నక్షత్రకుడు (For Children)
“నక్షత్రకుడిలా తయారయ్యాడు” – అని, “నక్షత్రకుడిలా వదలడంలేదు” – అని అంటూ వుండడం విన్నారు కదా? నక్షత్రకుడు ఎవరు? విశ్వామిత్రుని శిష్యుడు. బ్రాహ్మణుడు. అంతకు మించి హరిశ్చంద్రుని వెంట పడ్డవాడు. విశ్వామిత్రునికి హరిశ్చంద్రుడు ఇవ్వవలసిన డబ్బును పుచ్చుకోవడానికి నీడలా వెంట వచ్చినవాడు. నిముషం విడవని వాడు. రాజ్యం వదలి కన్నబిడ్డ, కట్టుకున్న భార్యతో వీధులపాలయిన హరిశ్చంద్రుడిని అడుగడుగునా అప్పువసూలుకోసం అంటుకు తిరిగాడు. ఉన్న సమస్యలకు తోడు తానే ఓ సమస్యగా మారినవాడు. హరిశ్చంద్రుని మార్చాలని అనుకున్నవాడు. అసత్యం […]
“నక్షత్రకుడిలా తయారయ్యాడు” – అని, “నక్షత్రకుడిలా వదలడంలేదు” – అని అంటూ వుండడం విన్నారు కదా?
నక్షత్రకుడు ఎవరు?
విశ్వామిత్రుని శిష్యుడు. బ్రాహ్మణుడు. అంతకు మించి హరిశ్చంద్రుని వెంట పడ్డవాడు. విశ్వామిత్రునికి హరిశ్చంద్రుడు ఇవ్వవలసిన డబ్బును పుచ్చుకోవడానికి నీడలా వెంట వచ్చినవాడు. నిముషం విడవని వాడు. రాజ్యం వదలి కన్నబిడ్డ, కట్టుకున్న భార్యతో వీధులపాలయిన హరిశ్చంద్రుడిని అడుగడుగునా అప్పువసూలుకోసం అంటుకు తిరిగాడు. ఉన్న సమస్యలకు తోడు తానే ఓ సమస్యగా మారినవాడు. హరిశ్చంద్రుని మార్చాలని అనుకున్నవాడు. అసత్యం పలికించాలన్నదే అతని ధ్యేయం!
హరిశ్చంద్రుడు రాజయినా భార్యా బిడ్డలతో అడవుల్లో నడుస్తూవుంటే – తాను నడవలేనని కూర్చొనేవాడు. పోనీగదా అని కూర్చుంటే నిల్చొనేవాడు. ఇలా అయితే ఇవ్వవలసిన డబ్బు యెప్పుడు ఇస్తావని మనశ్శాంతిని పోగొట్టేవాడు. చివరకు నడవలేని చిన్నవాడయిన కొడుకు లోహితాస్యుని ఎత్తుకుంటే – నేనూ నడవలేక పోతున్నాను హరిశ్చంద్రా… నన్నెత్తుకో అనేవాడు. ఆగి అలసట తీర్చుకోబోతే నా సమయాన్ని వృధా చేస్తున్నావని నిష్ఠురపడేవాడు. అడవిలో నీళ్ళు దొరకని చోటు చూసి నీళ్ళుకావాలనేవాడు. దాహం దాహం అని అరిచేవాడు. కష్టాలలోవున్న హరిశ్చంద్రుని ఇంకా కష్టాల్లోకి నెట్టేవాడు. మళ్ళీ హరిశ్చంద్రుడూ అతని భార్యా బిడ్డలు పడ్డకష్టాల్ని చూసి జాలిపడేవాడు. నోటి మాటకు విలువేముంది? అసత్యం ఆడితే పోయేదేముంది?, కష్టాలు తప్ప! అని అసత్యం పలికించడానికి అదును చూసి మాట్లాడేవాడు.
భార్య చంద్రమతిని అమ్మితే కొంత డబ్బువస్తుంది అని హరిశ్చంద్రునికి సలహా ఇవ్వడమే కాదు కాశీనగర వీధుల్లో ఆపని జరిగేలా చేసాడు. భార్యని అమ్మడం బాగా లేదన్నాడు. అసత్యం ఆడితే ఈ బాధలే ఉండవు గదా అని నిట్టూర్చాడు. మొత్తానికి కౌశికుడనే బ్రాహ్మణునికి బేరం పెట్టి చంద్రమతిని అమ్మిన డబ్బు తీసుకున్నాడు. ఇంకా ఇవ్వవలసింది మిగిలే ఉందన్నాడు. హరిశ్చంద్రుడు “ఇంక నేనే మిగిలాను, నన్ను అమ్మి వచ్చిన డబ్బును తీసుకుపో” అనడంతో – అదీ నిజమేనని హరిశ్చంద్రుణ్ణి వీరబాహువనే మాలవానికి అమ్మేసాడు. ఆ డబ్బును జమ చేసుకున్నాడు.
అలా ఆఖరు నిముషం వరకు హరిశ్చంద్రునితో అసత్యం పలికించడానికి ప్రయత్నించి ఓడిపోయిన వాడు నక్షత్రకుడు!.
– బమ్మిడి జగదీశ్వరరావు