది మందిపై మాత్రమే కేసులను రైల్వే శాఖ ఎలా ఎత్తివేసిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ మీద మోడీ ప్రభుత్వానికి ప్రత్యేక ప్రేమ ఉంది కాబట్టే వారిపై కేసులను మాత్రమే ఎత్తివేశారని ఆరోపించారు. ఎన్నికలు కాంగ్రెస్‌ వర్సెస్ టీఆర్‌ఎస్ గా జరిగితే ఓటమి తప్పదని భావించే కేసీఆర్…. పదేపదే చంద్రబాబు ప్రస్తావన తెచ్చి టీఆర్‌ఎస్ వర్సెస్ టీడీపీగా ఎన్నికలు జరుగుతున్నట్టు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణతో టీడీపీకి బరాబర్‌ సంబంధం ఉందన్నారు. టీడీపీ పుట్టిందే హైదరాబాద్‌ గడ్డమీద అని రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర కార్యాలయం కూడా ఇక్కడే ఉందన్నారు. పొత్తు కోసం కాంగ్రెస్‌కు టీడీపీ 500 కోట్లు ఇచ్చిందంటున్న కేసీఆర్‌….. మరి గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్ని కోట్లు తీసుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబును ఏమో చేస్తానంటున్న కేసీఆర్‌…. ముందు తనను దాటి అమరావతికి వెళ్లాలన్నారు. ఓటుకు నోటులో ఆ పీకేది ఏందో తొలుత తనను పీకాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.

First Published:  6 Oct 2018 8:44 AM IST
Next Story