ఫిట్‌నెస్...అదే లైఫ్‌కి ప్లస్!
అందం, ఆరోగ్యం, ఫిట్‌నెస్, ఆత్మ విశ్వాసం…ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నపదాలు. ఒకదానికోసం కృషి చేస్తే మరొకటి దొరుకుతుంది. అలాగే ఒకటి చేజారితే మరొకటి వెళ్లిపోతుంది. ఆడవాళ్లకు ఈ విషయం మరింత బాగా తెలుసు. నలుగురిలోకి వెళ్లి పనిచేయాల్సిన అవసరం ఉన్నపుడు నలుగురూ మెచ్చేలా కనిపించడం కూడా అంతే అవసరంగా మారిపోతుంది. మహిళలు ఫిట్‌నెస్ పట్ల ఆసక్తిని పెంచుకోవడానికి ఇదొక కారణమైతే, శరీరం బరువు పెరుగుతూ మీ పనులకు నేను సహకరించను అని మొరాయించడం మరొక కారణం. జీవనశైలి మన రూపం, ఆరోగ్యం మీద చూపుతున్నమార్పులు అన్నీ […]
అందం, ఆరోగ్యం, ఫిట్‌నెస్, ఆత్మ విశ్వాసం…ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నపదాలు. ఒకదానికోసం కృషి చేస్తే మరొకటి దొరుకుతుంది. అలాగే ఒకటి చేజారితే మరొకటి వెళ్లిపోతుంది. ఆడవాళ్లకు ఈ విషయం మరింత బాగా తెలుసు. నలుగురిలోకి వెళ్లి పనిచేయాల్సిన అవసరం ఉన్నపుడు నలుగురూ మెచ్చేలా కనిపించడం కూడా అంతే అవసరంగా మారిపోతుంది. మహిళలు ఫిట్‌నెస్ పట్ల ఆసక్తిని పెంచుకోవడానికి ఇదొక కారణమైతే, శరీరం బరువు పెరుగుతూ మీ పనులకు నేను సహకరించను అని మొరాయించడం మరొక కారణం. జీవనశైలి మన రూపం, ఆరోగ్యం మీద చూపుతున్నమార్పులు అన్నీ ఇన్నీ కాదు. సన్నజాజి తీగ అనిపించుకున్న శరీరం, గుండ్రని సిలిండర్‌లా మారిపోతుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అలాంటి వారికి కొండంత అండగా నిలుస్తున్నారు జయా మహేష్.
స్ర్టెచ్ జయగా పేరు సంపాదించుకున్న ఈ ఫిట్‌నెస్ ట్రైనర్ తన వద్దకు వచ్చే మహిళలకు తిరిగి వారి పాత రూపాన్ని ఇస్తానంటున్నారు. ముఖ్యంగా శరీర ఆకృతి, తీరుని సవరించడంపై దృష్టి పెడుతున్నారు. బరువు పెరుగుతున్నపుడు శరీరం ఆభారాన్నిమోయడానికి ముందుకు వంగడం, భుజాలు కుదించడం లాంటి మార్పులు చేసుకుంటుంది. అక్కడితో మన పాత రూపు పూర్తిగా మాయమైపోతుంది. ముఖ్యంగా ఫ్లెక్సిబిలిటీ పోతుంది. శరీరం ఎటూ వంగలేదు. ఇలాంటి మహిళలు ఎంతోమంది ఇప్పుడు జయ అభిమానులుగా మారిపోయారు. డాక్టర్లు, లాయర్లు ఇంకా అనేక వృత్తులలో ఉన్నవారినుండి బాలివుడ్ తారల వరకు జయ క్లయింట్లలో ఉన్నారు. ఒకప్పుడు వంద కిలోల బరువుతో తనకు తానే భారంగా ఫీలయిన జయ, ప్రపంచాన్ని తిడుతూ కూర్చోవాలా లేక స్వశక్తితో తనని తాను మార్చుకోవాలా…అనే ప్రశ్నలు వేసుకున్నారు. అంతే ఏరోబిక్స్, పిలేట్స్, యోగా.లతో శ్రమించారు. తనని తాను ఫిట్‌గా మలచుకున్నాక తనలా బాదపడుతున్న వారిపట్ల దృష్టి పెట్టారు. తనకు తానుగా కొన్ని వ్యాయామ ప్రక్రియలను రూపొందించుకుని 20 సంవత్సరాలుగా మహిళల రూపురేఖలను అందంగా మార్చేస్తున్నారు. నడుంనొప్పులు, మోకాళ్లనొప్పులు, మధుమేహం లాంటి సమస్యలకు పరిష్కారాలు చూపుతున్నారు.
మహిళలు 40,50,60,70 ఇలా అన్ని వయసుల్లోనూ ఆరోగ్య స్పృహతో స్పందించడం ఎంతో ఆనందాన్నిచ్చే విషయంగా జయ చెబుతున్నారు. వారికి కొత్త రూపాన్ని ఇవ్వడమే కాకుండా వారి సెల్ఫ్ ఇమేజ్‌ని సవరిస్తున్నానంటున్నారు. కొయింబత్తూర్ చెన్నై పాండిచ్చేరిల్లో రెగ్యులర్ ఫిట్‌నెస్ క్లాసులు నిర్వహిస్తున్నారామె. తన క్లయింట్లలో అన్ని వర్గాల వారు ఉన్నాఒక మధ్యతరగతి హోం మేకర్, కొత్తగా తల్లయిన అమ్మాయి, ఒక రిటైర్ అయిన ప్రిన్సిపాల్, వధువు కాబోయే అమ్మాయి, అమ్మమ్మ కాబోతున్న నడివయసు మహిళ ఇలా తన చుట్టూ కనిపించే సాధారణ మహిళలు తన వలన ప్రయోజనం పొందినపుడు మరింత ఆనందంగా ఉంటుందంటున్నారు ఆమె. వారు తమ డబల్ ఎక్సెల్ కుర్తాల సైజుని వదిలించుకుని తేలిగ్గా నడుస్తుంటే ఎంతో సంతోషంగా ఫీలవుతుంటానని చెబుతున్నారు. వ్యాయామాన్ని ఏ వయసులో అయినా మొదలుపెట్టవచ్చని, శరీర పోస్చర్ కాస్త సవరించేకుంటేనే ఎంతో మంచి ఫీల్ కలుగుతుందని జయ అంటున్నారు. జీరో సైజ్ కాదు, ఫిట్ గా ఉండటం ముఖ్యమంటున్నారామె..