Telugu Global
Others

కెసిఆర్‌ తీవ్ర స్వరం వెనుక...?

(ఎస్. విశ్వేశ్వర రావు) ఎన్నికల ప్రచారంలో నాయకుల మధ్య మాటల తూటాలు సహజం. అవినీతి, వ్యక్తిగత ఆరోపణలు సహజం. కానీ తెలంగాణలో ప్రస్తుతం ప్రచారంలో వ్యక్తిగత దూషణలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రతిపక్షాల సంగతి అలా ఉంచితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఊహించని స్థాయిలో మాట్లాడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన వాక్చాతుర్యంతో తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపించి రాష్ట్రాన్ని సాధించుకున్న నాయకునిగా ఘనతకెక్కిన కెసిఆర్‌, ఈసారి తీవ్రస్థాయిలోనే దూషణలకు దిగుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌-తెలుగుదేశం పార్టీల మధ్య ఎన్నికల ఒప్పందం అంశం […]

కెసిఆర్‌ తీవ్ర స్వరం వెనుక...?
X

(ఎస్. విశ్వేశ్వర రావు)

ఎన్నికల ప్రచారంలో నాయకుల మధ్య మాటల తూటాలు సహజం. అవినీతి, వ్యక్తిగత ఆరోపణలు సహజం. కానీ తెలంగాణలో ప్రస్తుతం ప్రచారంలో వ్యక్తిగత దూషణలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రతిపక్షాల సంగతి అలా ఉంచితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఊహించని స్థాయిలో మాట్లాడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన వాక్చాతుర్యంతో తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపించి రాష్ట్రాన్ని సాధించుకున్న నాయకునిగా ఘనతకెక్కిన కెసిఆర్‌, ఈసారి తీవ్రస్థాయిలోనే దూషణలకు దిగుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌-తెలుగుదేశం పార్టీల మధ్య ఎన్నికల ఒప్పందం అంశం పై ఆయన అటు కాంగ్రెస్‌ ఇటు తెలుగుదేశం నాయకులను తీవ్రంగానే దూషిస్తున్నారు.

ఎందుకు కెసిఆర్‌ ఈసారి స్వరం పెంచి తీవ్ర దూషణలతో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు? కొంగర్‌కలాన్‌ సభ పేలవంగా ముగిసిందనే అభిప్రాయం నెలకొనగా ఆ తర్వాత నిర్వహించిన హుస్నాబాద్‌, నిజామాబాద్‌, నల్గొండ, వనపర్తి సభల్లో ఆయన ఆవేశంతో ఊగిపోయారు.

తెలంగాణ సెంటిమెంట్‌ను తిరిగి రగిలించాలనేది కెసిఆర్‌ లక్ష్యమా? లేక చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో జోక్యం చేసుకోకుండా అడ్డుకట్ట వేసే వ్యూహమా? తెలంగాణకు కాంగ్రెస్‌, టిడిపి వ్యతిరేకమైన పార్టీలనే అభిప్రాయం కలిగించాలనేది ఉద్దేశమా? లేక తెలంగాణలో టిడిపి ఓటు బ్యాంకు ఇంకా బలంగానే ఉందని కెసిఆర్‌ భావిస్తున్నారా?

ఆ ఓటు బ్యాంకు పొత్తులో భాగంగా కాంగ్రెస్‌వైపు వెళుతుందని ఆందోళన చెందుతున్నారా? ఇందులో భాగంగానే చంద్రబాబును తెలంగాణకు వ్యతిరేకమైన శక్తిగా ముద్రవేసే ప్రయత్నమా? రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల పరిపాలన ఇటు హైదరాబాద్‌, అటు విజయవాడ నుంచి సాగుతుండగా అనేక అంశాల్లో ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల పంపకాలు, టెంత్‌ షెడ్యూల్‌లోని అంశాలు, పోలవరం ప్రాజెక్ట్‌ మొదలైనవి వివాదాస్పందంగానే ఉన్నాయి.

అయితే నాలుగున్నరేళ్ళు కావస్తుండడంతో తెలంగాణ స్వతంత్ర పరిపాలన సాగుతున్నందున గతంలోలాగా ఆంధ్రకు వ్యతిరేకంగా సెంటిమెంట్‌ ప్రజల్లో కనిపించడం లేదు. 2014కు ముందు తీవ్రంగా ఉన్న ఈ సెంటిమెంట్‌ టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలో ఆ అంశం కనుమరుగైపోయింది. కానీ ఇప్పుడు తాజాగా ఆ అంశం ఆధారంగానే ఎన్నికలకు వెళ్లాలని కెసిఆర్‌ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

అందులో భాగంగానే వ్యక్తిగత దూషణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే కాంగ్రెస్‌ నేతలు ముఖ్యంగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు (తెలుగుదేశం) పై దూషణల పర్వం కొనసాగింది. కాంగ్రెస్‌ నాయకులు కూడా అదే స్థాయిలో ఆయనపై దూషణలకు దిగుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ముందస్తు ఎన్నికల కోసం శాసనసభను రద్దుచేసిన ముఖ్యమంత్రి ఏడాది చివర్లోగా జరుగుతాయని భావిస్తున్న ఎన్నికల్లో పరిస్థితి టీఆర్‌ఎస్‌కు అంతపూర్తిగా అనుకూలంగా లేదని భావిస్తున్నారా?

పార్టీ అభ్యర్థులను ఆయన అప్పుడే ప్రకటించేశారు. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులు ముఖ్యంగా రద్దయిన శాసనసభలో ప్రాతినిథ్యం వహించిన వారు తీవ్ర వ్యతిరేకత చవిచూస్తున్నారని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో పలు నియోజకవర్గాల్లో పార్టీలో అభ్యర్థుల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇవన్నీ కూడా టీఆర్‌ఎస్‌ నాయకత్వానికి చికాకు పుట్టించే అంశాలే. ఈ ప్రభావం కెసిఆర్‌ ఎన్నికల ప్రచారంపై పడిందా?

అందులో భాగంగానే ఆయన తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ రగిలించేందుకు ప్రయత్నిస్తున్నారా? తెలంగాణకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌- తెలుగుదేశం పార్టీలు ఒక్కటయ్యాయన్న అభిప్రాయం ప్రజల్లో కలిగించడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు ఉపన్యాసాలను బట్టి పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్‌, తెలుగుదేశం కూటమి గెలిస్తే అటు ఢిల్లీకి ఇటు అమరావతికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారని నేరుగానే బాణం సంధిస్తున్నారు. ఈ అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రం చేయడం ద్వారా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్‌, తెలుగుదేశం వ్యతిరేకమనే అభిప్రాయం ప్రజల్లో తీసుకురావాలనేది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో (మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి) తెరాస అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్‌, సీపీఐ, బీఎస్పీ పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవటం ద్వారా సభలో బలాన్ని 90 దాకా పెంచుకున్నారు.

త్వరలో జరగబోయే ఎన్నికల్లో తిరిగి అదే సంఖ్యాబలం సాధించాలనేది కెసిఆర్‌ లక్ష్యం. అయితే అది అంత సులభం కాదనే అంచనాలతో పాటు నియోజకవర్గాల్లో, పార్టీలో అంతర్గతంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అందువల్లనే బంగారు తెలంగాణ, తెలంగాణ అభివృద్ధి అంశాలు పూర్తిగా పక్కకుపోయి రాజకీయ పరమైన దూషణలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌- టిడిపి అధికారంలోకి వస్తే పరిపాలన అంతా అమరావతి చుట్టూ సాగుతుందని ఆరోపిస్తూ చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో ప్రమేయం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రమేయాన్ని అందరూ గుర్తించినప్పటికీ ప్రభుత్వమే ఆ కేసును మూలన పెట్టి బాబుపై దర్యాప్తు ముందుకు సాగకుండా నిలిచిపోవటానికి కారణం ఎవరు? ఇప్పుడు ఆ అంశాన్ని కెసిఆర్‌ లేవనెత్తడంలో ఆంతర్యం ఏమిటి? దాదాపు రెండేళ్ళపాటు ఎటువంటి దర్యాప్తు సాగకుండా ఆ కేసులో నిందితులైనవారు సునాయాసంగా తప్పించుకునేందుకు అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వమే.

ఇప్పుడు ఆ అంశాన్ని మళ్లీ లేవనెత్తడం అంటే తెలుగుదేశం అధినాయకత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనకుండా అడ్డుకట్ట వేసేందుకా? పరోక్షంగా బ్లాక్‌మెయిలింగ్‌ తరహా ఒత్తిడి కనిపిస్తోందని అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మరోవైపు తెలుగుదేశంతో కాంగ్రెస్‌ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్న ఆయన 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డికి (అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి) వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమిలో తెలుగుదేశంతో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ఒప్పందం కుదుర్చుకుని కలిసిపోటీ చేసింది. ఇప్పుడు ఆ విషయాన్ని మరిచిపోయినట్లు కాంగ్రెస్‌-తెలుగుదేశం ఐక్యతను విమర్శిస్తున్నారంటే కేవలం తెలంగాణ అంశం ముందుకు తెచ్చి ఆ రెండు పార్టీలు తెలంగాణకు వ్యతిరేకమనే అభిప్రాయం ప్రజల్లోకి బలంగా తీసుకుపోవటమే ఆయన లక్ష్యమా?

First Published:  6 Oct 2018 1:45 AM GMT
Next Story