Telugu Global
NEWS

ఇది మోసయాజుల రిపోర్ట్

గోదావరి పుష్కరాల్లో 31 మంది చనిపోవడానికి మూడనమ్మకాలు, మీడియా ప్రచారమే కారణమంటూ జస్టిస్ సోమయాజులు ఇచ్చిన నివేదికపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ స్పందించారు. ఇది సోమయాజులు ఇచ్చిన రిపోర్టులా లేదని.. మోసయాజులు వచ్చి ఇచ్చినట్టుగా ఉందన్నారు. ఇలాంటి కమిషన్లు వేసే బదులు అసలు వేయకుండా ఉంటే జనం కూడా పట్టించుకోరన్నారు. ఇంత దారుణంగా రిపోర్ట్ ఇవ్వడం సరికాదన్నారు. చంద్రబాబు వల్లే ప్రమాదం జరిగిందని సోమయాజులు నివేదిక ఇస్తారని తాను కూడా అనుకోలేదని.. ఎందుకంటే కమిషన్ […]

ఇది మోసయాజుల రిపోర్ట్
X

గోదావరి పుష్కరాల్లో 31 మంది చనిపోవడానికి మూడనమ్మకాలు, మీడియా ప్రచారమే కారణమంటూ జస్టిస్ సోమయాజులు ఇచ్చిన నివేదికపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ స్పందించారు. ఇది సోమయాజులు ఇచ్చిన రిపోర్టులా లేదని.. మోసయాజులు వచ్చి ఇచ్చినట్టుగా ఉందన్నారు.

ఇలాంటి కమిషన్లు వేసే బదులు అసలు వేయకుండా ఉంటే జనం కూడా పట్టించుకోరన్నారు. ఇంత దారుణంగా రిపోర్ట్ ఇవ్వడం సరికాదన్నారు. చంద్రబాబు వల్లే ప్రమాదం జరిగిందని సోమయాజులు నివేదిక ఇస్తారని తాను కూడా అనుకోలేదని.. ఎందుకంటే కమిషన్ వేసిందే చంద్రబాబు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఉంటుందని తాను అనుకోలేదన్నారు.

కానీ నివేదికలో ప్రభుత్వాన్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. రాజకీయ లబ్ది కోసమే ప్రత్యర్థులు ఆరోపణలు చేశారని కమిషన్ అనడం ఏమిటన్నారు. ప్రమాదం జరిగి 31 మంది చనిపోయిన తర్వాత ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా నోరుమూసుకుని ఉంటాయా అని ఉండవల్లి నిలదీశారు. తాను స్నానం చేస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్టు తనకు సమాచారం వచ్చిందని వెంటనే కంట్రోల్ రూంకు వెళ్లి మొత్తం పరిస్థితిని అదుపులోకి తెచ్చాన‌ని స్వయంగా చంద్రబాబే గతంలో చెప్పారన్నారు.

ఇప్పుడు సోమయాజులు మాత్రం చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత ప్రమాదం జరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన ఘాట్‌ తన ఇంటికి వెనుకనే ఉంటుందన్నారు ఉండవల్లి. ప్రమాదానికి ముందు రోజు ఘాట్‌ వద్ద పెద్దగా భక్తులు లేరన్నారు. కానీ చంద్రబాబు స్నానం చేస్తున్న సమయంలో సినిమా తీయాలన్న ఉద్దేశంతో భక్తులందరినీ ఇతర ఘాట్ల నుంచి ఇటువైపు మళ్లించారని ఉండవల్లి చెప్పారు. సినిమా కోసమే చంద్రబాబు స్నానం చేసే ఘాట్‌ వైపు భక్తులను మళ్లించామని పోలీసులు కూడా చెప్పారన్నారు.

పుష్కరమే మూడనమ్మకమని నాస్తికులు చెబుతుంటారని.. ఇప్పుడు కొత్తగా కమిషన్ పుష్కరం ఒక మూడనమ్మకం అని చెప్పడం ఏమిటన్నారు. కనీసం ఇకపై పుష్కరాల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై గైడ్‌లైన్స్ ఇవ్వడంలోనూ కమిషన్ విఫలమైందన్నారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు… వారికి రాసిపెట్టి ఉంది కాబట్టి ఇక్కడకు వచ్చి చనిపోయారు అని చెప్పినట్టుగా కమిషన్ రిపోర్టు ఉందన్నారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు వెంటనే డిలేట్ అయిపోయాయి అంటే అంత కంటే దారుణం ఏముందని ప్రశ్నించారు.

సీసీ కెమెరాలు పెట్టేదే దృశ్యాలను రికార్డ్ చేయడానికి అని.. అలాంటిది తమ ఒప్పందంలో సీసీ ఫుటేజ్‌ను స్టోర్ చేయాలంటూ ఎక్కడా లేదని నిర్వాహణ సంస్థ చెప్పడాన్ని ఏమనుకోవాలని ఉండవల్లి వ్యాఖ్యానించారు. నిజానికి సోమయాజుల కమిషన్‌ గురించి అంతా మరిచిపోయారని.. కానీ త్వరలో ఎన్నికలు వచ్చి కొత్త ప్రభుత్వం వస్తే మరోలా రిపోర్టు ఉంటుందేమోనన్న ఉద్దేశంతోనే హడావుడిగా ఇప్పుడు రిపోర్టు తీసుకున్నట్టుగా ఉందన్నారు ఉండవల్లి. సోమయాజులు రిపోర్ట్‌ చాలా తప్పు అని.. ఇది సంకల్పంతో చేసిన తప్పుగా తాను భావిస్తున్నానని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

First Published:  20 Sept 2018 3:52 AM IST
Next Story