మెనోపాజ్ దశకు ముందు కూడా..... మహిళల్లో గుండెజబ్బులు పెరుగుతున్నాయి!
మహిళల్లో గుండెవ్యాధులు 10శాతం పెరిగాయని న్యూఢిల్లీలోని నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. 2012-16 మధ్యకాలంలో ఆసుపత్రిలో చేరిన 1,20,444మంది పేషంట్లపై అధ్యయనాన్ని నిర్వహించి ఈ విషయం కనుగొన్నట్టుగా అధ్యయన నిర్వాహకులు తెలిపారు. మహిళలు యువతీయువకులు సైతం గుండె అనారోగ్యాలకు గురవటం పెరుగుతున్నదని అనారోగ్యకరమైన ఆహారం, పొకాగు ఉత్పత్తుల వినియోగం పెరగటం, వ్యాయామం లేని జీవన శైలి, ఒత్తిడి ఇందుకు కారణమని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. మెనోపాజ్ దశ వరకు మహిళలకు గుండెవ్యాధులు రాకుండా ఈస్ట్రోజన్ హార్మోను రక్షిస్తుందని, […]
మహిళల్లో గుండెవ్యాధులు 10శాతం పెరిగాయని న్యూఢిల్లీలోని నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. 2012-16 మధ్యకాలంలో ఆసుపత్రిలో చేరిన 1,20,444మంది పేషంట్లపై అధ్యయనాన్ని నిర్వహించి ఈ విషయం కనుగొన్నట్టుగా అధ్యయన నిర్వాహకులు తెలిపారు. మహిళలు యువతీయువకులు సైతం గుండె అనారోగ్యాలకు గురవటం పెరుగుతున్నదని అనారోగ్యకరమైన ఆహారం, పొకాగు ఉత్పత్తుల వినియోగం పెరగటం, వ్యాయామం లేని జీవన శైలి, ఒత్తిడి ఇందుకు కారణమని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.
మెనోపాజ్ దశ వరకు మహిళలకు గుండెవ్యాధులు రాకుండా ఈస్ట్రోజన్ హార్మోను రక్షిస్తుందని, ఆ దశకు చేరుకోగానే 50-55 ఏళ్ల వయసులో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుందని… ఆపై మహిళల్లో కూడా మగవారిలో లాగే గుండెవ్యాధులు రావటం జరుగుతుందని…కానీ ఈ పరిస్థితి మారిపోయి మెనోపాజ్ దశకు ముందు కూడా గుండె జబ్బులకు గురవుతున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని అధ్యయనంలో తేలింది. పొగతాగటం, బరువు తగ్గేందుకు అనుసరిస్తున్న ప్రమాదకరమైన విధానాలు, అనారోగ్యకరమైన ఆహారం, అధిక ఒత్తిడి, పరీక్షలు చేయించుకోకపోవటం…ఇవన్నీ మహిళల్లో మెనోపాజ్కు ముందే గుండె వ్యాధులను పెంచుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
మహిళలకు గుండెవ్యాధులు తక్కువగా వస్తాయని అనుకోలేమని, అవగాహనా లోపం, ముందు జాగ్రత్త చర్యలు లేకపోవటం వలన వారు కూడా ఈ ప్రమాదం బారిన పడుతున్నారని నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కార్డియాలజీ సర్వీసెస్ హెడ్, వైస్-చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ వినోద్ శర్మ తెలిపారు.
ఇతరదేశాలతో పోలిస్తే గుండెపోటుకి గురయినవారు మరణించే ప్రమాదం మనదేశంలో నాలుగురెట్లు ఎక్కువగా ఉందని నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ సిఇఓ ఓపి యాదవ్ అన్నారు. పశ్చిమదేశాల్లో జీవనశైలి మార్పులతో ప్రమాదాన్ని నివారించుకుంటారని, అభివృద్ది చెందుతున్న దేశాల్లో ఇది సాధ్యం కాదని ఆయన అన్నారు. పళ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవటం, 20-30 నిముషాల వ్యాయామాన్ని కనీసం వారానికి మూడురోజులు చేయటం గుండె ఆరోగ్యానికి అత్యవసరమని వైద్యులు చెబుతున్నారు. 35ఏళ్లు దాటాక క్రమం తప్పకుండా ఆరోగ్యపరీక్షలు కూడా అవసరమని వారు సలహా ఇస్తున్నారు.