Telugu Global
Family

వ్యసనం

        ఆ ఊళ్ళో ఆ శ్రేష్ఠి గొప్ప పేరువున్నవాడు. వ్యాపారం చేసుకుంటూ వీలయినన్ని మంచిపనులు చేస్తూ ఆ కుటుంబం మంచి పేరు తెచ్చుకుంది. తరతరాలుగా ఆ కుటుంబం దైవభక్తిపరులు. ధర్మబద్ధంగా జీవించేవాళ్ళు. తరతరాలుగా వారి వంశంలో ఎవరికీ ఎలాంటి దుర్వ్యసనాలు లేవు.             అటువంటి కుటుంబంలో పరిస్థితులు మారాయి. ఆ వ్యాపారి కొడుకుకు స్నేహంవల్లో, ఇతర కారణాలవల్లో దురలవాట్లు అలవడ్డాయి. మద్యపానం, జూదం, ధూమపానం అలవాటయ్యాయి. వీటిని ఏదో విధంగా ఎవరికీ తెలియకుండా నడిపించవచ్చు. కానీ వ్యభిచారాన్ని […]

ఆ ఊళ్ళో ఆ శ్రేష్ఠి గొప్ప పేరువున్నవాడు. వ్యాపారం చేసుకుంటూ వీలయినన్ని మంచిపనులు చేస్తూ ఆ కుటుంబం మంచి పేరు తెచ్చుకుంది. తరతరాలుగా ఆ కుటుంబం దైవభక్తిపరులు. ధర్మబద్ధంగా జీవించేవాళ్ళు. తరతరాలుగా వారి వంశంలో ఎవరికీ ఎలాంటి దుర్వ్యసనాలు లేవు.

అటువంటి కుటుంబంలో పరిస్థితులు మారాయి. ఆ వ్యాపారి కొడుకుకు స్నేహంవల్లో, ఇతర కారణాలవల్లో దురలవాట్లు అలవడ్డాయి. మద్యపానం, జూదం, ధూమపానం అలవాటయ్యాయి. వీటిని ఏదో విధంగా ఎవరికీ తెలియకుండా నడిపించవచ్చు. కానీ వ్యభిచారాన్ని ఇతరుల కన్నుగప్పి చెయ్యడం అసంభవం. రహస్యంగా ఎవరికంటా కనబడకుండా ఆపని చేసినా జనం దాన్ని పసికడతారు.

వ్యాపారి కొడుక్కి వ్యభిచార వ్యసనం అంటుకుంది. అతను రహస్యంగా రాత్రి పూట వ్యభిచార గృహానికి వెళ్ళేవాడు. ఆ కుటుంబ శ్రేయోభిలాషి ఒకరు అతను వ్యభిచార గృహానికి వెళ్ళడం చూశాడు. అంత ఉత్తమ కుటుంబం అప్రతిష్ఠపాలవుతుందని వ్యాపారిని కలిసి అతని కొడుకు చేస్తున్న పని గురించి వివరించి కట్టడి చేయమని చెప్పాడు. అతని మాటలు విని వ్యాపారి నిశ్చేష్టుడయ్యారు. తమ వంశంలో ఇలా అనుచిత కార్యక్రమాలు చేసే వాళ్ళు ఇంతవరకూ ఎవరూ లేరు. ఏ పాపం చేశానో నా కొడుకిలా తయారయ్యడనుకున్నాడు. ఆయన కొడుకుని పిలిచి “నాయనా! మన వంశంలో ఇలా వ్యసన పరులు ఎవ్వరూ లేరు. మన కుటుంబానికి ఊళ్ళో మంచి పేరువుంది. దాన్ని చెడ గొట్టకు. నువ్వు సన్మార్గంలో ఉంటేనే అందరూ నిన్ను గౌరవిస్తారు. ఇట్లాంటి అనుచితమైన పనులు మానుకో” అన్నాడు. కొడుకు “సరే “అని అన్నాడే కానీ తన వ్యసనాన్ని మానుకో లేదు. ఇంకోరోజు తండ్రి “బాబూ! నువ్వు అక్కడికి వెళ్ళి చీకట్లో రహస్యంగా వస్తూవుంటే దొంగలో, దోపిడో గాళ్ళో నిన్ను చంపితే మన కుటుంబ పరిస్థితి ఏమిటి? నువ్వు వ్యాపారి కొడుకువని నీ దగ్గర ధనముంటుందని ఆ ఘాతుకానికి తలపడే అవకాశం వుంది దయచేసి ఈ వ్యసనం మానుకో నాయనా” అని బ్రతిమాలాడాడు.

కొడుకు సరేనని రాత్రి పూట వ్యభిచార గృహానికి వెళ్ళడంమానేసి ఉదయాన్నే అలంకరించుకుని వేశ్యా గృహానికి వెళ్ళాడు. తను వ్యామోహపడిన వేశ్య గదికి వెళ్ళాడు. ఆమె అతను అంత ఉదయాన్నే హఠాత్తుగా అక్కడ వూడిపడతాడని కలలో కూడా అనుకోలేదు.

ఆమె అప్పుడే నిద్రలేచింది. తల చెదిరిపోయివుంది. గదంతా మద్యం వాసన, ఎక్కడ చూసినా నలిగిన పూలు. నలిగిపోయిన ఆమె వస్త్రాలు. ఆమెను ఆ పరిస్థితిలో చూసి వ్యాపారి కొడుకు దిగ్భ్రమకు లోనయ్యాడు.

ఎందుకంటే రాత్రిపూట అతను వచ్చే సమయానికి అందంగా తయారయి, సుగంధ ద్రవ్యాల్ని పూసుకుని, పరిమళ భరితమయిన పూలదండలు ధరించి, ఇల్లంతా అగరు ధూపం వేసి ఆమె ఎదురు చూసేది.

కాని ఇప్పటి వాతావరణాన్ని చూసి అతనికి జీవితంమీదే విరక్తి కలిగింది. తాను గుడ్డివాడిలా ఇన్నాళ్ళు కన్నుగానక చేసిన పాపకృత్యం. అతన్ని పశ్చాత్తాపానికి లోనుచేసింది. వెంటనే వెనుదిరిగి వెళ్ళి తన తండ్రి పాదాలపై కన్నీళ్ళతో తలపెట్టి క్షమాభిక్ష కోరాడు.

– సౌభాగ్య

First Published:  20 Sept 2018 6:31 PM IST
Next Story