Telugu Global
NEWS

రాజ్ కోట్ టెస్టులో విరాట్ కొహ్లీ రికార్డుల మోత

కెప్టెన్ గా వరుసగా మూడేళ్లపాటు వెయ్యి పరుగుల రికార్డు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పృథ్వీ షా కెప్టెన్ గానే 30 శతకాలు బాదిన విరాట్ కొహ్లీ వెస్టిండీస్ పై టీమిండియా 19వ టెస్ట్ విజయం వెస్టిండీస్ తో  రాజ్ కోట్ వేదికగా మూడురోజుల్లోనే ముగిసిన తొలిటెస్ట్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ పలు అరుదైన రికార్డులు సాధించాడు. వరుసగా మూడేళ్లపాటు వెయ్యి పరుగులు చొప్పున సాధించిన భారత తొలి కెప్టెన్ గా నిలిచాడు. అంతేకాదు…క్యాలెండర్ […]

రాజ్ కోట్ టెస్టులో విరాట్ కొహ్లీ రికార్డుల మోత
X
  • కెప్టెన్ గా వరుసగా మూడేళ్లపాటు వెయ్యి పరుగుల రికార్డు
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పృథ్వీ షా
  • కెప్టెన్ గానే 30 శతకాలు బాదిన విరాట్ కొహ్లీ
  • వెస్టిండీస్ పై టీమిండియా 19వ టెస్ట్ విజయం

వెస్టిండీస్ తో రాజ్ కోట్ వేదికగా మూడురోజుల్లోనే ముగిసిన తొలిటెస్ట్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ పలు అరుదైన రికార్డులు సాధించాడు.

వరుసగా మూడేళ్లపాటు వెయ్యి పరుగులు చొప్పున సాధించిన భారత తొలి కెప్టెన్ గా నిలిచాడు. అంతేకాదు…క్యాలెండర్ ఇయర్ లో ఏడు సెంచరీలు చొప్పున ఐదోసారి సాధించిన మొనగాడిగా కొహ్లీ నిలిచాడు.

రాజ్ కోల్ టెస్ట్ తొలిఇన్నింగ్స్ లో139 పరుగులు సాధించిన కొహ్లీ.. తన కెరియర్ సెంచరీల సంఖ్యను 59కు పెంచుకొన్నాడు.

ఇందులో కెప్టెన్ గా సాధించిన సెంచరీలే 30 ఉండటం విశేషం. కొహ్లీ 2016 సీజన్లో 12 టెస్టులు ఆడి 4 సెంచరీలతో 1215 పరుగులు, 2017 సీజన్లో 10 టెస్టులు ఆడి 5 సెంచరీలతో 1059 పరుగులు, 2018 సీజన్లో 9 టెస్టుల్లో 4 సెంచరీలతో 1018 పరుగులు సాధించాడు.

విండీస్ పై 19వ విజయం….

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా…8వ ర్యాంకర్ వెస్టిండీస్ పై..19వ టెస్ట్ విజయం నమోదుచేసింది.రాజ్ కోట వేదికగా మూడురోజుల్లోనే ముగిసిన తొలిటెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ 272 పరుగులతో భారీవిజయం సాధించింది.

ఈ రెండు జట్లూ… 1948 నుంచే టెస్ట్ సిరీస్ ల్లో పోటీపడుతూ వస్తున్నాయి. గత ఏడుదశాబ్దాల కాలంలో విండీస్ తో టీమిండియా మొత్తం 95 టెస్టుల్లో ఢీ కొంటే… 19 విజయాలు మాత్రమే సాధించగలిగింది.

అదే కరీబియన్ టీమ్ మాత్రం 30 విజయాలతో పైచేయి సాధించింది. మరో 46 టెస్టులు డ్రాల పద్దులో చేరాయి. భారతగడ్డపై ఈ రెండుజట్ల మధ్య జరిగిన మొత్తం 46 మ్యాచ్ ల్లో టీమిండియా 12, వెస్టిండీస్ 14 విజయాలు సాధిస్తే…మరో 20 టెస్టులు డ్రాగా ముగిశాయి.

కెప్టెన్ గా కొహ్లీ 23వ గెలుపు….

టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కొహ్లీ తన విజయాల సంఖ్యను 23కు పెంచుకొన్నాడు. రాజ్ కోటలో విండీస్ తో ముగిసిన తొలిటెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ 272 పరుగుల భారీవిజయం సాధించడంతో.. కొహ్లీ అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచాడు.

కొహ్లీ ఇప్పటి వరకూ నాయకత్వం వహించిన 41 టెస్టుల్లో 23 విజయాలు, 9 పరాజయాలు, 9 డ్రాల రికార్డుతో నిలిచాడు.

రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ షో….

సౌరాష్ట్ర ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా…తన హోంగ్రౌండ్ సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన టెస్ట్ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. బ్యాటింగ్ లో 100 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచిన జడేజా… ఫీల్డింగ్ లో ఓ రనౌట్ సాధించాడు. ఇక బౌలర్ గా తొలిఇన్నింగ్స్ లో 1 వికెట్, రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్ గా 100 పరుగులు, 4 వికెట్లతో తన ఆల్ రౌండ్ ప్రతిభను చాటుకోగలిగాడు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పృథ్వీ షా….

రాజ్ కోటలోని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ముగిసిన తొలిటెస్ట్ మ్యాచ్…టీమిండియా యువ ఓపెనర్, 18 ఏళ్ల పృథ్వీ షాకు చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. అరంగేట్రం టెస్టు ఇన్నింగ్స్ లోనే 134 పరుగులు సాధించిన పృథ్వీ షా… మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం అందుకొన్నాడు.

బాల్యంలోనే తల్లి చనిపోయినా… ఆ లోటు లేకుండా తనను తీర్చిదిద్దిన తండ్రి పంకజ్ షాకు ఈ సెంచరీని అంకితమిచ్చినట్లు పృథ్వీ షా ప్రకటించాడు.

ఐదురోజుల ఈ టెస్ట్ మ్యాచ్ మూడోరోజు ఆటలోనే టీమిండియా ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ విజయం సాధించడం చూస్తే…. హైదరాబాద్ వేదికగా జరిగే టెస్టు సైతం మొదటి మూడురోజుల్లోనే ముగిసినా ఆశ్చర్యం లేదు.

First Published:  6 Oct 2018 6:18 AM GMT
Next Story