Telugu Global
NEWS

ఉచిత విద్యుత్‌పై ఉపరాష్ట్రపతి ఉక్రోశమేల?

దేశంలో కార్పొరేట్ పెద్దలు లక్షల కోట్లు బ్యాంకులకు ఎగవేసి దేశ ఆర్ధిక వ్యవస్థను ఒకవైపు నాశనం చేస్తున్నారు. అలాంటి వారికే తిరిగి కేంద్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. మరోవైపు దేశానికి అన్నం పెట్టే రైతుకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. రుణమాఫీ అడిగినా ప్రభుత్వాల చేతిలో మోసమేగాని లాభం లేకుండా పోయింది. ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు తొలుత వైఎస్ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించడం ప్రారంభించి రైతులకు ఊరట కలిగించే ప్రయత్నం చేశారు. ఆ […]

ఉచిత విద్యుత్‌పై ఉపరాష్ట్రపతి ఉక్రోశమేల?
X

దేశంలో కార్పొరేట్ పెద్దలు లక్షల కోట్లు బ్యాంకులకు ఎగవేసి దేశ ఆర్ధిక వ్యవస్థను ఒకవైపు నాశనం చేస్తున్నారు. అలాంటి వారికే తిరిగి కేంద్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. మరోవైపు దేశానికి అన్నం పెట్టే రైతుకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు.

రుణమాఫీ అడిగినా ప్రభుత్వాల చేతిలో మోసమేగాని లాభం లేకుండా పోయింది. ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు తొలుత వైఎస్ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించడం ప్రారంభించి రైతులకు ఊరట కలిగించే ప్రయత్నం చేశారు. ఆ పథకానికి రైతుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు రావడంతో…. ఒకప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలారేసుకోవాలని చెప్పిన చంద్రబాబు కూడా ఇప్పుడు ఉచిత విద్యుత్‌ను కొనసాగించి తీరాల్సిన పరిస్థితి వచ్చింది.

వైఎస్ పెట్టిన ఉచిత విద్యుత్ పథకం అనేక రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా స్పూర్తి నింపింది. అయితే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాత్రం ఉచిత విద్యుత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన ఉప రాష్ట్రపతి ఉచిత విద్యుత్‌పై ఆక్రోశం వెళ్ళగక్కారు. ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే అధికారంలోకి రాలేమన్నది కేవలం అపోహ మాత్రమేనని వ్యాఖ్యానించారు.

నాణ్యమైన విద్యుత్‌పై దృష్టి పెట్టాలే గానీ ఉచిత విద్యుత్‌ ఇవ్వడం సరికాదన్నారు. తక్కువ ధరకైనా నాణ్యమైన విద్యుత్‌ను ఇవ్వాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి మీద కాకుండా ఉచిత విద్యుత్‌పై దృష్టి పెడుతున్నాయని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఉచిత విద్యుత్‌ ఇవ్వకపోతే ఓడిపోతామన్న భావన ఒక అపోహ మాత్రమేనని ఉప రాష్ట్రపతి వ్యాఖ్యానించడం ద్వారా రైతులకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని ఎత్తివేసినా గెలుపుకు డోకా ఉండదన్న సందేశం పంపే ప్రయత్నం చేశారు.

దేశంలో బక్క చిక్కిన రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌పైనా ఏకంగా ఉప రాష్ట్రపతే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇక రైతుకు దిక్కెవరు?. రైతు బిడ్డనని చెప్పుకునే వెంకయ్య నాయుడు రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచిత్రం. ఉచితం కంటే నాణ్యత ముఖ్యమంటున్న వెంకయ్యనాయుడు… నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాలకు సూచించి ఉంటే బాగుండేదేమో.

First Published:  4 Oct 2018 3:11 AM IST
Next Story