100 లోక్‌సభ స్థానాల్లో బరిలో దిగనున్న ఆప్
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 100 స్థానాల్లో బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. పోటీ చేస్తున్న వంద స్థానాల్లో ఎక్కువ సీట్లు ఖచ్చితంగా గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. కేంద్రంలో బిజెపి యేతర ప్రభుత్వం ఏర్పడినట్లయితే… కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో ముఖ్యపాత్ర పోషించవచ్చని ఆప్ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి బలం ఉండడంతో ఆ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు గెలుపొందేందుకు తీవ్రంగా కృషి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ […]
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 100 స్థానాల్లో బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. పోటీ చేస్తున్న వంద స్థానాల్లో ఎక్కువ సీట్లు ఖచ్చితంగా గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. కేంద్రంలో బిజెపి యేతర ప్రభుత్వం ఏర్పడినట్లయితే… కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో ముఖ్యపాత్ర పోషించవచ్చని ఆప్ నేతలు భావిస్తున్నారు.
ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి బలం ఉండడంతో ఆ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు గెలుపొందేందుకు తీవ్రంగా కృషి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా పోటీ చేసేందుకు సిద్ధమౌతోంది. బీహార్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా పరిమిత సీట్లలో పోటీకి దిగనుంది. అదే విధంగా తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమౌతున్న ఆప్…. లోక్‌సభ స్థానాల్లో పోటీకి దిగనుందో లేదో స్పష్టం చేయలేదు.
ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి లోక్‌సభలో 4 స్థానాలున్నాయి. ఇవన్నీ పంజాబ్ రాష్ట్రం నుంచి గెలిచినవే కావడం విశేషం. పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ స్థానాలున్నాయి. ఈసారి ఎన్నికల్లో 13 స్థానాల్లోనూ గెలవాలని అధినేత కేజ్రీవాల్ పార్టీ నేతలకు టార్గెట్ విధించినట్లు తెలుస్తోంది.
అదే విధంగా హర్యానాలోను బిజెపికి, కాంగ్రెస్‌కి గట్టి పోటీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. హర్యానా పార్టీ చీఫ్ నవీన్ జైహింద్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ చాలా నియోజకవర్గాల్లో బలపడింది. జాతీయ స్థాయిలో బిజెపి చేసిన తప్పిదాలను ఎండగట్టడం ద్వారా స్థానికంగా లబ్ధి పొందవచ్చనేది ఆప్ ఎన్నికల ప్రణాళికలా కనిపిస్తోంది.
2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లు గాను 67 సీట్లు గెలుచుకుని రికార్డు స్థాయిలో విజయం సొంతం చేసుకుంది.