కచుడు
దేవతల గురువు బృహస్పతి కొడుకు కచుడు. కచుడుని పిలిచి రాక్షస గురువైన శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి మృతసంజీవని ఎలాగైనా సాధించుకు రమ్మన్నారు. దాంతో సురలోకం వదిలి అసురలోకం చేరాడు. మృత సంజీవని విద్య అంటే చనిపోయే వాళ్ళని తిరిగి బతికించే విద్య. అది ఒక్క శుక్రాచార్యునికే తెలుసు. అంచేత దేవతలకూ రాక్షసులకు జరుగుతున్న యుద్ధంలో ఇవాళ చనిపోయారనుకున్న వాళ్ళు రేపటికి బతికి వచ్చే వాళ్ళు. తిరిగి తిరిగి యుద్ధం చేయడంతో దేవతలకు దిక్కుతోచలేదు. శుక్రునికన్నా నువ్వు […]
దేవతల గురువు బృహస్పతి కొడుకు కచుడు. కచుడుని పిలిచి రాక్షస గురువైన శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి మృతసంజీవని ఎలాగైనా సాధించుకు రమ్మన్నారు. దాంతో సురలోకం వదిలి అసురలోకం చేరాడు.
మృత సంజీవని విద్య అంటే చనిపోయే వాళ్ళని తిరిగి బతికించే విద్య. అది ఒక్క శుక్రాచార్యునికే తెలుసు. అంచేత దేవతలకూ రాక్షసులకు జరుగుతున్న యుద్ధంలో ఇవాళ చనిపోయారనుకున్న వాళ్ళు రేపటికి బతికి వచ్చే వాళ్ళు. తిరిగి తిరిగి యుద్ధం చేయడంతో దేవతలకు దిక్కుతోచలేదు. శుక్రునికన్నా నువ్వు శక్తి హీనుడవని బృహస్పతిని నిందించారు. స్వర్గం నుంచి తరిమివేసే పరిస్థితి వచ్చింది. ఆపద సమయంలో కొడుకుని శతృ శిబిరానికి పంపి ఆ విద్యను తీసుకు రావడమే విరుగుడని భావించాడు బృహస్పతి. శుక్రుని సేవించో ఆయన కూతురు దేవయానిని ప్రేమించో కార్యం సిద్ధించుకు రమ్మన్నారు.
రాక్షస రాజ్యంలో కచుడు అడుగు పెట్టాడు. రాక్షసులు అడిగారు. బ్రాహ్మణుడనని చెప్పాడు.శుక్రాచార్యుని వద్ద శిష్యరికం చేయడానికి వచ్చినట్టు చెప్పాడు. ఇంటికి దారి చూపమన్నాడు. రాక్షసులు దారి తప్పించారు. అడవిలో తిరిగాడు. అలసిపోయాడు. చెట్టు నీడన నిద్రపోతే చెలికత్తెలతో వచ్చిన దేవయాని చూసింది. ముగ్దురాలైంది. కచుడు కళ్ళు తెరిచేసరికి చెలికత్తెలు మాయ మయ్యారు. దేవయాని మిగిలింది. శుక్రాచార్యుల ఇంటికి తోవ చూపమన్నాడు. కోరికను చెప్పాడు. దేవయాని తండ్రి వద్దకు తీసుకెళ్ళింది. చెప్పింది. కాదనలేక పోయాడు శక్రుడు. కచునిపని సులువు చేసింది దేవయాని. వలపు పెంచుకున్నది. కచుడు మాత్రం వచ్చిన లక్ష్యంమీదనే ఉన్నాడు.
రాక్షసులకి అనుమానం తీరలేదు. ఇంటిపనీ, గురుసేవలూ చేస్తున్న కచుణ్ణి కనిపెట్టారు. చుట్టుముట్టి కత్తి దూసారు. అప్పటికి కచుడు ఆవుల్ని మేపుతున్నాడు. కత్తికోకండగా కచుణ్ణి చంపి నక్కలకు తోడేళ్ళకు ఆహారంగా వేసారు. కచుడు కనపడక దేవయాని తల్లడిల్లింది. తండ్రి చెప్పినా వినలేదు. ఒత్తిడి చేసి మృతుణ్ని సజీవుడిగా చేసింది. మృత సంజీవని మంత్రం పఠించి పిలిస్తే – లేచి వచ్చాడు కచుడు. రెండోసారి కచుణ్ణి చంపి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని సముద్రంలో పడేసివచ్చారు. కచునికేదో ఆపద వచ్చిందని చెప్పి విలపించింది దేవయాని. తండ్రిని నిలదీసింది. శుక్రుడు మంత్రం చదివి కచుణ్ణి పిలవడంతో సముద్రంలోంచి నడుచుకుంటూ వచ్చేశాడు కచుడు. తమ ప్రయత్నం ఫలించని రాక్షసులు పట్టుదలగా మరో పథకం వేసారు. దేవతల గూఢాచారిగా కచుణ్ణి భావించి, చంపి కాల్చిబూడిద చేసి ఆ బూడిదను మద్యంలో కలిపి గురువుగారి చేతే తాగించారు. కచుడు కనపడక నిద్రాహారాలు మానేసింది దేవయాని. శుక్రుడు తట్టుకోలేక సరే అన్నాడు. మృత సంజీవని విద్యతో కచున్ని పిలిచాడు. కడుపులోని బూడిద ఒక్క చోటకు చేరి రూపమయింది. జీవమూ వచ్చింది. అందుకే పిలిస్తే పలికాడు. పొట్టలోనే ఉండడం గ్రహించాడు. తాను బయటకు వస్తే నేను చనిపోతానన్నాడు తండ్రి. అలాగని పొట్టలోనే ఉంటే జీర్ణమైపోతాడు. ఏం పాలుపోలేదు. కచుణ్ణి పిలవమంది దేవయాని. పిలిచే ముందు మృత సంజీవని విద్యను అతనికి నేర్పమంది. పొట్ట చీల్చుకు వచ్చినా, చనిపోయిన మిమ్మల్ని బతికిస్తాడని నమ్మకంగా చెప్పింది. కూతురు ఆలోచన నచ్చింది. చెప్పినట్టుగానే పొట్టలో ఉన్న కచునికి మృత సంజీవని విద్యను నేర్పించాడు. తర్వాత పిలిచాడు. శుక్రుని పొట్ట చీల్చుకు వచ్చాడు కచుడు. చనిపోయిన శుక్రుణ్ణి బతికించాడు.
కచునికి వచ్చిన లక్ష్యం నెరవేరింది. వెళ్ళబోతే దేవయాని పెళ్ళాడమని కోరింది. గురు పుత్రికవు, సోదరితో సమానం అన్నాడు. మూడు సార్లు నాకు ప్రాణం పోసిన శుక్రుడు తండ్రి వంటివాడయితే, నువ్వు ఏమవుతావని తిరిగి ప్రశ్నించాడు. కాదన్నాడు. “నీవు నేర్చిన విద్య నీకు పనికి రాకుండా పోవుగాక!” అని దేవయాని శపించింది. “బ్రాహ్మణ కన్యవైనా నిన్ను బ్రాహ్మణుడు పెళ్ళాడకుండుగాక!” అని ప్రతిశాపమిచ్చాడు కచుడు. దేవయానిని మించిన అందగత్తెలు కచుని కళ్ళముందు కదలాడారన్న కథలూ ఉన్నాయి. మొత్తానికి తండ్రి అభీష్టాన్ని నెరవేర్చిన కొడుకుగా కచుడు మృత సంజీవని విద్యతో తిరిగి దేవలోకం చేరాడు!
– బమ్మిడి జగదీశ్వరరావు