”విశ్వరూపం 2” సినిమా రివ్యూ
రివ్యూ: విశ్వరూపం 2 రేటింగ్: 1.75 /5 తారాగణం: కమల్ హాసన్, రాహుల్ బోస్, ఆండ్రియా పూజా కుమార్ తదితరులు సంగీతం: జిబ్రాన్ నిర్మాత: కమల్ హాసన్ దర్శకత్వం: కమల్ హాసన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా కెరీర్ బెస్ట్ అని కమల్ హాసన్ పదే పదే చెప్పుకుంటూ వచ్చిన విశ్వరూపం సీక్వెల్ ఈ రోజు విడుదలైంది. అంచనాలు మరీ ఆకాశాన్ని అంటకపోయినా లోక నాయకుడి మీద నమ్మకంతో ప్రేక్షకులు బాగానే ఓపెనింగ్స్ ఇచ్చారు. మొదటి […]
రివ్యూ: విశ్వరూపం 2
రేటింగ్: 1.75 /5
తారాగణం: కమల్ హాసన్, రాహుల్ బోస్, ఆండ్రియా పూజా కుమార్ తదితరులు
సంగీతం: జిబ్రాన్
నిర్మాత: కమల్ హాసన్
దర్శకత్వం: కమల్ హాసన్
తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా కెరీర్ బెస్ట్ అని కమల్ హాసన్ పదే పదే చెప్పుకుంటూ వచ్చిన విశ్వరూపం సీక్వెల్ ఈ రోజు విడుదలైంది. అంచనాలు మరీ ఆకాశాన్ని అంటకపోయినా లోక నాయకుడి మీద నమ్మకంతో ప్రేక్షకులు బాగానే ఓపెనింగ్స్ ఇచ్చారు. మొదటి భాగం తాలూకు ప్రభావం ఇంకా ఉండటంతో దాన్ని మించే స్థాయిలో ఇది ఉంటుందనే కోరుకున్నారు అభిమానులు.
ఇది విశ్వరూపం మొదటి భాగంలోనే కలిపి రావాల్సిన కథ. ఎడిటింగ్ టేబుల్ దగ్గర వదిలేసిన ఫుటేజ్ ని రెండు గంటలకు కుదించి వదిలారు తప్ప ఇందులో మరీ కథంటూ ఏమి లేదు. ఫస్ట్ పార్ట్ లో అండర్ కవర్ టెర్రరిస్ట్ గా ఉంటూ అల్ ఖైదీ స్థావరాన్ని ధ్వంసం చేసి అమెరికా సైనికుల సహాయంతో తప్పించుకున్న విసామ్ అహ్మద్ (కమల్ హాసన్) తిరిగి వచ్చాక ఇండియాతో పాటు అమెరికా, యుకెలో కొత్త పేలుళ్లకు కుట్ర జరుగుతోందని తెలుసుకుంటాడు. దాన్ని భగ్నం చేసేందుకు కొలీగ్ అస్మితా(ఆండ్రియా), భార్య నిరుపమ(పూజా కుమార్)సహాయం తీసుకుంటాడు. ఈ క్రమంలో చనిపోయాడు అనుకున్న తీవ్రవాది ఒమర్ (రాహుల్ బోస్) తిరిగి వస్తాడు. ఈ పద్మవ్యూహం నుంచి దేశాన్ని ఎలారక్షించుకుంటారు అనేదే విశ్వరూపం 2.
కమల్ హాసన్ నటుడిగా ప్రూవ్ చేసుకోవాల్సింది కొత్తగా ఏమి లేదు. పాతికేళ్ల క్రితమే ఎవరూ అందుకోలేని శిఖరాలు చేరుకున్నాడు. విశ్వరూపం కాన్సెప్ట్ పరంగా కొత్తగా అనిపిస్తుంది కాబట్టి తనలో ఉన్న యాక్టర్ మరోసారి బయటికి తీసుకొచ్చి మెప్పిస్తాడు. దీని కన్నా విశ్వరూపం 1లోనే బాగా చేసాడు కమల్ అనిపిస్తే అది మీ తప్పు కాదు.
ఆండ్రియా బాగుంది. పూజా కుమార్ ని రొమాన్స్ కోసం కమల్ బాగానే వాడుకున్నాడు. అవసరం లేకపోయినా పాట కూడా పెట్టేసాడు. రాహుల్ బోస్ విలనీ ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. మొదటి భాగంలో చాలా సెటిల్డ్ గా అనిపిస్తే ఇందులో శృతి తప్పాడు. శేఖర్ కపూర్ ది మొక్కుబడి పాత్ర. వహీదా రెహమాన్ ని వృధా చేశారు. ఇక మిగిలినవాళ్లు గురించి చెప్పడానికి ఏమి లేదు.
దర్శకుడిగా కమల్ ఫెయిల్ అయ్యాడు. చాలా ఇంటెన్సిటీ ఉన్న, ఇలాంటి టెర్రరిజం కథను నడిపించాల్సిన రీతిలో కాకుండా ఏదో వెబ్ సిరీస్ తరహాలో స్క్రీన్ ప్లే రాసుకోవడం సహనానికి పరీక్ష పెడుతుంది. ఫస్ట్ హాఫ్ కేవలం గంట మాత్రమే ఉన్నా ఏదో రెండు గంటలు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కథ పెద్దగా లేకపోవడం వల్ల సాగదీసుకుంటూ పోయారు తప్ప క్లైమాక్స్ లో విలన్ ఒమర్ తిరిగి వచ్చినందుకు చంపడం అనే పాయింట్ ని పక్కన పెడితే ఇంకేమి లేకపోవడం ఆశ్చర్యపరుస్తుంది.
ఈ రెండో భాగాన్ని అరగంటకు కుదించి మొదటి భాగంలోనే కలిపేస్తే సరిపోయేది. ఈ మాత్రం దానికి సీక్వెల్ అంటూ అనవసర హంగామా చేసారు. ఇండియాకు రా ఏజెంట్ తిరిగి వచ్చాక మళ్ళీ బాంబ్ బ్లాస్ట్ కు కుట్ర జరుగుతోంది అని తెలిసినప్పుడు కథలో అద్భుతమైన మలుపులు ఎన్నో పెట్టాలి. అలా కాకుండా ఫ్లాట్ గా రాసుకుంటూ పోయి అసలుకే మోసం తెచ్చి పెట్టారు. మధ్య మధ్యలో హీరోయిన్లతో కమల్ రొమాంటిక్ ట్రాక్ కూడా విసిగించేదే.
టేకాఫ్ తో మొదలైన నెమ్మది తనం ప్రీ క్లైమాక్స్ ముందు వరకు ఎక్కడా వేగం పుంజుకోదు. పైగా ఫ్లాష్ బ్యాక్ పేరుతో మొదటి భాగం సీన్లు పదే పదే చూపించడం అంతగా సింక్ కాలేదు. మొత్తానికి కమల్ అన్ని రకాలుగా ఫెయిల్ అయిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. జిబ్రాన్ సంగీతం పాటల్లో పూర్తిగా తేలిపోయింది. ఉత్తమ విలన్ కు అర్థం కాని పాటలు ఇచ్చిన ఇతన్ని కమల్ ఎందుకు అంతగా ఇష్టపడతాడో జుట్టు పీక్కున్నా అర్థం కాదు.
శామ్ దత్, సను ల ఛాయాగ్రహణం చాలా వరకు మూడ్ పూర్తిగా చెడగొట్టకుండా కాపాడింది. రాజ్ కమల్ ప్రొడక్షన్ వాల్యూస్ వంక పెట్టేలా లేవు
విశ్వరూపం చూసి ఏవేవో అంచనాలు పెట్టుకుని వెళ్తే ఈ సీక్వెల్ పూర్తిగా నిరాశ పరుస్తుంది. దానిలో పావలా వంతు కూడా లేని ఈ రెండో భాగం కమల్ కోసం తప్ప చూడడానికి మరే కారణం కనిపించదు. కథ లేకపోయినా పర్వాలేదు ఏదో ఒకటి తీసేద్దాం అనుకుని కమల్ అందించిన విశ్వరూపం 2 కమల్ అంటే పడిచచ్చిపోయే అభిమానులకు కూడా ఓ మోస్తరుగా మాత్రమే ఓకే అనిపించే అవకాశం ఉంది. ఓ రెండు యాక్షన్ సీన్లు తప్ప మిగిలినదంతా ప్రహసనంలా మారిన విశ్వరూపం 2ని భరించడం కష్టమే
విశ్వరూపం 2 – ఖంగాళీ సీక్వెల్