మొదటి నోటీసు అందుకోనున్న ఎమ్మెల్సీ!
నయీం కేసులో తొలి అడుగు పడబోతోంది. నయీంతో చాలాకాలంపాటు అరాచకాలు సాగించిన ఓ ఎమ్మెల్సీకి తొలి నోటీసులు జారీ చేయనున్నారు. ఈ మేరకు సిట్ అధికారులు సోమవారం నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వారం రోజులుగా నయీం కేసు కొంచెం నెమ్మదించింది. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పోలీసులు తిరిగి కేసుపై దృష్టి పెట్టారు. ఇప్పటికే సదరు ఎమ్మెల్సీకి నోటీసుల గురించి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే, అధికారికంగా జారీ చేసే తేదీపై […]
నయీం కేసులో తొలి అడుగు పడబోతోంది. నయీంతో చాలాకాలంపాటు అరాచకాలు సాగించిన ఓ ఎమ్మెల్సీకి తొలి నోటీసులు జారీ చేయనున్నారు. ఈ మేరకు సిట్ అధికారులు సోమవారం నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వారం రోజులుగా నయీం కేసు కొంచెం నెమ్మదించింది. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పోలీసులు తిరిగి కేసుపై దృష్టి పెట్టారు. ఇప్పటికే సదరు ఎమ్మెల్సీకి నోటీసుల గురించి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే, అధికారికంగా జారీ చేసే తేదీపై స్పష్టత రాలేదు. నయీం కేసులో మొత్తం ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు 21 మంది పోలీసులను కేసులో నిందితులుగా చేర్చాలని సిట్ యోచిస్తోంది. వీరందరికి నోటీసులు జారీ చేసే ముందు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు సిట్ అధికారులు. అందుకే, నయీం ఎన్‌కౌంటర్ ముగిసి రెండు నెలలుదాటినా ఇంతవరకూ ఎవరికీ అధికారికంగా నోటీసులు జారీ చేయలేదు. ఒకవేళ జారీ చేస్తే.. ఆ కారణం.. ఈ కారణం అంటూ చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకుని విచారణ నుంచి తప్పించుకునేందుకు ప్లాన్లు వేస్తారని సిట్ ముందే ఊహించింది. అందుకే, నయీంతో కలిసి కబ్జా చేసిన భూముల తాలూకు లింకు డాక్యుమెంట్లు సంపాదించింది. అలాగే, రిజిస్ట్రేషన్లు- స్టాంపుల శాఖల నుంచి వీరు, వీరి బంధువులు, బినామీలపై ఉన్న ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఇప్పటికే తెప్పించారు. నోటీసులు ఇచ్చిన వారికి ఇవన్నీ చూపెట్టి అక్కడే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలన్నది సిట్ అధికారుల వ్యూహం. మొత్తానికి సిట్ విధించబోయే పద్మవ్యూహంలో నిందితులెవరూ తప్పించుకోలేని పరిస్థితిని కల్పించనున్నారు సిట్ అధికారులు.