జాంబవతి
జాంబవంతుడు తెలుసు కదా? బ్రహ్మ ఆవులించగా పుట్టి భల్లూక (ఎలుగు బంటి) రాజు అయ్యాడు. అలాంటి బుద్ధిమంతుని, బలవంతుని కూతురే జాంబవతి! జాంబవతి శ్రీకృష్ణుని ఎనిమిది మంది భార్యలలో ఒకతి! జాంబవంతుడు తన కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. సింహం దగ్గర సూర్యకాంతితో పోటీపడేలా ప్రకాశిస్తున్న శమంతకమణిని చూసాడు. దానికోసం సింహంతో యుద్ధం చేసాడు. చంపేసాడు. ఆ అపురూపమైన మణిని తాను ధరించలేదు. తన కూతురు జాంబవతి మెడలో వేసాడు! శమంతకమణిని ధరించిన జాంబవతి ఆడుకుంది. మణి […]
జాంబవంతుడు తెలుసు కదా? బ్రహ్మ ఆవులించగా పుట్టి భల్లూక (ఎలుగు బంటి) రాజు అయ్యాడు. అలాంటి బుద్ధిమంతుని, బలవంతుని కూతురే జాంబవతి!
జాంబవతి శ్రీకృష్ణుని ఎనిమిది మంది భార్యలలో ఒకతి!
జాంబవంతుడు తన కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. సింహం దగ్గర సూర్యకాంతితో పోటీపడేలా ప్రకాశిస్తున్న శమంతకమణిని చూసాడు. దానికోసం సింహంతో యుద్ధం చేసాడు. చంపేసాడు. ఆ అపురూపమైన మణిని తాను ధరించలేదు. తన కూతురు జాంబవతి మెడలో వేసాడు! శమంతకమణిని ధరించిన జాంబవతి ఆడుకుంది. మణి ధరించి మణిలానే మెరిసింది.
అపవాదుపడి శమంతకమణిని వెదుకుతూ జాంబవంతుని గుహదాక అడుగుల గురుతులు పట్టి వచ్చాడు కృష్ణుడు. తొట్టెకు వేళ్ళాడుతూ ఇల్లంతా వెలుగు నింపిన శమంతకమణిని తీసుకొని పోబోయాడు. చెలికత్తెలతో అది చూసి జాంబవతి కేకలు పెట్టింది. జాంబవంతుడు వచ్చాడు. శ్రీకృష్ణుడుకీ జాంబవంతునికి ఇరవైయ్యొక్కరోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. వచ్చిన కృష్ణుడు శ్రీహరి రూపమని గ్రహించాడు. శమంతక మణితో పాటు మరోమణి అయిన జాంబవతిని ఇచ్చిపంపాడు.
జాంబవతి సమేతంగా కృష్ణుడు ద్వారకకు వచ్చాడు. సత్రాజిత్తుకు ఆమణిని ఇచ్చి అపవాదును తుడుచుకున్నాడు. ఆ తర్వాత జాంబవతిని పెళ్ళి చేసుకున్నాడు. జాంబవతిని పెళ్ళాడాకనే సత్రాజిత్తు కూతురు సత్యభామనూ పెళ్ళి చేసుకున్నాడు. అలా జాంబవతి శ్రీకృష్ణుని భార్యగా సంతోషంగానే గడిపింది. ఒక కొడుకుని కూడా కన్నది. సాంబుడని పేరు పెట్టింది.
జాంబవతికి భర్త వల్ల ఎలాంటి కష్టాలూ లేవు. కష్టాలన్నీ కొడుకు రూపంలో వచ్చాయి. అల్లారు ముద్దుగా పెంచిన ఆ తల్లి అణకువని ఆశించింది. కాని సాంబుడు పెరిగి పెద్దవుతున్నా పెద్దంతరం చిన్నంతరం తెలుసుకోలేకపోయాడు. నారదునికి నమస్కరించలేదు – పిల్లలందరూ నమస్కరించినా సరే. కోపం వచ్చిన నారదుడు మనసులో పెట్టుకున్నాడు. అంతఃపురకాంతలతో ఉన్న కృష్ణుడు దగ్గరకు వెళ్ళి తానొచ్చిన విషయం చెప్పమన్నాడు నారదుడు. శయన మందిరంలోకి సాంబుడు వెళ్ళడంతో కోపంతో శ్రీకృష్ణుడు కొడుకుని చూడక శాపమిచ్చాడు. కుష్ఠురోగివి కమ్మన్నాడు. శాపానికి విరుగుడు వున్నా తల్లిగా జాంబవతికి శరాఘాతమే! అంతేకాదు, దుర్యోధనుని కూతురు లక్ష్మణని సాంబుడు ప్రేమించి – బందీ అయినపుడూ, అలాగే ఆడవేషం వేసి లేని గర్భం ధరించిన సాంబుడు కణ్వాదుల దగ్గరకు వెళ్ళి తనకు పుట్టే బిడ్డ ఆడబిడ్డా మగబిడ్డా అని అడిగి – వారి కోపకారణంగా శాపకారణంగా యదువంశాన్ని నాశనం చేసే ముసలం పుడుతుందనే ఋషి వాక్కులకు వ్యాకులపడింది జాంబవతి.
కృష్ణునికి సతి అయినందుకు ఒకవేపు సంతోషమూ – కొడుకు సాంబుడి వల్ల వంశం నాశనం కాబోతోందన్న దుఃఖమూ – జాంబవతి అనుభవించింది. కష్టమూ సుఖమూ రెండూ జీవితంలో ఉంటాయని జాంబవతి కథ మనకు చెపుతుంది!.
– బమ్మిడి జగదీశ్వరరావు