Telugu Global
NEWS

దానధర్మాలు తగ్గించుకోవాలని వెంకయ్యను కోరుతున్న ఆయన గ్రామస్తులు

(వారంరోజులనుంచి సోషల్‌మీడియాలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని ఉద్దేశించి ఒక నెటిజన్‌ రాసిన లేఖ సంచలనం రేపుతోంది. ఆ లేఖను తెలుగుగ్లోబల్‌.కామ్‌ పాఠకులకోసం ఇక్కడ అందిస్తున్నాము.) పెద్దలు వెంకయ్య గారికి, చవటపాలెం గ్రామస్తులు రాయునది.., మీ స్వగ్రామం చవటపాలెం గ్రామస్థులమందరమూ కూర్చుని మిక్కిలి ఆందోళనతో మీకు రాసుకుంటున్న లేఖ ఏమనగా…! మన రమణమ్మ, రంగయ్యనాయుడు కొడుకు ఇంత గొప్పగా ఎదిగినందుకు… ఎంతగా ఎదుగుతున్నా తెలుగోడి కోసం మాత్రమే మాట్లాడుతున్న తీరుకు మీ సొంతూరి ప్రజలుగా ఎంతో ఆనందించాం… మిమ్మల్ని ఐక్యరాజ్యసమితి […]

దానధర్మాలు తగ్గించుకోవాలని వెంకయ్యను కోరుతున్న ఆయన గ్రామస్తులు
X

(వారంరోజులనుంచి సోషల్‌మీడియాలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని ఉద్దేశించి ఒక నెటిజన్‌ రాసిన లేఖ సంచలనం రేపుతోంది. ఆ లేఖను తెలుగుగ్లోబల్‌.కామ్‌ పాఠకులకోసం ఇక్కడ అందిస్తున్నాము.)

పెద్దలు వెంకయ్య గారికి,

చవటపాలెం గ్రామస్తులు రాయునది..,

మీ స్వగ్రామం చవటపాలెం గ్రామస్థులమందరమూ కూర్చుని మిక్కిలి ఆందోళనతో మీకు రాసుకుంటున్న లేఖ ఏమనగా…!

మన రమణమ్మ, రంగయ్యనాయుడు కొడుకు ఇంత గొప్పగా ఎదిగినందుకు… ఎంతగా ఎదుగుతున్నా తెలుగోడి కోసం మాత్రమే మాట్లాడుతున్న తీరుకు మీ సొంతూరి ప్రజలుగా ఎంతో ఆనందించాం… మిమ్మల్ని ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడిగా చేసినా సరే, మీరు మాత్రం మన 13 జిల్లాల గురించే ఆలోచిస్తారనేది మా ప్రగాఢ నమ్మకం… నిరుపేదలను ఉద్దరించటానికి మీరు పెట్టిన స్వర్ణభారతి ట్రస్టు, ఏదో కుటుంబం గడవటానికి మీ కొడుకు విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం గురించి కథలు వినీ వినీ, మేం ఆనందించామే తప్ప ఏనాడూ చింతించలేదు…

ఒకప్పుడు ఏమీ లేని కుటుంబం ఇప్పుడు వేల కోట్లకు ఎదిగిందంటే దాని వెనుక మీ ఆలోచనలు, కార్యదక్షత, ప్రణాళికలు ఉంటాయి కదా… కానీ ఓ వార్త మమ్మల్ని కలవరపెడుతున్నది… మీరు ఏదో ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కోసం అక్షరాలా వేయి నూటా పదహార్ల రూపాయలను ఉదారంగా విరాళం పంపించారట…

bank-slipఏమిటి సారూ? మీరు కూడా ఇలా ఆలోచిస్తే ఎలా అనేదే మా ఆందోళన… మీ కుటుంబం పచ్చగా ఉంటే, సొంతూరు కదా, అని మాకూ ఏదో ఒకటి చేయకపోరులే అని ఇన్నాళ్లూ ఆశపడుతూ వచ్చాం… మీరిలా దానకర్ణుడి వారసుడిలా ఇంతింతగా దానాలు చేస్తూ పోతే, మీ వేల కోట్లు ఆరిపోవటానికి ఎంతోకాలం పట్టదు సారూ? మళ్లీ మీరు జీరో స్థాయికి చేరినా సరే, మిమ్మల్ని మీ సొంతూరు కన్నతల్లిలా అక్కున చేర్చుకుంటుంది… కానీ ఎందుకా సాహసాలు? గతంలో కూడా మీరు అలాగే మద్యనిషేధ ఉద్యమకారిణి దూబగుంట రోశమ్మకు ఏకంగా 50 వేల రూపాయల విరాళం ఇచ్చారనగానే మాకూ ఒళ్లు జల్లుమంది…

ఏమిటీ వెంకయ్య గారూ, ఇలా ఆస్తులన్నీ తగలేస్తున్నారనే అనిపించింది… కానీ నగదు ఇస్తామంటూ చెక్ వాపస్ తీసుకుని, మొత్తం ఎగ్గొట్టారనే వార్తలు ఎంతోకొంత మాకు రిలీఫ్ కలిగించాయి… కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి… మీకు కొండంత ఆస్తి ఉంది, కానీ దాన్ని పెంచండి తప్ప కరిగించొద్దు… ఇలా ఎడాపెడా, విచ్చలవిడిగా దానాలు చేస్తే, ఇక మీ మనమలు, మనరాళ్లకు ఏం మిగిలిస్తారు? యురి ఉగ్రవాద దాడి దురదృష్టకరమే… కానీ దానికి ఇంతగా మీరు స్పందించి, బాధపడి, కన్నీళ్లుపెట్టుకుని, ఖండించేసి, ఇలా విపరీతంగా విరాళాలు ఇవ్వడం మాత్రం కొంత ఆందోళనకరంగానే ఉంది… పెద్ద పెద్ద టాటాలు, అంబానీలు, ఆదానీలు, వేదాంతలకే సాధ్యం

కాని అంతంత మొత్తాల్ని మీరు దానం చేయడం మాకు దిగ్భ్రాంతిని కలిగించింది…

కాబట్టి, ఈ వయసులో మీరు ఇంతటి సాహసాలు చేయకపోవడమే మంచిదని, మీ సొంతూరి ఆప్తులుగా చెప్పడం మా కర్తవ్యంగా భావించి ఇలా లేఖ రాస్తున్నాం… అన్యథా భావించవద్దు… తప్పులుంటే క్షమించగలరు…

Click on Image to Read:

chandrababu-phd

chandrababu-naidu-english

mlc-sudhakar-babu

First Published:  24 Sept 2016 6:31 AM IST
Next Story